సీఎం - పీఎం దోస్తీ కుదిరింది | TRS to join central cabinet soon | Sakshi
Sakshi News home page

సీఎం - పీఎం దోస్తీ కుదిరింది

Published Mon, Feb 15 2016 2:55 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

సీఎం - పీఎం దోస్తీ కుదిరింది - Sakshi

సీఎం - పీఎం దోస్తీ కుదిరింది

త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి టీఆర్‌ఎస్
ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్లతో సీఎం కేసీఆర్ చర్చలు ఫలప్రదం
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీఆర్‌ఎస్‌కు రెండు బెర్త్‌లు
ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు కోరిన టీఆర్‌ఎస్ అధినేత
ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని సుముఖం
పదవులు ఆశిస్తున్న కేకే, జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత
జితేందర్‌రెడ్డి, కవితకు అవకాశం లభించవచ్చంటున్న పార్టీ వర్గాలు
టీఆర్‌ఎస్ కేంద్రంలో చేరితే రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ దోస్తీ కటీఫ్

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరడం దాదాపుగా ఖాయమైంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఈ అంశంపైనే ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర బీజేపీ సీనియర్ నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయంతో పాటు వివిధ పథకాలకు నిధులు కేటాయించాలంటూ ప్రధాని, ఇతర సీనియర్ మంత్రులను కలిసిన సీఎం.. పనిలో పనిగా ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరే అంశంపైనా చర్చలు జరిపారు.
 
 కేంద్రంలో చేరితే తమకు ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు కావాలని కోరారు. ప్రస్తుతానికి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆదివారం ఉదయమే బీజేపీ సీనియర్ నేత ఒకరు సీఎంను కలిసి ఈ మేరకు చెప్పినట్టు తెలిసింది. తదుపరి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని, పరిస్థితిని బట్టి ఆ తర్వాత మరొకరికి అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తారని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు విశ్వనగరంగా హైదరాబాద్‌కు అవసరమైన సహకారాన్ని అందించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. సీఎంకు సూచించారు.
 
 పదవుల కోసం అప్పుడే పోటాపోటీ
 కేంద్రంలో టీఆర్‌ఎస్ చేర డం దాదాపు ఖాయం కావడంతో మంత్రి పదవులకు పార్టీలో అప్పుడే పోటీ మొదలైంది. సీనియర్ పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌తోపాటు నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీ పడుతున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. కేబినెట్ పదవికి రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పోటీ పడుతున్నారు.
 
 ఒకవేళ కేబినెట్ పదవి రాకపోయినా సహాయ మంత్రి పదవి అయినా ఇవ్వాలని జితేందర్‌రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కచ్చితంగా ఒకరికి అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అదే జరిగితే జితేందర్‌రెడ్డికి కేబినెట్ పదవి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇక సహాయ మంత్రి పదవికి కవిత పేరు దాదాపుగా ఖాయమైంది. కేబినెట్ పదవికి ఎవరన్నది సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
 
 రాష్ట్రంలో బీజేపీకి రెండు పదవులు
 కేంద్ర మంత్రివర్గంలో టీఆర్‌ఎస్ చేరిన మరుక్షణం రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కొత్త రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు తప్పనిసరి అని సీఎం భావిస్తున్నారు. ‘‘మేం కేంద్రంలో చేరడానికి ప్రధానంగా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమే. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం.
 
 సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అవసరం’’ అని ప్రధాని సహా కీలక నేతలతో సీఎం అన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 50 శాతం నిధులు కేటాయించాలని సీఎం ఢిల్లీ పర్యటనలో మొదటి రోజున ప్రధానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పూర్తి కావాలంటే ఈ ప్రాజెక్టు కార్యాచరణ పూర్తి కావాల్సిందే. వీటన్నీటిని దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్ కేంద్రంలో చేరాలన్న నిర్ణయం తీసుకుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.
 
టీడీపీతో పొత్తు ఏపీకే పరిమితం
బీజేపీతో సఖ్యత కుదిరి టీఆర్‌ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరితో తెలంగాణలో టీడీపీతో పొత్తు కటీఫ్ అయినట్టే. ఆ పార్టీ తో పొత్తు ఏపీకే ఉంటుందని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘‘ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలో చర్చలు జరిగాయి. బహుశా త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవచ్చు’’ అని ఢిల్లీలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement