చంద్రన్నా.. ఇటు చూడన్నా! | Chief Minister Chandrababu Naidu cheating in people West Godavari | Sakshi
Sakshi News home page

చంద్రన్నా.. ఇటు చూడన్నా!

Published Wed, Jan 7 2015 2:03 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

చంద్రన్నా.. ఇటు చూడన్నా! - Sakshi

చంద్రన్నా.. ఇటు చూడన్నా!

‘మాటలు కోటలు దాటుతాయి.. పనులు మాత్రం గడప దాటవు’ అన్న సామెతను గుర్తు తెస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పశ్చిమ’ వాసులకు ఇచ్చిన హామీలు. జిల్లాలో నాలుగుసార్లు పర్యటించిన చంద్రబాబు 21 హామీలు ఇచ్చారు. వాటిలో నేటికీ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యూక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ‘ఎన్నికల వేళ అప్పటి పరిస్థితులను బట్టి చాలా హామీలిచ్చాను. ఇప్పుడు వాటిని నెరవేర్చాలంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు అంత డబ్బు లేదు. డబ్బు సృష్టించే మంత్రదండమూ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన చిన్నపాటి హామీల విషయంలోనూ ఆయన ఇవే మాటలు చెప్పి తప్పించుకుంటారా లేక ఇప్పుడైనా వాటిపై దృష్టి సారిస్తారా అనేది తేటతెల్లం కావాల్సి ఉంది.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాల్లో పర్యటనలకు సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ‘ఎన్నికల్లో అన్ని స్థానాలూ కట్టబెట్టిన ‘పశ్చిమ’కే తొలి ప్రాధాన్యమిస్తా. ఈ జిల్లా తర్వాతే నాకు ఏ జిల్లా అయినా...’ అని బీరాలు పలికారు. జిల్లా రూపురేఖలు మార్చే వందలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇప్పటివరకు అతీగతీ లేకపోయినా స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయూ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రతిపాదనలూ అమలుకు నోచుకోలేదు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో బుధవారం విజయవాడలో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంలో అరుునా జిల్లా ప్రజలకు ఇచ్చిన 17 హామీలను నెరవేరుస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయూంశమవుతోంది. జిల్లా పర్యటనల్లో చంద్రబాబు ఎప్పుడు.. ఎక్కడ  ఏయే హామీలిచ్చారు.. ఎంతవరకు అమలుకు నోచుకున్నాయో ఒక్కసారి పరికిస్తే...
 
 ద్వారకాతిరుమల టౌన్‌షిప్ గుర్తుందా: జూలై 16, 2014
 సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టిన చంద్రబాబు గత ఏడాది జూలై 16న ద్వారకాతిరుమల చిన వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం  రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న తిరుపతిని పెద్దతిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ద్వారకాతిరుమలను టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతానన్నారు. 500 పడకలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ద్వారకాతిరుమలను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని, ఈ ప్రాంతంలో డ్వాక్రా శిక్షణా కేంద్రాన్ని, షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఇంజనీరింగ్ కళాశాలను కూడా నెలకొల్పాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ద్వారకాతిరుమలను పూర్తిగా మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాటిలో ఒక్క హామీనైనా అమలు చేసేందుకు కనీస కార్యాచరణ కూడా రూపొందించలేదు. విశేషమేమిటంటే ఆ రోజు ఇచ్చిన ఈ హామీలను మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు.
 
 పొగాకు, ఆయిల్‌పామ్ రైతులకిచ్చిన హామీలు గాలికేజూలై 17, 2014 గత ఏడాది జూలై 16న రాత్రి జంగారెడ్డిగూడెంలో బస చేసిన సీఎం చంద్రబాబు మరుసటి రోజున చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డు కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పొగాకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అక్కడే ఆయిల్‌పామ్ రైతులను కలుసుకుని గిట్టుబాటు ధర సమస్య మొదలుకుని ఇతరత్రా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఈ హామీలు నేటికీ నెరవేరలేదు. తర్వాత కనీసం వాటి ఊసెత్తిన పాపాన కూడా పోలేదు.
 
 అటకెక్కిన ఆదర్శ గ్రామం :  నవంబర్ 1, 2014
 జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా గత ఏడాది నవంబర్ 1న కాళ్ల మండలం కలవపూడిలో చంద్రబాబు పర్యటించారు. అక్కడి సభలో ప్రాతాళ్లమెరక గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు దాత వేగిరాజు శివవర్మ ముందుకు వచ్చారు. గ్రామాన్ని రూ.2 కోట్లతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, తాను రూ.కోటి సమీకరిస్తానని, మిగిలిన రూ.కోటి కేటాయించాలని కోరడంతో ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. మత్స్యకారుల జీవనోపాధికి డ్రెయిన్లలో చేపల ఉత్పత్తిని పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 2,200 కిలోమీటర్ల మేర డ్రెయిన్లలో చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇది కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అక్కడి రైతులు కిక్కిస సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే తొలగింపు చర్యలకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎక్కడా లేదు.
 
 మాటలకే పరిమితమైన రోడ్లు : డిసెంబర్ 12, 2014
 ఉంగుటూరు మండలం కైకరంలో జరిగిన రైతు సాధికార  సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎం ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపిం చారు. నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి గణపవరం మండలం మొయ్యేరు వరకు 40 గ్రామ పంచాయతీలకు లబ్ధి కలిగేలా రోడ్డును మంజూరు చేస్తానని ప్రకటించారు. కైకరం గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు కైకరం-వెంకటకృష్ణాపురం-రామన్నగూడెం రోడ్డు, గుండుగొలను-పెద్దింట్లమ్మ ఆలయం వరకు రోడ్లు వేయిస్తామని ప్రకటిం చారు. ఈ హామీలకూ షరా మామూలుగానే ఆ తర్వాత అతీగతీ లేకుండా పోయింది. ఈ ఏడాది జనవరి 1న జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో పర్యటించారు.
 
 చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.కోటి వెంటనే విడుదల చేయిస్తామని ప్రకటించారు. ఏడు గ్రామాలకు సాగునీరు, 14 గ్రామాలకు తాగునీరు అందించే పోణంగిపుంత అభివృద్ధికి రూ.9 కోట్లు విడుదల చేయిస్తానని స్పష్టం చేశారు. దాదాపు ఆరు నెలల కిందట ప్రకటించిన వాటికే దిక్కు లేదు కేవలం వారం రోజుల కిందట ఇచ్చిన ఈ హామీలపై ఎలా ఆశలు పెట్టుకుంటామంటూ స్వయంగా టీడీపీ నేతలే మాట్లాడుతున్నారంటే చంద్రబాబు హామీలపై ప్రజలకే కాదు తెలుగు తమ్ముళ్లకూ ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన సీఎం జిల్లా పర్యటనల్లో  ప్రకటించిన వరాలు ఎప్పటికి కార్యరూపం దాలుస్తాయో చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement