చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్‌సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్
చాటు దొరికితే చాలు....
పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్‌లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
బల్దియా బదిలీ కమిషనర్‌లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్‌లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్‌లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.
మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు
మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు.
దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు..
Comments
Please login to add a commentAdd a comment