
'స్మార్ట్ సీటీల ఎంపికలో అన్యాయం'
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌సిటీల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసి అటు ఆంధ్రప్రదేశ్‌కు, ఇటు తెలంగాణకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నా ఏపీకి న్యాయం చేయించుకోవడంలో చంద్రబాబు విఫలమైనాడని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు తప్ప చేతల్లో ఏమీ సాధించుకోలేకపోతున్నాడన్నారు.
కేసీఆర్ వ్యక్తిగత పనులను మాత్రమే చక్కదిద్దుకుంటున్నాడని షబ్బీర్ అలీ ఆరోపించారు. స్మార్ట్‌సిటీల ఎంపికకోసం టీఆర్‌ఎస్ ఎంపీలను సరైన మార్గంలో కేసీఆర్ నడిపించలేకపోయాడని ఆరోపించారు. కేసీఆర్ చేతకాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని షబ్బీర్ ఎద్దేవా చేశారు.