కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారు
కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారు
Published Tue, May 30 2017 3:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
మధిర : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దహస్థుడని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. దీన్‌దయాళ్ జన్మ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా మధిర దళితకాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్ధాయిలో ఎంతవరకు చేరుతున్నాయో పరిశీలించడం, బూత్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించి సమావేశపర్చడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీకి, దేశంలో పర్యటిస్తున్న అమిత్‌షాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఆదరణను తగ్గించేందుకు సర్వేపేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అటువంటి కుట్రలు, కుతంత్రాలు కేంద్రంముందు సాగవన్నారు. టీఆర్‌ఎస్‌కు నిజంగా 111 స్ధానాలు వస్తాయనుకుంటే, దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. సీట్లు రావని తెలిసి తప్పుడు సర్వే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కరెన్సీనోట్ల రద్దు సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదని.. ఆయనను అభినందించలేదా అని ప్రశ్నించారు. మెదడులేనివారే ఇటువంటి విమర్శలు చేస్తుంటారని తెలిపారు. రోడ్ల మంజూరులో నితిన్ గట్కారీకి ధన్యవాదాలు చెప్పలేదా అని ప్రశ్నించారు. మూడు ఒక్కట్లు సీట్లు రావడమంటే పంగనామాలని, తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆ పంగనామాలే పెడతారని ఎద్దేవా చేశారు. దళితులకు సీఎం పదవి ఇచ్చావని ఓటేయ్యాలా, కెజీటు పీజీ విద్య అమలు చేశావని ఓటేయ్యాలా, బీసీల రిజర్వేషన్‌ను తగ్గించి ముస్లింలకు కేటాయించినందుకు ఓటేయ్యాలా, రైతుల పంటలను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులను మూసివేసినందుకు ఓటేయ్యాలా, డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయలేదని ఓటేయ్యాలా, నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పినందుకు ఓటేయ్యాలా అని ప్రశ్నించారు.
అనంతరం దళిత కాలనీలో ఇంటింటికి పర్యటించి కేంద్ర అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం దళితులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజెపీ జిల్లా ఇంచార్జ్ యాదగిరి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, నాయకులు బాడిశ అర్జునరావు, పాపట్ల రమేష్, భవనం మధుసూదన్‌రెడ్డి, రామిశెట్టి నాగేశ్వరరావు, దుర్గారావు, రామయోగేశ్వరరావు, మహంకాళి శ్రీనివాసరావు, డీవీఎన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement