హైదరాబాద్ నీ అబ్బ సొత్తా ?: కేసీఆర్ | KCR takes on Narendra modi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నీ అబ్బ సొత్తా ?: కేసీఆర్

Published Tue, Apr 29 2014 2:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

KCR takes on Narendra modi

* మోడీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
* హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్ర
* అది వెంకయ్య, బాబు పుర్రెలో పుట్టిన పురుగు
* ఆంధ్రా ఓట్ల కోసం వ్యూహం
* ఇక్కడ పోలింగ్ కాగానే తెలంగాణను విమర్శిస్తారు
* మోడీ తెలంగాణ శత్రువు.. బీజేపీని బొంద పెట్టండి
* బీజేపీకి ఓటేస్తే టీడీపీకే పోతుంది
* నోట్లకు మోసపోతే తర్వాత నోట్లోంచి పేగులు లాక్కుంటారు
* నిజామాబాద్, మందమర్రి, వర్గల్ సభల్లో కేసీఆర్

 
సాక్షి, నిజామాబాద్ , మంచిర్యాల, వరంగల్: ‘‘మోడీ.. హైదరాబాద్ నీ అబ్బ సొత్తా? 400 ఏళ్ల క్రితం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడానికి.. అది నీ అయ్య సొత్తు కాదు’’ అంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర జరుగుతోందని, మోడీ ప్రధాని అయితే తెలంగాణ ప్రజల కొంప మునుగుతుందని అన్నారు. ‘బీజేపీ అగ్ర నేత వెంకయ్యనాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల పుర్రెలో పుట్టిన పురుగే హైదరాబాద్ యూటీ. బీజేపీకి అధికారమిస్తే తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌ను కోల్పోవడం ఖాయం. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేస్తున్న బీజేపీని పాతాళంలోకి తొక్కాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
 
 ఎన్నికల ప్రచారం చివరి రోజున సోమవారం ఆయన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, మెదక్ జిల్లా వర్గల్ సభల్లో పాల్గొన్నారు. ప్రధానంగా టీడీపీ-బీజేపీలపై ధ్వజమెత్తారు. మోడీని ప్రధానమంత్రిని చేస్తే కొంప ముంచుతారన్నారు. హైదరాబాద్ ఒక ప్రాంతానిది కాదు అందరిదన్న మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘టీడీపీ సచ్చిన శవం, ఆంధ్రావాళ్లతో ఇంకా పంచాయితీ అయిపోలే.. నీళ్లు, నిధులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు, ఇట్ల ఎన్నో పంపకాలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో తెలంగాణకు ద్రోహం చేసి.. శవంలాంటి టీడీపీని నరేంద్రమోడీ భుజాన వేసుకుని తిరుగుతున్నారు. బీజేపీకి ఓటు వేస్తే టీడీపీకి పోతుంది, అలాగే మన హైదరాబాద్‌ను చేజేతులా మనమే పోగొట్టుకోవాల్సి వస్తుంది. మన మరణశాసనం మనమే చేసుకున్నట్లవుతుంది. బీజేపీని బొందపెట్టండి’’ అంటూ కేసీఆర్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
 
 అక్రమాస్తులు కాపాడుకునేందుకే...
 హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు, చంద్రబాబుకు అక్రమాస్తులున్నాయని, వాటిని కాపాడుకునేందుకే వారు ఆరాటపడుతున్నారని కేసీఆర్ అరోపించారు. మోడీ తెలంగాణకు శత్రువని, బీజేపీకి ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తానని మోడి పేర్కొనడం విడ్డూరంగా ఉందని, అసలింతకీ ఆయనెవరని ప్రశ్నించారు. ‘మీరు చూడండి.. తెలంగాణలో ప్రచారం ముగిస్తే చాలు, ఆంధ్రా ఓట్ల కోసం తిరుపతిలో జరిగే సభలో తెలంగాణ ను మోడీ విమర్శిస్తార’ని కేసీఆర్ తెలిపారు. ఆంధ్రోళ్ల మాటలకు మోసపోవద్దని, మోసపోతే గోస తప్పదని స్పష్టం చేశారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పదేళ్లుగా నడిపించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజా సంక్షేమం అంటోంద ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన హామీ ఆచరణ సాధ్యం కాదన్నారు. ఆ విధంగా చేస్తే ఏటా రూ.24, 000 కోట్లు కావాలన్నారు.
 
 అందుకే ఆ హామీ కాంగ్రెస్ కాదు కదా.. తాను అధికారంలోకి వచ్చినా అమలు చేయలేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 90కిపైగా స్థానాలు దక్కించుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే తెలంగాణలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. అయితే పోలింగ్ సమయంలో కొందరు చెప్పే మాయమాటల్ని నమ్మొద్దని సూచించారు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో పేదలకు రూ. 4.50 లక్షలతో స్థలమిచ్చి.. వంద శాతం సబ్సిడీతో ఇళ్లు కట్టిస్తామన్నారు. గతంలో పేదలు తీసుకున్న ఇంటి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.   
 
 నన్ను ఓడించేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు
 ‘నన్ను ఓడించేందుకు ఆంధ్రోళ్లు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. కోట్ల డబ్బును, మద్యాన్ని ఇక్కడికి తరలిస్తున్నార’ని కేసీఆర్ అన్నారు. ప్రజాభిమానం కలిగిన తనను ఓడించడం ఎవరి తరం కాదని వర్గల్ సభలో స్పష్టం చేశారు. పొరపాటున మద్యానికి, నోట్లకు మోసపోతే ఆ తర్వాత నోట్లోంచి పేగులను లాక్కుంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందితే భరతమాత కన్నీరు పెట్టిందని మోడీ పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అవి కన్నీళ్లు కావని... బిల్లు ఆమోదం పొందిన ఆనందంలో భరతమాత కడుపుబ్బ నవ్వడంతో వచ్చిన ఆనందబాష్పాలన్నారు. మనకు సామంతుల పాలన వద్దని, మన రాష్ట్రం మనం బాగు చేసుకునేందుకు స్వతంత్ర పాలన అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రోళ్ల పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ నగరం మన చేజారి పోతుందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement