సమగ్ర అభివృద్ధి మా బాధ్యత | Comprehensive development of our responsibility | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధి మా బాధ్యత

Published Sat, Jun 18 2016 8:47 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

సమగ్ర అభివృద్ధి మా బాధ్యత - Sakshi

సమగ్ర అభివృద్ధి మా బాధ్యత

యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్ సాధ్యం
యూజీడీ పనిచేయకపోతే మూసేయండి
►  మహిళల హక్కులు కాలరాయొద్దు
►  మంత్రి ఈటల, ఎంపీ వినోద్
 
 

 కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్ర అభివృద్ధి మా బాధ్యతని.. స్మార్ట్‌తో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్‌సిటీ సాధన, డీపీఆర్ తయారీపై మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరంపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందని, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారని, వడ్డించే ఆర్థిక మంత్రిగా నేనే ఉన్నప్పుడు నిధుల గురించి బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయమంటే ధర్మంగా, న్యాయంగా ప్రజల జఠిల సమస్యలు పరిష్కరిస్తూ, సమాజ అభివృద్ధి, క్షేమమే ఎజెండాగా బతకడమన్నారు. నగరంలో యూజీడీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనికి రాదనిపిస్తే మూసివేయాలని మేయర్‌కు సూచించారు.

రోడ్లు తవ్వడం, వేయడం ద్వారా జేబులు నింపుకునే పనిగా ప్రజలు అభివర్ణిస్తున్నారని, రోడ్లు వేస్తే 40 నుంచి 50 ఏళ్ల వరకు తవ్వకుండా ఉండాలన్నారు.  నగరాన్ని హైదరాబాద్ కంటే ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. కౌన్సిల్‌లో సగానికి పైగా మహిళా కార్పొరేటర్లు ఉండగా పది మంది మాత్రమే హాజరవడాన్ని చూసిన మంత్రి మహిళా కార్పొరేటర్ల హక్కులు హరించొద్దని, కనీసం సమావేశాల్లోనైనా పాల్గొనేలా చూడాలని వారి కుటుంబికులకు చురకలంటించారు.


 యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్ : ఎంపీ
 స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చే వరకు మా బాద్యత తీరిందని, పాలక వర్గం, అధికారులు రానున్న 45 రోజుల పాటు యజ్ఞంలా పనిచేస్తేనే స్మార్ట్‌సిటీ సాధ్యమని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను మెట్రోస్మార్ట్ సిటీగా మార్చాలని, దానికి బదులుగా కరీంనగర్‌ను చేర్చాలని లేఖ రాసినప్పుడు మళ్లీ కే ంద్ర కేబినేట్ ఆమోదం కావాలని చెప్పినట్లు తెలిపారు. ఐదేళ్లలో రూ.500 కోట్లే కాదు రూ.5వేల కోట్లయినా తీసుకునే అవకాశముందన్నారు. జిల్లాకు చెందిన ఇండోర్ కలెక్టర్ నరహరితో సమావేశమై డీపీఆర్ తయారీకి సలహాలు తీసుకుంటామని తెలిపారు. తిమ్మాపూర్‌లో 300 ఎకరాల్లో హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్‌కు ముగ్గురు గ్రూప్-1 ఆఫీసర్లను కేటాయించాలని మంత్రిని కోరారు.


 మొదటి మెట్టులోఉన్నాం : ఎమ్మెల్యే
 స్మార్ట్ జాబితా మొదటి మెట్టులోనే ఉన్నామని, మెరుగైన సౌకర్యాలు, ఆర్థిక పరమైన సంస్కరణలతో వచ్చే విడతలో స్మార్ట్ సాధించుకోవాలన్నారు. స్మార్ట్ సిటీల్లో ముందు వరుసలో ఉన్న ఇండోర్, పుణే నగరాలను సందర్శించి డీపీఆర్‌ను తయారు చేయూలన్నారు.  


 ధృడచిత్తంతో పనిచేయాలి  : ఎమ్మెల్సీ
 స్మార్ట్ సాధించాలంటే పాలకవర్గం, అధికారులు ధృఢచిత్తంతో పనిచేయాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ చొరవతో స్మార్ట్ జాబితాలో చేరిందని, దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  


 సర్వాంగ సుందరంగా అభివృద్ధి : కలెక్టర్
 స్మార్ట్‌సిటీతో నగరం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. డీపీఆర్ బాగా తయారు చేయాలని తెలిపారు. స్మార్ట్ డీపీఆర్ పనుల కోసం డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌ను డెప్యూటేషన్‌పై పంపిస్తామని, అనుమతి ఇప్పించాలని మంత్రిని కోరారు.
 లక్ష గొంతులను ఢిల్లీదాకా తీసుకెళ్లాలి: కమిషనర్
 స్మార్ట్‌సిటీ ప్రజలు భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ప్రతి కార్పొరేటర్ సహకారంతో మీడియా, మెస్సేజ్, మెయిల్స్, వాట్సాప్ ఎలా వీలైతే అలా లక్ష గొంతులను ఢిల్లీదాకా తీసుకెళ్లాలని కమిషనర్ కృష్ణభాస్కర్ కోరారు. డీపీఆర్ గ్రౌండ్ నుంచే మొదలు పెట్టాలని, 67 సిటీలకు 73 నగరాలు పోటీపడుతున్నాయని, ఒక్క సారి ఫెయిల్ అయితే మళ్లీ మొదటికి వస్తామన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు.


 మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఘన సన్మానం
 నగరం స్మార్ట్‌సిటీ జాబితాలో నగరం చేరడంపై మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు ఘనంగా సన్మానించారు. స్మార్ట్ కోసం శ్రమిస్తున్న కమిషనర్ కృష్ణభాస్కర్‌ను ఎంపీ వినోద్ శాలువాతో సత్కరించారు. అంతకు ముందు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement