స్మార్ట్‌గా వెనుకడుగు
రెండో జాబితాలోనూ తిరుపతికి దక్కని చోటు
తిరుపతితుడా : స్మార్ట్ జాబితాలో తిరుపతికి మళ్లీ నిరాశే ఎదురైంది. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన టాప్-20 స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతికి చోటు దక్కలేదు. తాజాగా మంగళవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేసిన రెండో విడత స్మార్ట్ జాబితాలోనూ నిరాశే ఎదురైంది. రెండో జాబితాలో 40 నగరాలను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 13 నగరాలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వరంగల్ నగరం మాత్రమే స్మార్ట్ సిటీలో చోటుదక్కించుకుంది. మరో 27 నగరాలను జూలైలో ప్రకటించనున్నారు. ఇందులో అయినా చోటు దక్కుతుందేమోనని నగర వాసులు మరింత ఆశగా చూస్తున్నారు. అయితే తిరుపతి కార్పొరేషన్ యంత్రాంగం మలివిడత జాబితాకు ఇంకా సిద్ధం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెండు రోజల క్రితం స్మార్ట్‌సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారు కోసం కన్సల్టెన్సీకి అప్పగించింది.
అభిప్రాయ సేకరణలోను కార్పొరేషన్ యంత్రాంగం వెనుకంజలో ఉంది. మహానాడుకు తిరుపతి వేదిక కావడంతో నగరాన్ని త్వరితగతిన ముస్తాబు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటి వరకు చేపట్టిన అభిప్రాయసేకరణలో కమిషనర్ వినయ్‌చంద్ ఒక్కరోజు మాత్రమే పాల్గొనడం గమనార్హం. కింది స్థాయి అధికారులు అడపాదడపా అభిప్రాయ సేకరణ చేపట్టారు. పదిరోజులుగా నగరంలో అభివృద్ధిపనులపై దృష్టిపెట్టిన అధికారులు స్మార్ట్ సిటీ మాస్టర్‌ప్లాన్ రూపొందించడంలో నిర్లక్ష్యం వహించారు. మరో జాబితా ప్రకటనముందే మేల్కొని తగిన అభిప్రాయ సేకరణ చేసి మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సి ఉంది.