Over head tank
-
హైదరాబాద్: వాటర్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ కలకలం..ఆందోళనలో జనం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఓ మృతదేహం కలకలం రేపుతోంది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి మంచి నీటి ట్యాంకులో లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి ఉంటాడా? లేక ఎవరన్నా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం విషయం తెలియడంతో సంఘటన స్థలం వద్దకు స్థానికులు భారీ ఎత్తున్న చేరుకున్నారు. కాగా గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: డ్రంకెన్ డ్రైవ్.. రక్తంలో ఆల్కహాల్‌ని ఎలా లెక్కిస్తారు? -
బిందె నీరు దొరికితే ఒట్టు!
సాక్షి, దొరవారిసత్రం: వేపవి వచ్చేసింది. అయితే తీర గ్రామాల్లో తాగునీటి సమస్య అలాగే ఉంది. ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు సుమారు 20 ఏళ్ల క్రితం సూళ్లూరుపేట మండలం ఆబాక గ్రామ పరిధిలో నుంచి 18 కి.మీ మేర పైప్లైన్లు వేశారు. రెండు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించి తాగునీటి సదుపాయం కల్పించారు. అయితే పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురికావడం, ఆబాక ప్రాంతంలో వేసిన బోర్ల వద్ద విద్యుత్ సమస్యలు ఏర్పడుతుండడంతో ఏడాది పొడవునా ప్రజలు తాగునీరందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వేసవి కాలంలో మాత్రం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అరకొరగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేసి చేతులు దులుపుకుంటూ వస్తున్నారు. నిధులు మంజూరైనా.. గతేడాది తీర గ్రామాల్లో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రూ.1.16 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తీర ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి వనరులు లేనందున సుమారు ఆరు కి.మీ దూరంలోని సింగనాలత్తూరు గ్రామ పరిధిలోని చెరువులో బావి తవ్వారు. కారికాడు గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించారు. అక్కడే నీటి సంపు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ పనులు ఏడాది నుంచి నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంకా పైపులైన్లు వేసి, వీధుల్లో కుళాయిలు అమర్చాల్సి ఉంది. వేసవి కాలం సమీపించడంతో ప్రస్తుతం ఎక్కడా తాగునీటి వనరులు లేకుండాపోయాయని స్థానికులు వాపోతున్నారు. కారికాడులో మాత్రం పథకం నీరు నూతనంగా నిర్మించిన సంపులోకి వస్తే అక్కడినుంచి పట్టుకుంటున్నారు. వేలికాడు, నాగినేరి గ్రామాల ప్రజలైతే ఊట చెరువుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది. హడావుడితో సరి తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకుల హడావుడి తప్ప ఇంకేం లేదు. ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఎప్పటికి శాశ్వత పరిష్కారం చూపిస్తారో?. -వై.సుబ్రహ్మణ్యం ఊటగుంటలోని నీరే దిక్కు: వేసవి కాలం వస్తే గ్రామ సమీపంలో ఉన్న ఊటగుంట నుంచి నీరు తెచ్చుకుని తాగాల్సిందే. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకునే వారులేరు. మంచినీటి పథకం నీరు కలగానే మిగిలింది. – పి.ఏకాంబరం పదిరోజుల్లో పూర్తవుతాయి నీటి పథకం పనులు పదిరోజుల్లో పూర్తి చేయిస్తాం. నూతనంగా నిర్మాణంలో ఉన్న నీటి పథకం పనులు పూర్తైతే కారికాడు, వేలికాడు, నాగినేరి గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – కె.చంద్రశేఖర్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, దొరవారిసత్రం -
ట్యాంక్‌పై నుంచి జారిపడి మేస్త్రీ మృతి
శ్రీకాకుళం (రేగిడి) : రేగిడి మండలం చిన్నసెర్లాం గ్రామంలో మంగళవారం ట్యాంక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి పఠాన్ మోతీ ఖాన్(52) అనే రాడ్ బైండింగ్ మేస్త్రీ మృతిచెందాడు. గ్రామంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకుకు సంబంధించిన వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోతీఖాన్ స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకాని. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రన్నా.. ఇటు చూడన్నా!
‘మాటలు కోటలు దాటుతాయి.. పనులు మాత్రం గడప దాటవు’ అన్న సామెతను గుర్తు తెస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పశ్చిమ’ వాసులకు ఇచ్చిన హామీలు. జిల్లాలో నాలుగుసార్లు పర్యటించిన చంద్రబాబు 21 హామీలు ఇచ్చారు. వాటిలో నేటికీ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యూక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ‘ఎన్నికల వేళ అప్పటి పరిస్థితులను బట్టి చాలా హామీలిచ్చాను. ఇప్పుడు వాటిని నెరవేర్చాలంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు అంత డబ్బు లేదు. డబ్బు సృష్టించే మంత్రదండమూ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన చిన్నపాటి హామీల విషయంలోనూ ఆయన ఇవే మాటలు చెప్పి తప్పించుకుంటారా లేక ఇప్పుడైనా వాటిపై దృష్టి సారిస్తారా అనేది తేటతెల్లం కావాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు :మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాల్లో పర్యటనలకు సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ‘ఎన్నికల్లో అన్ని స్థానాలూ కట్టబెట్టిన ‘పశ్చిమ’కే తొలి ప్రాధాన్యమిస్తా. ఈ జిల్లా తర్వాతే నాకు ఏ జిల్లా అయినా...’ అని బీరాలు పలికారు. జిల్లా రూపురేఖలు మార్చే వందలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇప్పటివరకు అతీగతీ లేకపోయినా స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయూ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రతిపాదనలూ అమలుకు నోచుకోలేదు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో బుధవారం విజయవాడలో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంలో అరుునా జిల్లా ప్రజలకు ఇచ్చిన 17 హామీలను నెరవేరుస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయూంశమవుతోంది. జిల్లా పర్యటనల్లో చంద్రబాబు ఎప్పుడు.. ఎక్కడ ఏయే హామీలిచ్చారు.. ఎంతవరకు అమలుకు నోచుకున్నాయో ఒక్కసారి పరికిస్తే... ద్వారకాతిరుమల టౌన్షిప్ గుర్తుందా: జూలై 16, 2014 సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టిన చంద్రబాబు గత ఏడాది జూలై 16న ద్వారకాతిరుమల చిన వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న తిరుపతిని పెద్దతిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ద్వారకాతిరుమలను టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతానన్నారు. 500 పడకలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ద్వారకాతిరుమలను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని, ఈ ప్రాంతంలో డ్వాక్రా శిక్షణా కేంద్రాన్ని, షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఇంజనీరింగ్ కళాశాలను కూడా నెలకొల్పాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ద్వారకాతిరుమలను పూర్తిగా మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాటిలో ఒక్క హామీనైనా అమలు చేసేందుకు కనీస కార్యాచరణ కూడా రూపొందించలేదు. విశేషమేమిటంటే ఆ రోజు ఇచ్చిన ఈ హామీలను మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. పొగాకు, ఆయిల్‌పామ్ రైతులకిచ్చిన హామీలు గాలికేజూలై 17, 2014 గత ఏడాది జూలై 16న రాత్రి జంగారెడ్డిగూడెంలో బస చేసిన సీఎం చంద్రబాబు మరుసటి రోజున చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డు కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పొగాకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అక్కడే ఆయిల్‌పామ్ రైతులను కలుసుకుని గిట్టుబాటు ధర సమస్య మొదలుకుని ఇతరత్రా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఈ హామీలు నేటికీ నెరవేరలేదు. తర్వాత కనీసం వాటి ఊసెత్తిన పాపాన కూడా పోలేదు. అటకెక్కిన ఆదర్శ గ్రామం : నవంబర్ 1, 2014 జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా గత ఏడాది నవంబర్ 1న కాళ్ల మండలం కలవపూడిలో చంద్రబాబు పర్యటించారు. అక్కడి సభలో ప్రాతాళ్లమెరక గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు దాత వేగిరాజు శివవర్మ ముందుకు వచ్చారు. గ్రామాన్ని రూ.2 కోట్లతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, తాను రూ.కోటి సమీకరిస్తానని, మిగిలిన రూ.కోటి కేటాయించాలని కోరడంతో ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. మత్స్యకారుల జీవనోపాధికి డ్రెయిన్లలో చేపల ఉత్పత్తిని పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 2,200 కిలోమీటర్ల మేర డ్రెయిన్లలో చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇది కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అక్కడి రైతులు కిక్కిస సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే తొలగింపు చర్యలకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎక్కడా లేదు. మాటలకే పరిమితమైన రోడ్లు : డిసెంబర్ 12, 2014 ఉంగుటూరు మండలం కైకరంలో జరిగిన రైతు సాధికార సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎం ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపిం చారు. నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి గణపవరం మండలం మొయ్యేరు వరకు 40 గ్రామ పంచాయతీలకు లబ్ధి కలిగేలా రోడ్డును మంజూరు చేస్తానని ప్రకటించారు. కైకరం గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు కైకరం-వెంకటకృష్ణాపురం-రామన్నగూడెం రోడ్డు, గుండుగొలను-పెద్దింట్లమ్మ ఆలయం వరకు రోడ్లు వేయిస్తామని ప్రకటిం చారు. ఈ హామీలకూ షరా మామూలుగానే ఆ తర్వాత అతీగతీ లేకుండా పోయింది. ఈ ఏడాది జనవరి 1న జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో పర్యటించారు. చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.కోటి వెంటనే విడుదల చేయిస్తామని ప్రకటించారు. ఏడు గ్రామాలకు సాగునీరు, 14 గ్రామాలకు తాగునీరు అందించే పోణంగిపుంత అభివృద్ధికి రూ.9 కోట్లు విడుదల చేయిస్తానని స్పష్టం చేశారు. దాదాపు ఆరు నెలల కిందట ప్రకటించిన వాటికే దిక్కు లేదు కేవలం వారం రోజుల కిందట ఇచ్చిన ఈ హామీలపై ఎలా ఆశలు పెట్టుకుంటామంటూ స్వయంగా టీడీపీ నేతలే మాట్లాడుతున్నారంటే చంద్రబాబు హామీలపై ప్రజలకే కాదు తెలుగు తమ్ముళ్లకూ ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన సీఎం జిల్లా పర్యటనల్లో ప్రకటించిన వరాలు ఎప్పటికి కార్యరూపం దాలుస్తాయో చూడాల్సిందే. -
పన్ను కట్టలేదని నీరు బంద్
ఇళ్ల పన్నులు కట్టలేదని ఎస్సీ కాలనీ మొత్తానికి మంచినీటి సరఫరా నిలిపివేశారు. కాలనీలో ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్నా అది నిరుపయోగంగా ఉంది. బోరుబావిలో నీటిమట్టం అడుగంటింది. దీంతో బిందెడు నీటి కోసం మహిళలు పొలాల్లోకి వెళ్లి బోర్ల వద్ద నుంచి మోసుకుని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఓట్లు వేసి గెలిపించినందుకు మాకిచ్చే వరం ఇదేనా అంటూ సర్పంచ్‌పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గి, న్యూస్‌లైన్: ఇంటి పన్ను చెల్లించలేదని దుర్గి గ్రామ సర్పంచ్ వారం రోజులుగా ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపి వేశారు. సుమారు 300 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివాసం ఉంటున్న ఈ కాలనీలో వేసవిలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా అది నిరుపయోగంగా ఉండడంతో ధర్మవరం గ్రామం నుంచి సరఫరా అయ్యే మంచి నీరు కూడా లభ్యం కావడం లేదు. దీంతో కాలనీ వాసులు సమీపాన ఉన్న పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా పొలాల్లోకి వెళ్లి బోర్ల వద్ద నుంచి బిందెల్లో నీళ్లు మోసుకుతెచ్చుకోవాల్సి వస్తోందని కాలనీ మహిళలు వాపోతున్నారు. కాలనీకి వచ్చిన గ్రామ సర్పంచ్ రమణ గోపాల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా, కాలనీవాసులు ఇంటి పన్ను చెల్లించడం లేదని, అందువల్లనే నీటి సరఫరా ఆపివేశామని చెప్పారన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ఇదా మీరు మాకిచ్చే కానుక అంటూ కాలనీ వాసులు సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ ముస్తఫాను న్యూస్‌లైన్ ప్రశ్నించగా విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామంలో నీటిసరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, త్వరలో కాలనీకి నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిందెడు నీటికోసం పొలాల్లోకి వెళుతున్నాం బిందెడు నీటి కోసం పంటపొలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇంటి పన్ను చెల్లించనిదే నీటి సరఫరా చేయడం కుదరదని గ్రామ సర్పంచ్ హెచ్చరిస్తున్నాడు. అధికారులు స్పందించి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. -అందుగుల పున్నమ్మ పట్టించుకునే నాథుడే లేడు ఎన్నికల్లో ఓట్లు వేసిన విశ్వాసాన్ని మరచి సర్పంచ్ మాట్లాడడం హేయం. వందల కుటుంబాలు జీవనం సాగి స్తుంటే పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. నీటి ట్యాంక్ నిర్మించినా ఫలితం శూన్యంగా మారింది. -బొజ్జం ఎస్తేరమ్మ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా ఫలితం లేదు కాలనీలో ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ ట్యాంక్ వలన ఫలితం లేకుండా పోయింది. బోరుబావి ఏర్పాటు చేసినా నీటిమట్టం అడుగంటింది. అప్పటి నుంచి కాలనీకి జమ్మి వద్దనుంచి నీటి సరఫరా చేసినా కాలనీ వాసులు నీటి కోసం ఇబ్బందులకు గురి కాక తప్పటం లేదు. - చాట్ల ప్రభావతి -
కూలిన ఓవర్ హెడ్ ట్యాంక్.. తప్పిన పెను ముప్పు
తూప్రాన్, న్యూస్‌లైన్: పట్టణం నడిబొడ్డున ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు బుధవారం రాత్రి అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే సమీపంలో జనమెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 1986లో నిర్మించిన ఈ ట్యాంకు 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగి పట్టణ వాసుల దాహార్తిని తీర్చింది. అయితే కొన్నాళ్లుగా శిథిలావస్థకు చేరిన ఈ ట్యాంకు బుధవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఘటన ఉదయం పూట జరిగి ఉంటే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రాణనష్టం భారీగానే ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్యాంకు కూల్చి దాని స్థానంలో కొత్త ట్యాంకు నిర్మించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని వారు అంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ శివ్వమ్మ, వార్డు సభ్యులు ఆంజాగౌడ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శిథిలావస్థలో మరో ట్యాంకు ప్రస్తుతం కూలిపోయిన ట్యాంకు సమీపంలోనే మరో 40 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంది. ప్రస్తుతం అది కూడా శిథిలావస్థకు చేరిం ది.ఎప్పుడు కూలుతుందో తెలియక ప్రజలు భయాందోళన మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ట్యాంకు కూలితే పక్కనే నివాసం ఉండే వారికి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. శంకుస్థాపనకే పరిమితం ఇపుడు కూలిపోయిన ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకు నిర్మాణం కోసం ఆగస్టు 13న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి, , గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు రూ.29 లక్షల వ్యయంతో లక్ష ఇరవై వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. నిత్యం పట్టణ ప్రజలకు తాగునీరందించే ట్యాంకు కూలిపోవడం...ప్రత్యామ్నాయంగా ఆమేరకు సామర్థ్యం కలిగిన ట్యాంకు ఇపుడపుడే నిర్మించే వీలు లేకపోవడంతో పట్టణవ ాసులకు నీటికష్టాలు తప్పేట్లు లేవు.