సాక్షి, విశాఖ: పరిసారలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నపారిశుధ్య కార్మికులపై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్య నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్చభారత్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు వారు పేరుపేరునా ధన్యవాదాలుతెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా శుక్రవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర‍్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..
పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికులు మాతృ మూర్తులతో సమానమని, వారి సేవలకు గుర్తుంపుగా అవార్డులు ప్రధానం చేయడం చాలా సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీ విశాఖను మరింత సుందర నగరంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ..
పారిశుద్యం అంటే కేవలం శానిటైజేషన్ మాత్రమే కాదని, పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడమేని అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి 25 మందికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిడిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. దేశంలో అత్యంత సుందర నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కి నిధులు విడుదల చేసి మరింత స్వచ్చత సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆధారబాదరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేసారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment