కార్పొరేషన్ సమావేశం రచ్చ..రచ్చ
♦ మహిళా కార్పొరేటర్ల బాహాబాహీ
♦ చెప్పు తీసి.. తిట్ల దండకం
♦ ఓ కార్పొరేటర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. ఇద్దరు మహిళా కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. ఓ కార్పొరేటర్ ఏకంగా చెప్పు తీశారు. కార్పొరేటర్లు ఇరువురూ అధికార టీఆర్‌ఎస్ వారే కావడం విశేషం. కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ప్రారంభంలోనే జీరో అవర్ కింద శానిటేషన్‌పై వాడీవేడిగా చర్చ జరిగింది. 23వ డివిజన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని, ఇతర కార్పొరేటర్లు తన డివిజన్‌లోకి వచ్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ కార్పొరేటర్ తాటి ప్రభావతి మేయర్ పోడియం వద్ద బైఠాయించారు.
తననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నావంటూ 4వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత పోడియం వద్దకు వచ్చి ప్రభావతితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆవేశానికి లోనైన ప్రభావతి చెప్పు తీశారు. ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగారు. సరిత భర్త అశోక్ తన అనుచరులతో వచ్చి ప్రభావతిని దూషిస్తూ కౌన్సిల్ ప్రధాన ద్వారంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే భోజన సమయం కావడంతో బ్రేక్ ఇచ్చారు. లంచ్ అనంతరం కార్పొరేటర్లతో మేయర్ సమావేశమై ఘటనపై చర్చించారు. తిరిగి సమావేశమయ్యాక క్షమాపణ చెప్పాలనడంతో ప్రభావతి కౌన్సిల్ హాల్‌లోకి వచ్చి చెప్పు తీయడం తప్పేనన్నారు. తనను దూషించినవారిని కూడా సస్పెండ్ చేయాలని, లేని యెడల ఆత్మహత్య చేసుకుంటానంటూ మైకు వైరును మెడకు బిగించుకునే ప్రయత్నం చేశారు. అయితే అత్యవసర అంశాలను ఆమోదించి సభను మేయర్ వాయిదా వేశారు.