స్మార్ట్ సిటీలకు ఎంతో దూరంలో ఉన్నాం
♦ ఇంజనీర్లు పెద్ద పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు
♦ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి
ముంబై: స్మార్ట్‌సిటీల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మూర్తి వెల్లడించారు. స్మార్ట్‌సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోనన్నారు.
‘ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ, 50 శాతం సీట్లు కూడా నిండలేదు. అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు’ అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు.
ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా... ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయిన నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక వలసలు ఇకముందూ కొనసాగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీలపై పనిచేయాలని మూర్తి సూచించారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్‌సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు.