సెక్రటరీ బాలస్వామికి కేక్ తినిపిస్తున్న కమిషనర్ వినయ్‌చంద్
తిరుపతికి.. స్మార్ట్ కిరీటం
Published Tue, Sep 20 2016 11:20 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
– 62.63 పాయింట్లతో నాలుగో స్థానం
–రెండో జాబితాలో ఏపీలో దక్కిన ఏకైక నగరం
– మారనున్న ఆధ్యాత్మిక నగర రూపురేఖలు
– రూ.1,610 కోట్లతో ప్రణాళికలు
– ఇంటర్నేషనల్ ఏజెన్సీల సహకారం
తిరుపతి తుడా :
స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతి ఎట్టకేలకు చోటుదక్కింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ రెండో జాబితాలో 62.63 పాయింట్లతో ఈ ఆధ్యాత్మిక నగరం టాప్–4లో నిలిచింది. స్మార్ట్‌సిటీ దక్కడంతో తిరుపతిలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా పేలుళ్లు, నత్యాలతో కార్పొరేషన్ సిబ్బంది సందడి చేశారు. కమిషనర్ భారీ కేక్ కట్‌చేసి ఉద్యోగులకు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ రెండో జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. ఆయా నగరాల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఆధారంగా ర్యాంకింగ్‌లను కేటాయించారు. టాప్‌లో నిలిచిన 27 నగరాలను వరుసక్రమంలో ప్రకటించారు. మొత్తం 66 నగరాలు పోటీపడ్డ ఈ రౌండ్‌లో తిరుపతి నగరం 62.63 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది.
ముందే ఊహించిన కమిషనర్
ఈ ఏడాది జనవరిలో స్మార్ట్ సిటీ తొలి జాబితాను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, కాకినాడ నగరాలు మాత్రమే ఎంపికయ్యాయి. తిరుపతి స్మార్ట్ కిరీటం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ ప్రణాళికా బద్ధంగా డీపీఆర్‌ను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. అనంతరం తిరుపతి టాప్ 5లో నిలుస్తుందని ముందే ఊహించారు. ఆయన చెప్పినట్టే తిరుపతి టాప్–4లో నిలిచింది.
నిధుల వరద
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగానే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. స్మార్ట్ సిటీగా ఎంపికైన ఒక్కో నగరానికి రూ.500 కోట్లు కేటాయిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతే స్థాయిలో మరో రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో స్మార్ట్ సిటీకి రూ.వెయ్యి కోట్లు సమకూరుతాయి. అయితే తిరుపతి నగరపాకల అధికారులు రూ.1,610 కోట్లతో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.1000 కోట్లతో పాటు మరికొన్ని పథకాల ద్వారా రూ.280 కోట్లు రాబట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పబ్లిక్, ప్రై యివేట్ భాగస్వామ్యం నుంచి మరో రూ.330 కోట్లు వచ్చేవిధంగా డీపీఆర్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో తిరుపతికి నిధుల వరద పారడం, భారీ ప్రాజెక్టు చేజిక్కించుకోడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు.
ఇక స్మార్ట్‌గా..
స్మార్ట్ సిటీ మిషన్‌తో తిరుపతి రూపురేఖలు మారనున్నాయి. రూ.1,610 కోట్ల భారీ ప్రాజెక్టుతో నగరాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. రెట్రోఫిటింగ్ (ఇప్పుడున్న నిర్మాణాలు ఉన్నచోటనే) అభివృద్ధి చేసేలా డీపీఆర్‌ను రూపొందించారు. రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం, బస్టాండు ప్రాంతం నుంచి తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా నందీ సర్కిల్ వరకు ఉన్న 700 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలు, వసతులు, ప్రభుత్వ, ప్రయివేట్ భవనాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రీనరీ, ఆధునిక అండర్ డ్రై నేజీ, కేబుల్ సిస్టమ్, రవాణా, 24 గంటలూ తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇది ప్రజల విజయం
నగర ప్రజల విజయం. సహకరించిన అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. నగర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం తీసుకుంటాం. ఇప్పటికే ఫ్రాన్స్ సహకారం కోరాం. స్మార్ట్ సిటీ ప్రణాళికలను నగరంలో అమలు చేస్తున్నాం. ఈ–స్కూల్స్, పార్కుల అభివృద్ధి, సిటీ బ్యూటిఫికేషన్, హౌసింగ్, జియోగ్రఫీ ఇన్‌ఫర్మేషన్ సిస్టం, స్కోడా, ఇజ్రాయిల్ టెక్నాలజీ నీటి సరఫరా వంటి వాటిని అమలు చేస్తున్నాం. స్మార్ట్‌సిటీ రూ.1,610 కోట్లు, స్కోడా ప్రాజెక్టు రూ.1,500 కోట్లు, జనరల్ ఫండ్, అమృత్ పథకం, 14, 15 ఆర్థిక సంఘాల నుంచి మరో రూ.211 కోట్లతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.
– వాడరేపు వినయ్‌చంద్, కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థ
Advertisement