ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్(ఎఫ్‌ఏసీ)గా ఇలంబర్తి
సాక్షి, సిటీబ్యూరో: ఊహించినట్లుగానే జీహెచ్‌ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి..ఆంధ్రప్రదేశ్ బాట పట్టక తప్పలేదు. తనను తెలంగాణలోనే కొనసాగించాలని మరికొందరు ఐఏఎస్ అధికారులతో పాటు క్యాట్‌ను ఆశ్రయించగా..అక్కడ చుక్కెదురుకావడంతో.. వెంటనే హైకోర్టు మెట్లెక్కినా, ఉపశమనం లభించలేదు.
ముందైతే డీఓపీటీ ఆదేశాల కనుగుణంగా ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు పేర్కొనడంతో జీహెచ్‌ఎంసీ నుంచి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పునివ్వగలదని జీహెచ్‌ఎంసీ వర్గాలు భావించాయి. క్యాట్‌లో ఊహించని పరిణామం ఎదురవడంతో.. కనీసం హైకోర్టు అయినా మిగతా వారితోపాటు ఆమ్రపాలికి అనుకూలంగా ఆదేశాలివ్వగలదని ఆశించినప్పటికీ, హైకోర్టు సైతం ఏపీకి వెళ్లాలని స్పష్టం చేయడంతో జీహెచ్‌ఎంసీ వర్గాలు ఉస్సూరుమన్నాయి.
ఇప్పుడిప్పుడే..
బల్దియా వ్యవహారాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో కమిషనర్ మార్పుతో పరిస్థితులు మళ్లీ మొదటికి రానున్నాయి. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్‌ఎంసీలో ఆరుజోన్లు, 30 సర్కిళ్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పరిధికి తగ్గట్లే చెత్త సమస్యలు, తదితరమైనవి ఉన్నాయి. ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ సైతం సవ్యంగా జరగని దుస్థితినుంచి పరిస్థితుల్ని ఓ గాడిన పెట్టేందుకు ఆమ్రపాలికి సమయం సరిపోలేదు. జీహెచ్‌ఎంసీని అర్థం చేసుకొని, ఇప్పుడిప్పుడే ఒక్కో విభాగంపై పట్టు సాధిస్తున్న తరుణంలో అనూహ్యంగా వెళ్లాల్సి వచ్చింది.
అసలే అస్తవ్యస్తంగా ఉన్న జీహెచ్‌ఎంసీలో సిబ్బంది జీతాల చెల్లింపుల నుంచి నిర్వహణ పనులకు సైతం నిధుల కటకట ఉంది. క్రమశిక్షణ లేని సిబ్బంది..బదిలీలైనా సీట్లను వదలని ఉద్యోగులు.. ఒప్పందాలున్నా పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టు ఏజెన్సీలు..విధులకు చుట్టపుచూపుగా వచ్చిపోయే ఉద్యోగులు..వచ్చినా పనులు చేయకుండా కాలక్షేపం చేసే వాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జీహెచ్‌ఎంసీలో సమస్యలకు అంతేలేదు. అంతర్గత బదిలీల్లోనూ ఆమ్రపాలినే మాయ చేసి కావాల్సిన సీట్లలో పాతుకుపోయిన వారు కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో కొత్త కమిషనర్‌కు బాధ్యతల నిర్వహణ కత్తిమీద సామే కానుంది. జీహెచ్‌ఎంసీ విభజన, దాదాపు ఏడాది కాలంలో జరగనున్న పాలకమండలి ఎన్నికలు ఇలా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.
కమిషనర్‌గా ఇలంబర్తి
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలంబర్తి గతంలో సెంట్రల్‌జోన్ (ఖైరతాబాద్) కమిషనర్‌గా పనిచేశారు. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆయనకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలప్పగించిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment