ఇళ్ల పన్నులు కట్టలేదని ఎస్సీ కాలనీ మొత్తానికి మంచినీటి సరఫరా నిలిపివేశారు. కాలనీలో
ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్నా అది నిరుపయోగంగా ఉంది. బోరుబావిలో నీటిమట్టం అడుగంటింది. దీంతో బిందెడు నీటి కోసం మహిళలు పొలాల్లోకి వెళ్లి బోర్ల వద్ద నుంచి మోసుకుని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఓట్లు వేసి గెలిపించినందుకు మాకిచ్చే
వరం ఇదేనా అంటూ సర్పంచ్‌పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుర్గి, న్యూస్‌లైన్: ఇంటి పన్ను చెల్లించలేదని దుర్గి గ్రామ సర్పంచ్ వారం రోజులుగా ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపి వేశారు. సుమారు 300 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివాసం ఉంటున్న ఈ కాలనీలో వేసవిలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా అది నిరుపయోగంగా ఉండడంతో ధర్మవరం గ్రామం నుంచి సరఫరా అయ్యే మంచి నీరు కూడా లభ్యం కావడం లేదు. దీంతో కాలనీ వాసులు సమీపాన ఉన్న పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా పొలాల్లోకి వెళ్లి బోర్ల వద్ద నుంచి బిందెల్లో నీళ్లు మోసుకుతెచ్చుకోవాల్సి వస్తోందని కాలనీ మహిళలు వాపోతున్నారు.
కాలనీకి వచ్చిన గ్రామ సర్పంచ్ రమణ గోపాల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా, కాలనీవాసులు ఇంటి పన్ను చెల్లించడం లేదని, అందువల్లనే నీటి సరఫరా ఆపివేశామని చెప్పారన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ఇదా మీరు మాకిచ్చే కానుక అంటూ కాలనీ వాసులు సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ ముస్తఫాను న్యూస్‌లైన్ ప్రశ్నించగా విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామంలో నీటిసరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, త్వరలో కాలనీకి నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బిందెడు నీటికోసం పొలాల్లోకి వెళుతున్నాం
బిందెడు నీటి కోసం పంటపొలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇంటి పన్ను చెల్లించనిదే నీటి సరఫరా చేయడం కుదరదని గ్రామ సర్పంచ్ హెచ్చరిస్తున్నాడు. అధికారులు స్పందించి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. -అందుగుల పున్నమ్మ
పట్టించుకునే నాథుడే లేడు
ఎన్నికల్లో ఓట్లు వేసిన విశ్వాసాన్ని మరచి సర్పంచ్ మాట్లాడడం హేయం. వందల కుటుంబాలు జీవనం సాగి స్తుంటే పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. నీటి ట్యాంక్ నిర్మించినా ఫలితం శూన్యంగా మారింది. -బొజ్జం ఎస్తేరమ్మ
ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నా ఫలితం లేదు
కాలనీలో ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ ట్యాంక్ వలన ఫలితం లేకుండా పోయింది. బోరుబావి ఏర్పాటు చేసినా నీటిమట్టం అడుగంటింది. అప్పటి నుంచి కాలనీకి జమ్మి వద్దనుంచి నీటి సరఫరా చేసినా కాలనీ వాసులు నీటి కోసం ఇబ్బందులకు గురి కాక తప్పటం లేదు. - చాట్ల ప్రభావతి
పన్ను కట్టలేదని నీరు బంద్
Published Sun, Jun 1 2014 12:07 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement
Advertisement