సాక్షి, విశాఖపట్నం: మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మహానగరం విశాఖపట్నం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన వెంటనే అప్రమత్తమైన అధికార బృందం యుద్దప్రాతిపదకన అనేక చర్యలు చేపట్టింది. నగరాన్ని 24 గంటలు డేగకన్నుతో పరిశీలిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా కరోనా కట్టడిలో యంత్రాంగం పనితీరుకు కితాబు ఇచ్చింది.
మహమ్మారి కరోనాపై నగర ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా 90 ప్రాంతాల్లో బహిరంగ ప్రకటన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖ మొత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరి కదలికలపై దృష్టి సారించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో కరోనా గురించి తెలిపే 10 డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్యాలయంలో 24గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. 24 గంటలు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తూ నిరంతరం అప్రమత్తతో ఉంటున్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థతో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా పాజిటివ్/అనుమానితులను వేగంగా గుర్తించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్ జోన్లుగా ప్రకటించి అంక్షలు విధించి అక్కడ వారిని బయటకు రానీయకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. దీంతో స్మార్ట్ సిటీ విశాఖలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించడంతో విశాఖలో కరోనా వ్యాప్తి కొంత ఆగినట్లయింది.
చదవండి:
మే 17 వరకు లాక్‌డౌన్ పొడగింపు
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment