నోట్లరద్దు ఒక శుద్ధీకరణ యజ్ఞం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, సిద్దిపేట: దేశంలో నల్లధనం ఎక్కువై పోయి పేదల మీద భారం పడినందునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లడబ్బుపై కొరడా ఝళిపించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పెద్దనోట్ల రద్దును నల్లడబ్బు శుద్ధీకరణ యజ్ఞమని ఆయన అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మోదీ చేపట్టిన ఈ యజ్ఞాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ప్రజల మీద కొంత పన్నుల భారం మోపి నప్పుడే స్థానిక సంస్థలు బలోపేతమవుతాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని వెంకయ్య అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిద్దిపేటను సాధించగలిగామని చెప్పారు. సిద్దిపేటలో దసరా పండుగ నాటికి దాదాపు 2,000 డబుల్ బెడ్‌రూం గదులను నిర్మించి ఇస్తామని చెప్పారు.