కాకినాడ.. ఇక సోకువాడ
స్మార్ట్‌సిటీ జాబితాలో చోటు
జిల్లా కేంద్రానికి మహర్దశ
ఏటా రూ.200 కోట్ల నిధులు
కాకినాడ: దేశంలోని దాదాపు 100 నగరాలను ఆకర్షణీయనగరాలు (స్మార్ట్‌సిటీలు)గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి కేంద్రానికి సిఫార్సు చేయగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం వాటిని ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటన చేశారు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడకు ఏటా రూ.200 కోట్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందని కార్పొరేషన్ వర్గాల సమాచారం. అలా ఐదేళ్ళపాటు ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు లభించనుందని చెబుతున్నారు. ఈ మొత్తం నిధులు పూర్తి గ్రాంటుగా వస్తాయని చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి గ్రాంటా, కొంత నగరపాలక సంస్థ భాగస్వామ్యం కూడా ఉండాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు.
ప్రతిపాదనల్ని నివేదించే టాస్క్‌ఫోర్స్ కమిటీ
కాగా స్మార్ట్‌సిటీగా రూపొందించే క్రమంలో చేయూల్సిన మార్పులు, చేపట్టాల్సిన పనుల్ని పర్యవేక్షించేందుకు ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే, ట్రాన్స్‌కో, విద్యుత్, రవాణా, ఆర్టీసీ తదితర 11 శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీనికూడా ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా, కార్పొరేషన్ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ తరచూ సమావేశమై స్మార్ట్‌సిటీకి అవసరమైన ప్రతిపాదనలపై చర్చించి ప్రభుత్వానికి నివేదించనుంది.
ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి
ప్లాన్డ్ సిటీగా పేరున్న కాకినాడను స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడం సంతోషదాయకం. అయితే దీంతో కాకినాడను అభివృద్ధి చేయాలంటే అది కేవలం అధికారులు, రాజకీయనేతలవల్లే సాధ్యం కాదు. ప్రజాహిత సంఘాలను కూడా భాగస్వాముల్ని చేయూలి. ముఖ్యంగా పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయూలి.
- వైడీ రామారావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
నిజంగానే మహర్దశ
స్మార్ట్‌సిటీగా ఎంపిక కావడంతో కాకినాడ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే సంకేతాలు అందడంతో అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. ఇటీవలే టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కూడా జరిగింది. శాఖల వారీగా ఆకర్షణీయ నగరానికి అవసరమైన ప్రతిపాదనలను ఆయా అధికారులు ఇప్పటికే నివేదించారు. పథకం అమలులోకి వస్తే ఆ నిధులతో నగరానికి నిజంగానే మహర్దశ పడుతుంది.
- ఎస్.గోవిందస్వామి, కమిషనర్, కాకినాడ కార్పొరేషన్
ఇలా ‘స్మార్ట్’ అవుతుంది..
కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయడంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ఇందులో భాగంగా ఇక్కడ 24 గంటలూ నీరు, విద్యుత్ సరఫరాతోపాటు పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను సమకూర్చాలి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రమే వాహనాలను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో కొత్తగా ఆర్టీసీ బస్సుల నిలుపుదల, ఇతర కార్యకలాపాల కోసం కొత్త బస్టాండ్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ఇక్కట్లను తప్పించేందుకు అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణాలను కూడా చేపడతారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయకుండా నియంత్రించి, పరిమిత ప్రాంతాల్లో హోర్డింగ్‌జోన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ విధానంలోని బోర్డులను మాత్రమే భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ ఆదా కోసం నగరం అంతా ఎల్‌ఈడీ లైట్లతో నింపుతారు. నగరాన్ని గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు అన్ని మున్సిపల్ భవనాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలు, ముఖ్య కూడళ్ళను అభివృద్ధి చేయడంతోపాటు మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడతారు.