అనవసర రాద్ధాంతం చేయొద్దు
-
కేసీఆర్‌కు వెంకయ్యనాయుడు సలహా
-
ప్రధానిపై మీ వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం
-
మోడీ ‘ఫాసిస్ట్’ అన్న మాటను ఉపసంహరించుకుంటే మంచిది
-
టీ బిల్లు ఆమోదించినప్పుడు సంబరాలు చేసుకున్నారుగా..
-
అందులోని అంశాలను అమలు చేస్తే అభ్యంతరం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు కల్పించటంపై అనవసర రాద్ధాంతం చేయడం తగదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హితవు పలికారు. పార్లమెంట్ ఆమోదం పొందిన విభజన బిల్లులో పేర్కొన్న అంశాన్నే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తే అందులో అభ్యంతరం ఏముందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఫాసిస్ట్ అంటూ కేసీఆర్ మాట్లాడడం దురదృష్టకరమని, పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ప్రకారం ముందుకెళ్లడం ఎలా ఫాసిజమవుతుందని ప్రశ్నించారు. ఈ మాటలను కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజన బిల్లును నరేంద్రమోడీ ఒక్కరే ఆమోదించలేదని, యూపీఏ హయాంలోనే ఆమోదం పొందిన అంశం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న పార్టీ... బిల్లు ఆమోదం పొందినప్పుడు హర్షించిందని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందాక ఆ పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం సమాఖ్య స్ఫూర్తి అయినా రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడం ఇందులో మరో ప్రధాన అంశమని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం కలహించుకోవడం ఆపి సమస్యలుంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు ప్రజల భవిష్యత్ కోసం ఇరు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ‘కేంద్ర ఎవరి పట్లా వివక్ష చూపదు. దేశ ప్రజలంతా సమానం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అభివృద్ధికి బిల్లులోని అంశాల అమలుకు కేంద్రం కృషి చేస్తుంది.
దేశ ప్రధానిపై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిపై పునరాలోచించుకోవాలి’ అని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా.. ‘చౌకబారు మాటలకు నా స్థాయిలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని బదులిచ్చారు.
అభివృద్ధి చర్యలను కాంగ్రెస్ అడ్డుకుంటోంది
దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని వెంకయ్య ఆరోపించారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటోందన్నారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా రాజ్యసభలో తగినంత బలం లేక కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయన్నారు. త్వరలో వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత మెజార్టీ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను సక్రమంగా జరగనివ్వటం లేదని ధ్వజమెత్తారు. దేశ ప్రధాని కావాలనుకున్న వ్యక్తి లోక్‌సభ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాహుల్‌గాంధీని ఉద్దేశించి పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డితో పాటు ఎంపీ బండారు దత్తాత్రేయ, నేతలు మురళీధరరావు, సుధీష్ రాంబొట్ల, దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.