విశాఖపట్నం: హుద్‌హుద్‌ను జయించాం...విశాఖను పునర్నిర్మించాం..స్మార్ట్ సిటీగా ఎంపికైన విశాఖ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో మాత్రం విశాఖకు దక్కింది శూన్యహస్తమే. నిన్నటి కేంద్రబడ్జెట్‌లో స్మార్ట్ సిటీకి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు లభించక తీరని అన్యాయం జరగగా, నేటి రాష్ర్ట బడ్జెట్‌లో కూడా విశాఖకు నిరాశే ఎదురైంది. టాప్-20 స్మార్ట్‌సిటీల జాబితాలో జీవీఎంసీ టాప్-8లో నిలిచిన విశాఖ ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణన్ సర్వేలో ఐదో స్థానంలో నిలిచింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా 700 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జోన్-1 ప్రాంతమైన ఆర్కే బీచ్, రుషి కొండ తదితర ప్రాంతాలను రూ.1430 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా రూ.వంద కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు సమకూర్చనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణ సాయం సమకూర్చుకోవల్సి ఉంది. గడిచిన రెండేళ్లకుగాను కేంద్రం నుంచి రూ. 200 కోట్లు, రాష్ర్టం నుంచి రూ.200 కోట్లు సమకూర్చాల్సి ఉంది.
కానీ కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ సిటీలన్నింటికి రూ.250 కోట్ల వరకు కేటాయింపులు జరపగా దీంట్లో జీవీఎంసీకి దక్కే మొత్తం అరకొరగానే ఉంటుంది. కాగా మంగళవారం రాష్ర్ట అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో విశాఖ, కాకినాడలు స్మార్ట్ సిటీగా ఎంపికయ్యాయంటూ ప్రకటనకే పరిమితమయ్యారే తప్ప బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన జీవీఎంసీ బృందం ప్రస్తుతం డీపీఆర్ తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. విస్కో ప్రాజెక్టుకు మాత్రం లక్ష రూపాయలు విదిలించారు.
స్మార్ట్ సిటీకి నిధులేవి..?
Published Thu, Mar 10 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement