
మార్చి 31తో ముగిసిన ‘స్మార్ట్ సిటీ మిషన్’
లక్ష్యాలకు దూరంగా పలు నగరాలు
ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగింపు..మరోసారి పెంపుపై స్పష్టత లేదు..
దేశంలో 100 నగరాలకు వెచ్చించిన సొమ్ము రూ.1.65 లక్షల కోట్లు
ఖర్చయిన నిధులు రూ.1.50 లక్షల కోట్లు.. పురోగతిలో 558 ప్రాజెక్టులు
నూరుశాతం పూర్తయినవి 25... 95 నుంచి 99 శాతంలో 37 నగరాలు
87.2 శాతంలో తెలంగాణ... వరంగల్ 84.9 శాతం పనులు పూర్తి
సాక్షిప్రతినిధి, వరంగల్: స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్‌సీఎం) గడువు మార్చి 31తో ముగిసింది. సుందర నగరాల లక్ష్యం నెరవేరకపోవడంతో గతంలో రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం.. ఈసారి స్పష్టత ఇవ్వలేదు. దీంతో స్మార్ట్ సిటీ మిషన్ ముగిసినట్లేనన్న చర్చ జరుగుతోంది. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100 నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015 ఆగస్టు 27న ప్రారంభించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సందరనగరాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం.
నిధుల వెసులుబాటు లేక ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రెండుసార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి 31 వరకు మిషన్ పూర్తవుతుందని పేర్కొంది. అయినప్పటికీ 100 నగరాల్లో 25 మాత్రమే నూరుశాతం పూర్తి చేయగా, 37 నగరాల్లో 95 నుంచి 99 శాతంలో ఉన్నాయి. 38 నగరాల్లో ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అయితే మరోసారి పొడిగింపుపై మంగళవారం వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఎస్‌సీఎం లక్ష్యం ఇదీ..25 నగరాల్లోనే నూరుశాతం...
దేశంలోని వంద నగరాల్లో రూ.1,64,545 కోట్ల వ్యయంతో 8,062 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. సుమారు తొమ్మిదేళ్లలో రూ.1,50,306 కోట్లు ఖర్చు కాగా, 7,504 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కాగా, రూ.14,239 కోట్ల వ్యయం కాగల 558 పనులు పురోగతిలో ఉన్నాయి. స్మార్‌సిటీ మిషన్‌కు సంబంధించిన ఈ వివరాలను ఐదు రోజుల కిందట పార్లమెంట్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి సుధాకర్‌సింగ్ వెల్లడించారు. ఈ గణాంకాల ప్రకారం 25 నగరాల్లో నూరుశాతం ఎస్‌సీఎం పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇందులో జార్ఖండ్‌లోని రాంచి, కర్ణాటకలో మంగళూరు, శివమొగ్గ, తుమకూరు, దావణగెరెలు, మధ్యప్రదేశ్‌లో భూపాల్, ఇండోర్, జబల్‌పూర్, మహారాష్ట్రలో అమరావతి, నాగ్‌పూర్, నాసిక్, పుణె, సోలాపూర్, థానేలు, ఒడిస్సాలో రూర్కేలా, రాజస్తాన్‌లో అజ్మీర్, ఉదయ్‌పూర్, తమిళనాడులో కోయంబత్తూర్, మదురై, సేలంలు, ఉత్తరప్రదేశ్‌లో అగ్రా, ఝాన్సీ, లక్నో, వారణాసిలు ఉన్నాయి. కాగా 94 నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసిన నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, బిహార్‌లో భగల్‌పూర్, పాట్నా, గుజరాత్‌లో దాహద్, రాజ్‌కోట్, వడోదరలు, కేరళలో కొచ్చి, తిరువనంతపురంలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 37 ఉన్నాయి.
తెలంగాణలో 87.2 శాతం...లక్షద్వీప్‌లో 24.6 శాతమే...
దేశంలోని 38 నగరాలను విశ్లేషిస్తే లక్షద్వీప్‌లోని కావరట్టి 24.6 శాతం, మిజోరాంలో 78.4, హరియాణాలోని ఫరీదాబాద్‌లో 84.1, కర్నల్‌లో 88.2 శాతంగా ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే వరంగల్, కరీంనగర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎస్‌సీఎం కింద రూ.2,918 కోట్ల వ్యయం కాగల 169 ప్రాజెక్టులు 87.2 శాతమే పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందులో వరంగల్ కార్పొరేషన్‌లో రూ.1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో 84.9 శాతం, కరీంనగర్‌లో రూ.1,117 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టులు 89 శాతం పూర్తయ్యాయి.
ఇదిలా ఉండగా స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పెంచాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శితో పాటు వెనుకబడిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గతంలో చేసిన విజ్ఞప్తి మేరకే 2025 మార్చి 31 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈసారి ఆ అవకాశం లేదన్న చర్చ పురపాలకశాఖ వర్గాల్లో సాగుతోంది.