
‘స్మార్ట్’ గేమ్ షురూ!
తిరుపతి తుడా : స్మార్ట్ సిటీల ఎంపిక ప్రక్రియలో ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు ఒక ఎత్తు. అయితే కేంద్రం విధించిన నిబంధనలను తట్టుకుని మహా నగరాలతో కుస్తీపడి టాప్ 20 జాబితాలో నిలబడడం ఇంకో ఎత్తు అవుతోంది. తొలి ఏడాదిలో ఎంపికైన 98 నగరాల్లో 20 నగరాలను మాత్రమే అభివృద్ధి చేయనున్నారు. వీటి ఎంపికకు కేంద్రం కఠిన నిబంధనలను విధించింది. ఇందులో మహా నగరాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని తిరుపతి టాప్‌లో నిలవాల్సి ఉంది.
ఎంపిక ప్రక్రియ ఇక కేంద్రం చేతుల్లో..
దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీల జాబితా ఖరారైంది. వంద నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా, రెండు నగరాలు ప్రాథమికంగా అర్హత సాధించకపోవడంతో 98 నగరాలతో తుది జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గత వారం విడుదల చేశారు. ఈ జాబితాలో తిరుపతి నగరం స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆయా నగర పనితీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఎంపిక ప్రక్రియ జరిగింది. రెండో దశ ఎంపిక ప్రక్రియ పూర్తిగా కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం ప్రతిపాదించిన ప్రతి అంశంలోనూ పోటీపడి అర్హత సాధిస్తేనే తొలి 20 నగరాల్లో తిరుపతి నిలుస్తుంది.
మహానగరాలతో పోటీ..
కేంద్రం ప్రకటించిన 98 స్మార్ట్ సిటీల జాబితా ల్లో దేశ వ్యాప్తంగా 24 రాష్ట్ర రాజధానులు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక నగరాలు మరో 24, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్య నగరాలు 18 ఉన్నాయి. రాజధాని, ప్రముఖ, వ్యాపార, పర్యాటక నగరాలతో తిరుపతి పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. రాష్ట్రాల రాజధాని నగరాలే 24 ఉండటంతో టాప్ 20లో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు మరో 24 ప్రముఖ నగరాలు టాప్ 20 జాబితా కోసం పోటీ పడుతున్నాయి. ఈ 48 నగరాల నుంచి పోటీ పడి తిరుపతి తొలి 20 స్మార్ట్ జాబితాలో నిల వాల్సి ఉంటుంది. ఇందుకోసం కార్పొరేషన్ కమిషన్ మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ చివరికల్లా తొలి ఏడాది అభివృద్ధికి ఎంపికైన 20 నగరాలను కేంద్రం ప్రకటించనుంది.
ప్రారంభమైన వర్క్‌షాపు
టాప్ 20 సిటీల జాబితాల్లో నిలవాలంటే అర్హ త సాధించాల్సిన అంశాలపై ఆయా నగరాల మేయర్లు, కమిషనర్లకు అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. మూడు దఫాలుగా వర్క్‌షాపులను నిర్విహ స్తారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలో నిర్వహించిన వర్క్ షాప్‌నకు స్మార్ట్ నగరాలకు ఎంపికైన నగరాల ప్రతినిధులు హా జరయ్యారు. మలి దశ వర్క్‌షాపును సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
అనేక అంశాల్లో పోటీ
ఆయా నగరాలకు అందుబాటులో ఉన్న సేవ లు, అర్థిక వరనరులు, అభివృద్ధి, ఆదాయ వనరులు, సంస్కరణల అమలు, జనాభా, మురికివాడల స్థితిగతులు, పన్నుల చెల్లింపు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థల పనితీరు ఇలా కేంద్రం విధించిన అనేక అంశాల్లో ఆయా సిటీలు పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.