‘స్మార్ట్’పై ఆశలు
► రెండో జాబితాలో కరీంనగర్‌కు అవకాశం..!
► నేడు ఢిల్లీలో స్మార్ట్‌సిటీల సదస్సు
► హాజరవుతున్న కమిషనర్ కృష్ణభాస్కర్
కరీంనగర్ కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని వంద నగరాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్‌సిటీల రెండో జాబితాపై ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి జాబితాలో 20 నగరాలను ప్రకటించగా... అందులో కరీంనగర్ కార్పొరేషన్‌కు అవకాశం తృటిలో చేజారిన విషయం తెలిసిందే. రెండో విడతలో మరో 20 నగరాలకు చోటు కల్పించేందుకు స్మార్ట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో స్మార్ట్‌సిటీల జాబితాకు ఎంపికై పోటీలో ముందు వరుసలో ఉన్న నగరాల కమిషనర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ హాజరవుతున్నారు. స్మార్ట్ సిటీ హోదా కోసం చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని సమాచారం.
వడివడిగా అడుగులు
తెలంగాణలో వరంగల్‌తోపాటు కరీంనగర్ స్మార్ట్‌సిటీ రేసులో వడివడిగా అడుగులు వేస్తోంది. స్మార్ట్‌సిటీకి కావాల్సిన హంగులు, ఆర్భాటాలను ఇప్పటికే సమకూర్చుకున్న నగరం ఆన్‌లైన్‌పై దృష్టి సారించింది. ప్రతీ అంశాన్ని ఆన్‌లైన్ చేయడం ద్వారా మరిన్ని మార్కులు సాధించే అవకాశముంది. దీంతో రెండో జాబితాలో 20 సిటీల్లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రెండో జాబితాతోనే మూడో జాబితాను కూడా ప్రకటించేందుకు కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసినా కరీంనగర్‌కు స్మార్ట్ కిరీటం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క యూజీడీ మాత్రం మార్కుల జాబితాలో నగరాన్ని కాస్త వెనక్కి నెడుతోంది.
మార్కుల్లో ముందు వరుసలో...
కేంద్రం స్మార్ట్‌సిటీలుగా వంద నగరాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నాటి నుంచే కరీంనగర్ నగరపాలక సంస్థ యంత్రాంగం, పాలకవర్గం చోటు దక్కించుకునేందుకు కృషిచేస్తోంది. తెలంగాణకు రెండు సిటీలను మాత్రమే కేటాయించడంతో.. మొదట హైదరాబాద్, వరంగల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే హైదరాబాద్‌కు స్మార్ట్ హోదాతో పెద్దగా ఒరిగేదేమీ లేదని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను తప్పించింది. ఆ స్థానంలో 100 మార్కులకు గాను 87.5 మార్కులతో ఉన్న కరీంనగర్ పేరును ప్రతిపాదించింది. మొదటి దశలో చోటు దక్కకపోవడంతో రెండో దశలోనైనా కచ్చితంగా చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషనర్ సదస్సుకు హాజరవుతుండడంతో తప్పకుండా ఫలితం కనబడుతుందనే ఆశ ప్రజలు, అధికారుల్లో ఉంది.
నగర అభివృద్ధిపై ప్రజెంటేషన్
స్మార్ట్ సిటీకి కావాల్సిన అర్హతలన్నింటినీ సదస్సులో కమిషనర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. కొత్తగా చేపట్టనున్న వెహికిల్ ట్రాకింగ్ సిస్టం(జీపీఆర్‌ఎస్), సీసీ కెమెరాల ఏర్పాటు, ఈ-ఆఫీస్, ఆన్‌లైన్ కంప్లయింట్ సిస్టం తదితర అంశాలను వివరించనున్నారు. ఇప్పటికే అమలవుతున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ, పిన్‌పాయింట్ చెత్త సేకరణ, చెత్త రీసైక్లింగ్, చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ(వర్మీ కంపోస్ట్), ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వంటి పనులపై ప్రజెంటేషన్ చేయనున్నారు.