కేంద్రం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని స్పష్టం చేసిన హైకోర్టు
డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్
వారి స్థానంలో ఇతర అధికారులకు ఇన్‌చార్జులుగా అదనపు బాధ్యతలు
సందీప్‌కుమార్‌కు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కోలు అప్పగింత
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి.. శ్రీదేవికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు
ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్టు చేసిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు
త్వరలో రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు జరిగే చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల విభజన వివాదానికి నాటకీయ పరిణామాల మధ్య తెరపడింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్), హైకోర్టులో కేసులపై బుధవారం స్పష్టత వచ్చింది. ఐఏఎస్ అధికారులు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలన్న..‘కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)’ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు ఏపీకి రిలీవ్‌కాగా.. ఏపీ నుంచి ముగ్గురు తెలంగాణలో రిపోర్టు చేశారు. ఇక ఐపీఎస్‌లకు సంబంధించిన కేడర్ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
రిలీవ్.. ఇతర అధికారులకు బాధ్యతలు
ఇరు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల్లో భాగంగా ‘కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)’.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్‌లను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై, క్యాట్ ఆదేశాలపై ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు బుధవారంలోపే ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను వెంటనే రిలీవ్ చేసింది.
రిలీవైన అధికారుల్లో ఇంధన శాఖ కార్యదర్శి/జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల ఇన్‌చార్జి సీఎండీ రోనాల్డ్ రోస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి, స్త్రీ/శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ మల్లెల ప్రశాంతి ఉన్నారు. ఇక రిలీవైన అధికారుల స్థానంలో ఇతర అధికారులకు ఇన్‌చార్జులుగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు చాన్స్!
మొత్తంగా ఐదుగురు ఐఏఎస్‌లు తెలంగాణ నుంచి వెళ్తుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐఏఎస్‌లు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వెళ్లినవారి శాఖల్లో పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర పాలన యంత్రాంగంలో మరోసారి భారీగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఉన్న డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ భిష్త్‌లు కూడా డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లాల్సి ఉండనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు రావొచ్చని అంటున్నారు.
ప్రత్యూష్ సిన్హా సిఫార్సులే ఫైనల్
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం.ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్‌ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి.సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేంద్రం కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిష్త్, అభిషేక్ మహంతిలను ఏపీకి కేటాయించారు.
అయితే ఈ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించగా.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టివేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. దానిపై కేంద్రం తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా.. సోమేశ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సోమేశ్‌కుమార్ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలంటూ 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది.
అంతేగాకుండా ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను హైకోర్టు సమర్థించింది. దీంతో సోమేశ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును కోల్పోవాల్సి వచ్చింది. ఈ తీర్పును ఇతర అధికారులకు కూడా వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఏడాది జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపుపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది.
ఆ అధికారుల ప్రస్తుత, మిగిలిన సర్వీసు, వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. గతంలో జరిపిన తుది కేటాయింపులను పునఃసమీక్షించే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది. ఈ మేరకు డీవోపీటీ మాజీ సెక్రెటరీ దీపక్ ఖండేకర్‌తో ఏర్పాటైన ఏకసభ్య కమిటీ.. కేడర్ కేటాయింపుపై ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా.. ఐఏఎస్‌లు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది.
సందీప్‌కు మళ్లీ ఇంధనశాఖ బాధ్యతలు
ప్రభుత్వం కీలకమైన ఇంధనశాఖ కార్యదర్శి/ట్రాన్స్‌కో, జెన్‌కోల ఇన్‌చార్జి సీఎండీగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను అప్పగించింది. గతంలో ఆయనకు పలుమార్లు ఈ పోస్టుల అదనపు బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రవాణా శాఖ కమిషనర్ టి.ఇలంబర్తికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతగా అప్పగించింది.
మరోవైపు ఏపీకి రిలీవైన రోనాల్డ్ రోస్ సతీమణి, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిణి విశాలాచ్చి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆమె సైతం తెలంగాణ నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా ఆర్వీ కర్ణన్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏపీ నుంచి తెలంగాణలో రిపోర్టు చేసిన ముగ్గురు ఐఏఎస్‌లు
డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ నుంచి రిలీవైన ఐఏఎస్ అధికారులు శివశంకర్ లోతేటి, శ్రీజన, సి.హరికిరణ్ బుధవారం తెలంగాణలో రిపోర్టు చేశారు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిశారు. మరోవైపు తుది కేటాయింపుల్లో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సి ఉన్న ఐపీఎస్ అధికారులపై సందిగ్ధం కొనసాగుతోంది. రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీ అంజనీకుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ భిస్త్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఇంకా ఉత్తర్వులు రాలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment