ఐదేళ్లు.. ఆరుగురు కమిషనర్లు | IAS Transfers Karimnagar Municipal Corporation | Sakshi
Sakshi News home page

ఐదేళ్లు.. ఆరుగురు కమిషనర్లు

Published Sat, May 4 2019 9:41 AM | Last Updated on Sat, May 4 2019 9:41 AM

IAS Transfers Karimnagar Municipal Corporation - Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగర పాలక సంస్థ కమిషనర్లకు శిక్షణ కేంద్రంలా మారింది. బదిలీపై వచ్చి ఇక్కడి పరిస్థితులు, పాలనపై పట్టు సాధించేలోపు పదోన్నతులు పొందడం, బదిలీ చేయించుకుని వెళ్లడం ఆనవాయితీగా తయారైంది. గత ఐదేళ్లలో ఆరుగురు కమిషనర్లు వచ్చి వెళ్లగా.. మరో నలుగురికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించాల్సి వచ్చింది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకనా.. ఒత్తిడిని తట్టుకోలేకనా..! అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు కమిషనర్ల బదిలీల కారణంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్‌ ఏడాదిన్నర క్రితం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని వంద నగరాల సరసన చేరి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అంతకుముందు అమృత్‌సిటీకి ఎంపికైంది. గత యేడాది అత్యంత నివాసయోగ్యమైన నగరంగా దేశంలో 11వ స్థానాన్ని సాధించింది. ప్రతీ యేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన స్థానం సాధిస్తోంది. దేశంలోని స్మార్ట్‌సిటీ కార్పొరేషన్లలో అతి తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ జనాభా కలిగి ఉండి రేపో మాపో మహానగర హోదా కూడా దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న నరగపాలక సంస్థలో కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చిన అధికారులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఐదేళ్లలో ఆరుగురు కమిషనర్లు వచ్చి వెళ్లారు. ఆరుగురిలో ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు నాన్‌ ఐఏఎస్‌లు ఉండడం గమనార్హం. ఐఏఎస్‌లు పదోన్నతులు పొంది వెళ్లగా, నాన్‌ ఐఏఎస్‌ల్లో ఒకరు డిప్యూటేషన్‌ ముగిసి, మరో ఇద్దరు యేడాది మధ్యలోనే బదిలీ చేయించుకొని మరీ వెళ్లారు.

ఐఏఎస్‌లు వచ్చినా...
ఐఏఎస్‌ అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్లుగా వచ్చినా ప్రజలు ఆశించిన మేరకు పనిచేయలేదు. ఇద్దరు పరిస్థితులు అర్ధం చేసుకునేలోపే బదిలీ కాగా, ఒక్కరు ఏడాదిన్నరకు పైగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ తొలి పర్యటనలో ఐఏఎస్‌ అధికారి శ్రీకేష్‌లఠ్కర్‌ను కమిషనర్‌గా నియమించారు. 2014 ఆగస్టు 6న ఆయన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్‌ వ్యవహారాలు అర్థం చేసుకోకముందే నాలుగు నెలలకే ఏపీ, తెలంగాణ ఐఏఎస్‌ల విభజనలో ఏపీకి వెళ్లారు. 2015 డిసెంబర్‌ 14న వచ్చిన దేవరకొండ కృష్ణభాస్కర్‌ 10 నెలలు పనిచేయగానే జిల్లాల విభజన సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. కార్పొరేషన్‌పై పట్టు సాధిస్తున్న సమయంలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఐఏఎస్‌ అధికారి కొండూరి శశాంక ఒక్కరే 21 నెలలపాటు కమిషనర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. గద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతితో బదిలీ అయ్యారు. వీరంతా జగిత్యాల సబ్‌ కలెక్టర్‌గా పనిచేసి ఇక్కడికి వచ్చిన వారే కావడం గమనార్హం.
 
యేడాది పనిచేయని మాతృశాఖ కమిషనర్లు...
ఐఏఎస్‌ అధికారులు పద్నోన్నతులతో వెళ్లగా, సెక్రటేరియట్‌లో పనిచేస్తూ కమిషనర్‌గా వచ్చిన కరోల్‌ రమేశ్‌ యేడాది డిప్యూటేషన్‌ ముగియగానే వెళ్లిపోయారు. ఐఏఎస్‌ అధికారి లఠ్కర్‌ బదిలీ తర్వాత 2015 జనవరిలో వచ్చిన మున్సిపల్‌ విభాగానికి చెందిన కేవీ రమణాచారి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేవలం 10 నెలలకే వివిధ కారణాలతో సెలవులో వెళ్లి అటు నుంచి అటే బదిలీ చేయించుకున్నారు. చివరగా 2018 అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీ నుంచి కమిషనర్‌గా బదిలీపై వచ్చిన కన్నం సత్యనారాయణ 6 నెలలు పనిచేసి ఎన్నికల కోడ్‌ ఉండగానే ఎక్సైజ్‌ శాఖమంత్రి పేషీలోకి కేటాయించడంతో వెళ్లిపోయారు. మున్సిపల్‌ విభాగానికి చెందిన వారు కూడా పూర్తిస్థాయిలో పనిచేయకుండా అర్ధంతరంగా బదిలీపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం...
కరీంనగర్‌ నగరపాలక సంస్థ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉంది. సీఎం హామీ నిధులు రూ.347 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.30 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోని 50 డివిజన్లతో ఏ గల్లీలో చూసినా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. దీనికి తోడు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌కు సైతం కమిషనరే ఎండీగా వ్యవరిస్తారు. స్మార్ట్‌సిటీ పనులు సైతం కమిషనర్‌ కనుసన్నల్లోనే సాగుతున్నాయి.

పూర్తిస్థాయిలో కమిషనర్లు పనిచేయకపోవడంతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొత్తగా కమిషనర్లు వచ్చిన ప్రతిసారి రెండు మూడు నెలలపాటు ఏరియాను అవగాహన చేసుకోవడం, పాలనపై పట్టు సాధించడానికే సరిపోతుంది. ఆ తర్వాత పనులు ప్రారంబించాలనుకునే సరికే బదిలీపై వెళ్లడం ఆనవాయితీగా మారింది. దీంతో అన్ని విభాగాలపై ప్రభావం పడుతోంది. శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల పనితీరును మెరుగు పరచలేకపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్‌పై కూడా పట్టుసాధించలేక పోవడంతో బల్దియాలో ఉద్యోగుల ఇష్టారాజ్యం నడుస్తోంది. అభివృద్ధి పనులు పూర్తయిన చోట బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు నిరాసక్తతోనే ఉన్నారు. పనులు ముందుకు కదలడం లేదు. యేడాది క్రితం టెండర్లు పూర్తయిన పనులు కూడా గ్రౌండింగ్‌ కాకుండా ఉండడం అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుకు నిదర్శనం.

ఈసారైనా పూర్తిస్థాయి కమిషనర్‌ వచ్చేనా..?
ఐదేళ్లుగా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించకపోవడంతో కరీంనగర్‌లో అభివృద్ధి అధ్వానంగా తయారైంది. ఈసారైనా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియామకం చేయాల్సిన అవసరం ఉంది. ఆరు నెలలకోసారి కమిషనర్లు మారుతుంటే కరీంనగర్‌ అభివృద్ధిలో వెనుకబడే అవకాశం ఉంది. జూలై 2తో పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో నూతన పాలకవర్గానికి ఎన్నికల నిర్వహణ సవాలుగానే ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న కమిషనర్‌ అవసరం ఎంతో ఉంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఐఏఎస్‌ అయినా... మున్సిపల్‌ విభాగానికి చెందిన అధికారినైనా పూర్తిస్థాయిలో పనిచేసే కమిషనర్‌గా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement