15 నెలల్లో విశాఖపై డీపీఆర్ ఇవ్వండి
- సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి సంబంధించిన సమగ్ర ప్రాజె క్టు నివేదిక(డీపీఆర్)ను 15 నెలల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత బాధ్యుల(కస్టోడియన్)ను ఆదేశించారు. తిరుపతి, విజయవాడ, విశాఖ స్మార్ట్ సిటీ బాధ్యతలు తీసుకున్న అయికాం, కేపీఎంజీ, ఐబీఎం ప్రతినిధులతో మంగళవారమిక్కడ సీఎం సమీక్ష జరిపారు. డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు వీలుగా విశాఖ స్మార్ట్ సిటీ ప్రాథమిక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నగరంలో ఉన్న భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని చెప్పారు.
స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుకండి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న గుంటూరులో ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతోపాటు అందరూ తమ గ్రామం కోసం కేటాయించాలన్నారు. ప్రతినెలా రెండో శనివారం నిర్వహించాలన్నారు. బాగా చేసిన మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా ఇస్తామన్నారు. స్కూల్ సిలబస్‌లోనూ స్వచ్ఛ భారత్ ఒక సబ్జక్టుగా పెడతామన్నారు. పీపీపీ పద్ధతిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిచేసే ప్లాంట్లు ఏర్పాటుచేస్తామన్నారు.