సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ...‘హైదరాబాద్ విశ్వనగరం సంగతి దేవుడెరుగు...కేసీఆర్ హైదరాబాద్‌ను నరక నగరంగా మార్చారు. గవర్నర్ బంగ్లా ముందు నీళ్లు నిలుస్తున్నాయని కేసీఆర్ గతంలో విమర్శించారు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నీళ్లు నిల్చినా ఎందుకు మాట్లాడటం లేదు. వర్షాలు, వరదనీటితో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఆయన నటుడు ప్రకాశ్ రాజ్‌పై మండిపడ్డారు. శాంతి భద్రతల గురించి అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారన్నారు. గౌరీ లంకేశ్ హంతకులను కర్ణాటక ప్రభుత్వం శిక్షిస్తే ఎవరొద్దనరని అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడి పరువు తీసుకోవద్దని లక్ష్మణ్ ఈ సందర్భంగా సూచించారు.
కాగా గత ఆదివారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయింది. నిన్న వర్షం కురిసినప్పటికీ ఆ ప్రభావం ఇవాళ కూడా కనిపించింది. మాదాపూర్, గచ్చిబౌలి వయా జూబ్లిహిల్స్‌కు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ జాంలో నరకం అనుభవించారు. సాధారణంగా ఉదయం వేళల్లో 40 నిమిషాలలో చేరుకోవలసి ఉండగా మంగళవారం సుమారు 5 గంటలు సమయం పట్టింది. కంపెనీలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు సకాలంలో చేరుకోలేక పోయారు. ఐటీ ప్రాంతంలోని రోడ్ల పై వర్షం నీరు నిల్చిపోవడం, భారీగా గుంతలు ఏర్పడ్డాయి.
భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయి కారు ఇంజిన్లోకి నీరు చేరి మొరాయించడంతో కార్లు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి. దీంతో ట్రాఫిక్ జాం మరింత పెరిగింది. రహేజా ఐటీ పార్క్ నుంచి బయో డైవర్సిటీ వరకు రోడ్డు పనులు జరుగుతుండటం, ఈ ప్రాంతంలొనే ట్రాఫిక్ దారి మళ్లించటం వంటి పనులతో ట్రాఫిక్ జాంకు కారణమవుతుంది. భారీ వర్షాలు కురుస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు చూపుతో వ్యవహరించక పోవడం సమస్యకు మరింత ఊతం ఇస్తోంది. సాయంత్రం అవుతుండడంతో ఐటీ ఉద్యోగుల్లో తిరుగు ప్రయాణం తలచుకొని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment