ఈ ఫొటోలో కనిపిస్తున్నది వాగులు, కాలువలు కాదు. నగరం నడిబొడ్డున ఉన్న జ్యోతినగర్‌లోనిది. ఇటీవల కురిసిన చిన్న వర్షాలకే డ్రెయినేజీలు నిండి రోడ్లన్నీ వాగులై ప్రవహిం చాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా కష్టపడి ఇళ్లలో చేరిన నీటిని బయట పారబోసేందుకు తిప్పలుపడ్డారు. నాలుగు డివిజన్ల వరద నీళ్లు చిన్న డ్రెయినేజీల నుంచి వెళ్లడం గగనంగా మారింది. ఇది ఈ ఒక్క రోజు సమస్య కాదు. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం కురిసిన ప్రతిరోజూ ప్రజలు జాగారం చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో పేరు గడిస్తున్న కరీంనగర్‌ను నగర సమస్యలు వెక్కిరిస్తున్నా యి. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న నగరం.. స్థానికంగా ప్రజలను మెప్పించలేకపోతోంది. చిన్నపాటి వర్షం వస్తే చాలు నగరమంతా అతలాకుతలమవుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయం. ఇటీవలే కేరళ రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. పెద్దపాటి వర్షం కురిస్తే నగరం జలమయంలో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే దీనంతటికి కారణం. ప్రస్తుతం నగరంలో డ్రెయినేజీ నిర్మాణాలు నడుస్తున్నా.. ‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది పనుల ప్రగతి. – కరీంనగర్‌కార్పొరేషన్
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఒక్క వానకే చాలా ప్రాంతాల్లోని వీధులు జలమయమవుతున్నాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లుతూ మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య 20 ఏళ్లుగా ఉన్నా.. శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. గతానుభవాలను పాఠాలుగా స్వీకరించాల్సిన అధికారులు ఎప్పటిలాగే హడావిడి చేసి వదిలేస్తున్నారు. పాలకులు సైతం హామీలకు పరిమితమై పనులను పక్కనబెడుతున్నారు. చిన్న వానలకే చెరువులను తలపిస్తున్న నగరంలో ఇక భారీ వర్షాలు, వరదలు వస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కేరళ తరహాలో వర్షాలు పడితే మన పరిస్థితేంటనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. నగరంలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అవసరమైన పనులు జరగకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు వస్తే జరిగే నష్టం మామూలుగా ఉండదని తెలిసినప్పటికీ ఆ స్థాయిలో పనులు కాకపోవడం గమనార్హం.
ముందుచూపు కరువాయె..
కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కాలం వెల్లదీస్తున్నారు. బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో ముందు చూపు కరువైంది. వరద నీటి ఉధృతిని బట్టి డ్రెయినేజీలు నిర్మించడం లేదు. ఏళ్లుగా సమస్య ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా తయారైంది. చిన్న వానకే డ్రెయినేజీలు పొంగిపొర్లుతూ మురుగునీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. కేరళలో జరిగిన జలప్రళయాన్ని తలచుకుని నగర ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు.
2016 సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురువగా లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఆ సమయంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ వరద ప్రాంతాల్లో సందర్శించి యుద్ధ ప్రాతిపదికన నూతన డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న అధికారులు అవసరమైన చోట మాత్రం పనులు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లోతట్టు జలమయం..
పలు డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలు వర్షాకాలంలో చెరువులను తలపిస్తున్నాయి. జ్యోతినగర్, కురుమవాడ, ముకరంపుర, హరిహరనగర్, రాంనగర్, కరీంనగర్ డైరీ వెనుక ప్రాంతం, కోతిరాంపూర్, లక్ష్మీనగర్, భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, ఇందిరానగర్, అశోక్‌నగర్, హౌజింగ్‌బోర్డుకాలనీ, హుస్సేన్‌పుర, ఆమెర్‌నగర్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాలు చిన్న వర్షానికే జలమయమవుతున్నాయి. వరదనీటిని మళ్లించడానికి ప్రణాళికాబద్ధంగా డ్రెయినేజీలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు మురుగునీటి డ్రెయినేజీల ద్వారానే వరద నీరు వెళ్తోందని నిమ్మకుండి పోయారు. అయితే.. వరద నీటి తాకిడికి డ్రెయినేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు ఎక్కడికక్కడ నిలిచి చెరువులను తలపిస్తోంది. ప్రధాన రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో వర్షం పడే సమయంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.
స్లమ్‌లకంటే అధ్వానం..
డ్రెయినేజీల నిర్మాణంలో ప్రణాళికాలోపంతో లోతట్టు ప్రాంతాలు ఉన్న డివిజన్లు స్లమ్ ఏరియాలుగా మారుతున్నాయి. కేవలం డ్రెయినేజీల లోపంతోనే ఈ సమస్య వస్తోంది. నీరు వెళ్లే మార్గాన్ని బట్టి డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 15, 45 డివిజన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే.. 40, 43, 44వ డివిజన్ల నుంచి వరద నీరు ఈ ప్రాంతాల మీదుగానే వెళ్తుండడంతో సమస్య తీవ్రంగా మారింది. అదేవిధంగా 14వ డివిజన్ ఇందిరానగర్, 1వ డివిజన్ సుభాష్‌నగర్, 8వ డివిజన్ హుస్సేనిపుర, 25వ డివిజన్ కోతిరాంపూర్‌లలో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వరద నీటికి తగిన విధంగా డ్రెయినేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. వర్షం వెలిసిన తర్వాత ఆ ప్రాంతాలన్నీ బురదమయంగా మారి స్లమ్ ఏరియాలను తలపిస్తున్నాయి. నడవడానికి కూడా వీలులేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పెద్ద డ్రెయినేజీలే పరిష్కారం..
భారీ వర్షాలు పడితే కలిగే ముప్పు నుంచి బయటపడాలంటే వరద నీటితో మునుగుతున్న లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద డ్రెయినేజీలు కట్టడమే దీనికి పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీలు పెద్దగా చేపట్టాలంటే రోడ్డును తవ్వడం తప్ప వేరే మార్గం లేదు. రోడ్డు మధ్యలో పెద్ద డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి దానిపై స్లాబు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది.
డ్రెయినేజీల నిర్మాణానికి రూ.20 కోట్లు..
లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతిని తట్టుకునేలా డ్రెయినేజీల నిర్మాణానికి రూ.20 కోట్లతో పనులు చేపడుతున్నాం. నగరంలో ఎక్కడ ముంపు ప్రాంతముంటే అక్కడ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పూర్తిచేశాం. కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కేటాయించిన నిధులు వెచ్చించి పనులన్నీ పూర్తిచేస్తాం. వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిత చర్యలు చేపడతాం. – రవీందర్‌సింగ్, మేయర్
Comments
Please login to add a commentAdd a comment