తుది దశలో ఆ మెట్రో డీపీఆర్‌లు | North City and Fourth City Metro DPRs completed in ten days: Telangana | Sakshi

తుది దశలో ఆ మెట్రో డీపీఆర్‌లు

Apr 8 2025 2:16 AM | Updated on Apr 8 2025 2:16 AM

North City and Fourth City Metro DPRs completed in ten days: Telangana

వారం, పది రోజుల్లో  నార్త్, ఫోర్త్‌ సిటీ మెట్రో డీపీఆర్‌లు పూర్తి

నిర్మాణ వ్యయంపై త్వరలో అంచనాలు 

రెండో దశ ‘బి’కేటగిరీలో మూడు కారిడార్లు 

కేంద్రం అనుమతి కోసం ఎదురుచూపులు 

డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లపై ప్రతిష్టంభన

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రెండో దశ ‘బి’విభాగం కింద ప్రతిపాదించిన నార్త్‌ సిటీ, ఫోర్త్‌ సిటీ మెట్రో ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు (డీపీఆర్‌లు) తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మూడు కారిడార్‌ల అలైన్‌మెంట్‌లు, నిర్మాణ వ్యయంపై అంచనాలను సిద్ధం చేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌) సంస్థ తుది మెరుగులు దిద్ది ప్రభుత్వానికి నివేదికలు అందజేయనుంది. మొదట్లో భావించినట్లుగా డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లకు అవకాశం ఉండకపోవచ్చన్నారు.

జేబీఎస్‌ నుంచి మేడ్చల్‌ మార్గంలో డెయిరీ ఫాం వరకు హెచ్‌ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ మార్గంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు వద్ద 600 మీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. దీంతో డబుల్‌ డెక్కర్‌పై ప్రతిష్టంభన నెలకొంది. మెట్రో కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వరకు ప్రతిపాదించిన రూట్‌లో కూడా డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఇంజనీరింగ్‌ నిపుణులు త్వరలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. 

ఈ రూట్‌లో కూడా హెచ్‌ఎండీఏ ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించింది. ప్రస్తుతం కంటోన్మెంట్‌ ఏరియాలో రక్షణశాఖ నుంచి భూముల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. రక్షణ శాఖ అధికారులతో హెచ్‌ఎండీఏ అధికారులు తాజాగా సమావేశమయ్యారు. మరోవైపు ఫోర్త్‌ సిటీకి ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్‌లో కొన్ని కిలోమీటర్లు భూమార్గంలో మెట్రో పరుగులు తీయనుంది. ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి మధ్యలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.  

దశల వారీగా పనులు
జేబీఎస్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24 కి.మీ, జేబీఎస్‌ నుంచి శామీర్‌ పేట్‌ వరకు 21 కి.మీ, ఫ్యూచర్‌సిటీ వరకు 41 కి.మీ. మెట్రో కారిడార్‌ల డీపీఆర్‌ల కోసం హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ దశలవారీగా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించింది. ఈ కారిడార్‌లలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌తోపాటు భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీపై ఇప్పటికే నివేదికలను రూపొందించారు. అలాగే జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మెట్రో రాక వల్ల నార్త్‌సిటీ వైపు వాహనకాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టనుందని అంచనా. భూసామర్థ్య పరీక్షల్లో భాగంగా మేడ్చల్‌ మార్గంలో 14 చోట్ల, శామీర్‌ పేట్‌ మార్గంలో 11 చోట్ల  పరీక్షలు పూర్తిచేశారు. 

రెండో దశలో మొత్తం 162 కి.మీ. 
మెట్రో రెండో దశలో ఇప్పటికే 5 కారిడార్‌లలో 76.4 కి.మీ.తోపాటు ప్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ వరకు 23 కి.మీ., శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వరకు 22 కి.మీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్‌ 41 కి.మీ. చొప్పున మొత్తం 8 కారిడార్‌లలో 162.4 కి.మీ. వరకు మెట్రో కారిడార్‌లు విస్తరించనున్నారు. మెట్రో మొదటి దశలోని 69 కి.మీ.తో కలిపితే హైదరాబాద్‌లో మెట్రో సేవలు 231.4 కి.మీ.కు పెరగనున్నాయి. మొదట విస్తరించనున్న 5 కారిడార్‌లలో 2028 నాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు, నార్త్‌సిటీ, ఫోర్త్‌సిటీ కారిడార్‌లతో కలిపి సుమారు 12 లక్షల మంది ప్రయాణించవచ్చని అంచనా. 2030 నాటికి మెట్రో ప్రయాణికులు 15 లక్షలు దాటే అవకాశం ఉంది. కాగా, హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ ఎండీగా ఎన్విఎస్‌ రెడ్డిని త్వరలో తిరిగి నియమించనున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement