khamman
-
నా కూతురి చావుకు కారణం..ఆ ముగ్గురే!
ముదిగొండ: అదనపు కట్నం కోసం తన కూతురిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముదిగొండకు చెందిన కందుల అశోక్‌కు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన భవానితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ 8. లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఏడాది పాటు సంసారం సజావుగానే సాగింది. అనంతరం మరో రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు మామ వెంకటేశ్వర్లు, ఆడపడచు ఉమ వేధింపులకు పాల్పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా నిర్వహించారు. కాగా బుధవారం సాయంత్రం భవాని చనిపోయినట్లు గ్రామస్తుల ద్వారా ఆమె తండ్రి మన్మథరావుకు సమాచారం ఇచ్చారు. కాగా తన కూతురిని భర్త, మామ, ఆడపడచు హత్య చేసి, ఉరివేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించారని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ తాండ్ర నరేష్ సందర్శించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
అయ్యా.. ఎలా మోసపోయావయ్యా..?
దమ్మపేట: ఆయన పేరు శ్యాంబాబు. తాను మోసపోయానంటూ బ్యాంక్ అధికారి వద్దకు వెళ్లాడు. జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న ఆ అధికారి.. ‘‘పేపర్లు చూడడం లేదా? టీవీ చూడడం లేదా? ఈమాత్రం తెలియదా? బ్యాంక్ నుంచి ఎప్పుడూ.. ఏ ఒక్కరూ ఫోన్ చేయరు. ఎవరైనా మీకు ఫోన్ చేసి, ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని అన్నారంటే.. అతడుగానీ, ఆమెగానీ పచ్చి మోసగాళ్లన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది తరచుగా పత్రికల్లో, టీవీల్లో వస్తున్నది. అయినా మారు మారకపోతే ఎలాగయ్యా..! ఇలా ఇంకెన్నాళ్లు మోసపోతారయ్యా..?’’ అని, ఆ అధికారి ఆవేదనగా ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే... దమ్మపేటకు చెందిన అతడి పేరు శ్యాంబాబు. పూర్వపు ఎస్బీహెచ్ ఖాతాదారుడు. మంగళవారం అతడికి ఎవడో ఫోన్ చేశాడు. ‘‘నా పేరు అమిత్‌రెడ్డి. నేను హైదరాబాద్ కోఠి ఎస్బీఐ బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాను. మీ ఎస్బీహెచ్ ఖాతా, ఏటీఎం నంబర్లు బ్లాక్ అయ్యాయి. ఎస్‌బీహెచ్‌ను ఎస్బీఐలో విలీనం చేశారు. వెంటనే ఏటీఎం నంబర్, పిన్ చెప్పండి. లేకపోతే మీ ఖాతాలోని డబ్బు పోతుంది’’ అన్నాడు. శ్యాంబాబు భయపడ్డాడు. వెంటనే తన ఖాతా నంబర్, ఏటీఎం పిన్ చెప్పాడు. ‘‘మీ ఫోన్‌కు ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) వస్తుంది. ఆ నెంబర్ కూడా చెప్పాలి’’ అన్నాడు. కొద్దిసేపటి తరువాత మళ్లీ ఫోన్ చేశాడు. ఓటీపీ నంబర్‌ను శ్యాంబాబు చెప్పాడు. కొద్దిసేపటి తరువాత, శ్యాంబాబు సెల్‌కు మెసేజ్ వచ్చింది. ఖాతా నుంచి రూ.500 డ్రా అయిట్టుగా అందులో ఉంది. ఇంకాసేపటిలో మరో మెసేజ్ వచ్చింది. ఈసారి రూ.9000 డ్రా అయినట్టుగా అందులో ఉంది. శ్యాంబాబు లబోదిబోమన్నాడు. అతడు వెంటనే స్థానిక ఎస్బీఐకి పరుగెత్తాడు. అక్కడి మేనేజర్ రాఘవేంద్రకుమార్కు జరిగినదంతా వివరించాడు. ‘‘ఇలాంటి సైబర్ నేరాలపై పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఇలాంటివి ఎలా నమ్మారు?’’ అంటూ, మేనేజర్ రాఘవేంద్రకుమార్ ప్రశ్నించారు. ఆయన సూచనతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బాధితుడు శ్యాంబాబు వెళ్లాడు. శ్యాంబాబు నగదు ముంబైలో డ్రా అయినట్టుగా గుర్తించినట్టు మేనేజర్ రాఘవేంద్రకుమార్ తెలిపారు. -
కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారు
మధిర : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దహస్థుడని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. దీన్‌దయాళ్ జన్మ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా మధిర దళితకాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్ధాయిలో ఎంతవరకు చేరుతున్నాయో పరిశీలించడం, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించి సమావేశపర్చడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీకి, దేశంలో పర్యటిస్తున్న అమిత్‌షాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఆదరణను తగ్గించేందుకు సర్వేపేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అటువంటి కుట్రలు, కుతంత్రాలు కేంద్రంముందు సాగవన్నారు. టీఆర్ఎస్కు నిజంగా 111 స్ధానాలు వస్తాయనుకుంటే, దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. సీట్లు రావని తెలిసి తప్పుడు సర్వే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కరెన్సీనోట్ల రద్దు సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదని.. ఆయనను అభినందించలేదా అని ప్రశ్నించారు. మెదడులేనివారే ఇటువంటి విమర్శలు చేస్తుంటారని తెలిపారు. రోడ్ల మంజూరులో నితిన్ గట్కారీకి ధన్యవాదాలు చెప్పలేదా అని ప్రశ్నించారు. మూడు ఒక్కట్లు సీట్లు రావడమంటే పంగనామాలని, తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆ పంగనామాలే పెడతారని ఎద్దేవా చేశారు. దళితులకు సీఎం పదవి ఇచ్చావని ఓటేయ్యాలా, కెజీటు పీజీ విద్య అమలు చేశావని ఓటేయ్యాలా, బీసీల రిజర్వేషన్‌ను తగ్గించి ముస్లింలకు కేటాయించినందుకు ఓటేయ్యాలా, రైతుల పంటలను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులను మూసివేసినందుకు ఓటేయ్యాలా, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయలేదని ఓటేయ్యాలా, నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పినందుకు ఓటేయ్యాలా అని ప్రశ్నించారు. అనంతరం దళిత కాలనీలో ఇంటింటికి పర్యటించి కేంద్ర అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం దళితులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజెపీ జిల్లా ఇంచార్జ్ యాదగిరి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, నాయకులు బాడిశ అర్జునరావు, పాపట్ల రమేష్, భవనం మధుసూదన్‌రెడ్డి, రామిశెట్టి నాగేశ్వరరావు, దుర్గారావు, రామయోగేశ్వరరావు, మహంకాళి శ్రీనివాసరావు, డీవీఎన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో ఎరుపు.. మరుపు
ఖమ్మం: ‘ఖమ్మం ఒకప్పుడు ఎరుపుగా ఉండేది.. ఇప్పుడు అది మరుపు అయింది. ఇంకా కొన్ని రోజులైతే అదీ ఉండదు.. ఆ పార్టీల్లో త్యాగాలు చేసినవారు ఉన్నారు. కానీ ఇప్పుడు వారు అనుసరించే విధానాలు సరికావు’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘చైనానే కమ్యూనిజాన్ని వదిలేసింది.. రష్యాలో సోషలిజం లేదు. మన దేశంలో ఈ విధానాలు కావాలట..! ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదాలు ఇస్తారు. ఇక్కడైతే మేము వేరుగా ఉంటాం’ అనేలా కమ్యూనిస్టుల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థాయిలో చట్టాలపై సమగ్రంగా చర్చ జరిగేదే శాసన మండలని, దీనికి మంచి నాయకత్వ గుణం ఉన్న వారినే ఎన్నుకోవాలన్నారు. ఆ లక్షణాలు, దక్షత, ఓర్పు అన్నీ రామ్మోహన్రావులో ఉన్నాయని ఆయనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీని, వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయాలన్నారు. కేంద్రం స్కాలర్షిప్, సబ్సిడీలను నేరుగా అర్హుల ఖాతాలోనే వేస్తోందన్నారు. దేశాన్ని స్వచ్ఛ భారత్ దిశగా పయనింప చేయాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశమని.. ఆయన ఇచ్చిన నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు అందుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షించదగిన విషయమన్నారు. ఈ ఏడాది దేశంలోని అన్ని పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం సంకల్పించిందన్నారు. రామ్మోహన్రావు 20 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా సామాజిక సేవ చేశారని, ఆయన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి మూడు జిల్లాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రుల ప్రచారమా..?: రామ్మోహన్రావు టీఆర్ఎస్ డబ్బున్న అభ్యర్థిని బరిలో దింపిందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు అన్నారు. ఈ ఎన్నిక కోసం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏడుగురు మంత్రులను ప్రచారం కోసం తిప్పుతోందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షం లేకుండా ఏకపక్షం చేయూలని చూస్తున్నారని అది ఎప్పటికీ సాధ్యంకాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యువతకు ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం శోచనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నామా జన్మదిన వేడుకలు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేదికపైనే నామా కేక్ కట్ చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు నామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎం.ధర్మారావు, కార్యవర్గ సభ్యులు గెంటల విద్యాసాగర్, దుద్దుకూరి వెంకటేశ్వర్రావు, నేతలు చందా లింగయ్య, జిల్లా కార్యదర్శి గెల్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వీరభద్రప్రసాద్, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంగల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గోవర్దన్, జయచంద్రారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నేతలు బేబి స్వర్ణకుమారి, ఫణీశ్వరమ్మ పాల్గొన్నారు.