వరాలు సరే.. వనరుల మాటేమిటి?
►‘తూర్పు’ దశ మార్చేస్తానంటున్న చంద్రబాబు
►స్మార్ట్ సిటీలుగా కాకినాడ, రాజమండ్రి అభివృద్ధి
►కాకినాడ వద్ద ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, వాణిజ్య పోర్టు
►కోనసీమలో ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్
►తుని వద్ద నౌకా నిర్మాణ కేంద్రం వగైరా హామీలు
►నిధుల లభ్యతపై నోరు మెదపని ముఖ్యమంత్రి
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఒకటి కాదు.. రెండు కాదు- వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆయన మాటలు కార్యరూపం దాల్చాలని గాఢంగా కోరుకుంటున్న జిల్లావాసులు.. అందుకు అవరమైన నిధులెలా సమీకరిస్తారో చెప్పకపోవడంతో..పెదవి విరుస్తున్నారు. విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 13 జిల్లాల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాపై వరాల జల్లు కురిపించారు.
జిల్లా కేంద్రమైన కాకినాడతో పాటు రాజమండ్రిని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కాకినాడలో ఇప్పటికే కేంద్రం హార్డ్‌వేర్ హబ్‌ను ప్రకటించగా, రాజమండ్రి నగరాన్ని కూడా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పీసీపీఐఆర్ పరిధిలోకి కాకినాడను చేర్చడంతో పాటు కాకినాడ వద్ద ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కాకినాడ వద్ద ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌తో పాటు మరో వాణిజ్య పోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్రో కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. కోనసీమలో కొబ్బరిపీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్, తుని వద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీతో పాటు ఫుడ్‌పార్కు, పర్యాటక, జలరవాణా మార్గాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ఇలాగైతే నాలుగేళ్లలో ‘పోలవరం’ ఎలా సాధ్యం?
ఇలా వేలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన ముఖ్యమంత్రి వాటి ఏర్పాటుకు అవసరమైన నిధులను ఏ విధంగా సమకూరుస్తారో చెప్పకపోవడం జిల్లావాసులను నిరాశకు గురి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడం పట్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తూనే.. కేంద్ర బడ్జెట్ లో కనీసం రూ.350 కోట్లు కూడా కేటాయించకపోవడాన్ని గుర్తు చేస్తూ.. ఇలాగైతే ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు గాల్లో మేడలు బాగానే కట్టారని, అయితే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ర్టంలో ఈ మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ఏ విధంగా సాధ్యమో చెబితే ఇంకా బాగుండేదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో పోలవరంతో సహా రాష్ట్రానికి అరకొర కేటాయింపులు జరిపిన కేంద్రం బాబు తలపెట్టిన ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనంగా ఎలాంటి నిధులు సమకూర్చే అవకాశాల్లేవంటున్నారు. ఇప్పటికైనా ప్రకటించిన ప్రాజెక్టులకు ఏ విధంగా నిధులు సమకూర్చేది, వాటిని ఎప్పటి లోగా పూర్తి చేసేది చెబితే చంద్రబాబు మాటలకు విశ్వసనీయత చేకూరుతుందంటున్నారు.