ముదిగొండ: అదనపు కట్నం కోసం తన కూతురిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముదిగొండకు చెందిన కందుల అశోక్‌కు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన భవానితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ 8. లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఏడాది పాటు సంసారం సజావుగానే సాగింది. అనంతరం మరో రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు మామ వెంకటేశ్వర్లు, ఆడపడచు ఉమ వేధింపులకు పాల్పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా నిర్వహించారు.
కాగా బుధవారం సాయంత్రం భవాని చనిపోయినట్లు గ్రామస్తుల ద్వారా ఆమె తండ్రి మన్మథరావుకు సమాచారం ఇచ్చారు. కాగా తన కూతురిని భర్త, మామ, ఆడపడచు హత్య చేసి, ఉరివేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించారని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ తాండ్ర నరేష్ సందర్శించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment