పాలకులు ‘స్మార్ట్’గా ఉంటేనే అభివృద్ధి: వెంకయ్య
- స్మార్ట్ సిటీల్లో పెట్టబడులు పెట్టేందుకు 34 దేశాల ఆసక్తి
- తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన స్మార్ట్ నగరాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలకు సూత్రప్రాయ అనుమతి
- ముగిసిన మీడియా సంపాదకుల ప్రాంతీయ సదస్సు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘స్మార్ట్ సిటీల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద లభించే నిధులతో సమీకృతం చేసుకుంటే, ఆ తరువాత వాటి ప్రగతికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి 34 దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తొలి విడతలో పెట్టుబడుల ఆమోదానికి ఎంపికైన 20 నగరాలకుతోడు మరో 40 నగరాల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ జాబితా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ నగరాలకు ఒక్కొక్కదానికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల చొప్పున ఇవ్వనుంది. మొదట 200 కోట్లు, వాటిని సవ్యంగా వినియోగించి రాష్ట్రాలు చేసే పనితీరును బట్టి మిగతా నిధుల్ని విడుదల చేస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలివిడతలో ఎంపికైన నగరాల్లో పెట్టుబడులకై వచ్చిన ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా కేంద్రం అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు రూ.1,602 కోట్లకు, కాకినాడకు రూ.1,993 కోట్లకు, తెలంగాణలోని వరంగల్‌కు రూ. 2,860 కోట్ల పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. అటల్ మిషన్ (ఏఎమ్‌ఆర్‌యూటీ), స్వచ్ఛభారత్ మిషన్, హెరిటేజ్ డెవలప్‌మెంట్ (హృదయ్), పీఎం ఆవాస్ యోజన తదితర పథకాల కింద లభించే నిధుల్ని సవ్యంగా వినియోగించుకొని దేశంలోని నగరాల్ని స్థానిక-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పరచుకోవాలి’అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో రెండు రోజుల పాటు జరిగిన మీడియా సంపాదకుల ప్రాంతీయ సదస్సు సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ పలు విషయాలు ఆయన వెల్లడించారు.
స్మార్ట్‌సిటీలు సుందర, ఆవాసయోగ్య నగరాలుగా అభివృద్ధి చెందాలంటే స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలంగా ఉండటంతో పాటు వాటి పాలకులైన కమిషనర్లు, మేయర్లు కూడా స్మార్ట్‌గా ఉండాలన్నారు. నగరాల్లో ముఖ్యంగా గృహనిర్మాణం, డిజిటలైజేషన్, తాగునీరు-మురుగునీటి నిర్వహణ, తడి-పొడి చెత్త తొలగింపు, రవాణా ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. ఆయా అంశాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతికి ఆస్కారముందని చెప్పారు. ఒక దశ దాటిన తర్వాత సౌకర్యాలు కల్పించి, అందులోంచే వనరులు సమీకరించుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. నగరాల్లో చెత్త తొలగింపు (వేస్ట్ మేనేజ్‌మెంట్) విషయంలో నిర్మాణాత్మక ప్రత్యామ్నాయాలు సూచించాలని మద్రాస్ ఐఐటీని కోరానన్నారు.
ముగిసిన రెండు రోజుల సదస్సు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన ‘సంపాదకుల ప్రాంతీయ సదస్సు‘ శుక్రవారం ముగిసింది. మొదటి సదస్సు జైపూర్‌లో నిర్వహించగా రెండోది చెన్నైలో జరిగింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు లక్షద్వీప్‌కు చెందిన మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్‌తోపాటు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన, విపత్తుల నివారణ, తీర రక్షణ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద గడిచిన రెండున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వెల్లడించడంతో పాటు ప్రశ్నోత్తరాల ప్రక్రియ ద్వారా మీడియా ప్రతినిధుల నుంచి స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఈ సదస్సు నిర్వహించినట్టు చెప్పారు.