Public toilet
-
వరంగల్: గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి
చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్‌సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్ చాటు దొరికితే చాలు.... పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియా బదిలీ కమిషనర్లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్‌లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
దుపట్టాతో ఉరి.. తొడపై సూసైడ్ నోట్!
ముంబై : భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పబ్లిక్ టాయిలెట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములంద్‌కు చెందిన భాగ్యశ్రీ నర్లే (29)కు సతారాకు చెందిన ఓ వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చేసింది. గత కొన్ని నెలలుగా తండ్రితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త మెసేజ్‌ల ద్వారా భాగ్యశ్రీని వేధించసాగాడు. ఆమెను ఆమె కుటుంబాన్ని చంపుతానని బెదిరించేవాడు. కుమారుడ్ని కూడా ఆమెతో ఉండటానికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. జనవరి 28వ తేదీన పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి దుపట్టాతో అక్కడి పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ( అక్కకు అసభ్య సందేశాలు పంపిన తమ్ముడు) బయటకు వెళ్లిన భాగ్యశ్రీ గంట దాటినా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకసాగారు. పబ్లిక్ టాయిలెట్ దగ్గర భాగ్యశ్రీని చూశామని ఎవరో చెప్పటంతో అక్కడికి వెళ్లారు. ఓ టాయిలెట్ లోపలినుంచి గడియపెట్టి ఉంది. తలుపు బద్ధలు కొట్టి చూడగా భాగ్యశ్రీ అక్కడి పైపునకు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె తొడపై సూసైడ్ నోట్‌ను గుర్తించారు. భార్య మరణానికి కారణమైన భర్తపై,అతడి కుటుంబంపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు. -
ప్రజలకు ఉచితంగా అత్యంత ఖరీదైన టాయిలెట్
ముంబై : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నగరంలోనే అత్యంత ఖరీదైన పబ్లిక్ టాయిలెట్‌ను బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద, ఎయిరిండియా ఆఫీసుకు ఎదురుగా ఈ టాయిలెట్‌ను నిర్మించారు. ఐదు సీటు గల ఈ టాయిలెట్ కోసం సుమారు 90 లక్షల రూపాయలతో ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు సీట్లలో రెండు సీట్లను మహిళల కోసం కేటాయించారు. ఈ పబ్లిక్ టాయిలెట్ సోలార్ ప్యానల్‌తో రూపొందింది. నీటిని పొదుపు చేసేందుకు వాక్యుమ్ టెక్నాలజీని కూడా దీని కోసం వాడారు. పైన సోలార్ ప్యానల్స్‌తో రూపొందిన తొలి వాక్యుమ్ టాయిలెట్ ఇదేనని బీఎంసీ అధికారి చెప్పారు. మెరైన్ డ్రైవ్ యొక్క ఆర్కిటెక్చర్ దీనికి డిజైన్ చేశారు. ఈ టాయిలెట్‌ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జిందాల్ గ్రూపు నిర్మించింది. అయితే మొదటి రెండు నెలలు ఉచితంగా సర్వీసులను ప్రజలకు అందించనున్నారు. అయితే ఆ తర్వాత ప్రజలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఖరీదైన టాయిలెట్ నేటి నుంచి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా భవనానికి ఎదురుగా ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్‌ను బీఎంసీ ఆధ్వర్యంలో సోమవారం యువసేన చీఫ్ ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా పౌరులకు అందుబాటులో అత్యంత ప్రమాణాలు కలిగిన టాయిలెట్లో ఇది ఒకటి. ఇది పూర్తిగా సీఎస్ఆర్ నిధులతో నిర్మించబడింది. మా బాధ్యత కూడా దీన్ని ఇంతే శుభ్రంగా కాపాడుకోవడం’ అని బీఎంసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. సాధారణంగా ఒక టాయిలెట్‌ను ఒక్కసారి ఫ్లస్ చేస్తే, ఎనిమిది లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అదే వాక్యుమ్ టెక్నాలజీతో నీటి వినియోగం బాగా తగ్గుతుందని, కేవలం 800 ఎంఎల్ నీరు మాత్రమే అవసరం పడుతుందని సమటెక్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అక్షత్ గుప్త చెప్పారు. -
పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై యువతి సెల్ నంబర్
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): క్యాబ్ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై రాసి వేధింపులకు కారణమైన డ్రైవర్‌ను సైబరాబాద్ షీ బృందాలు అరెస్టు చేశాయి. ఓ మహిళ కోకాపేట్ నుంచి మాదాపూర్‌కు క్యాబ్ బుక్ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్ ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో బాధితురాలు డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను నేరం అంగీకరించాడు. కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. గత రెండు వారాల్లో 47 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాయి. సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జ్ అనసూయ ఈవ్‌టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
దావూద్ హోటల్ కూల్చేసి.. టాయిలెట్ కట్టిస్తా!
ముంబయి : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఓ హోటల్ మరుగుదొడ్డిగా మారనుంది. కరడుగట్టిన హిందూత్వ వాది స్వామి చక్రపాణి ప్రభుత్వం నిర్వహించే వేలంలో దానిని దక్కించుకుని ఆ స్థానంలో పబ్లిక్ టాయిలెట్‌ను నిర్మిస్తానని ప్రకటించారు. ఇంతకుముందు ఆయనే.. దావూద్‌కు చెందిన కారును వేలంలో దక్కించుకుని ఆ తర్వాత దానిని తగులబెట్టేసిన విషయం తెలిసిందే. భేండి బజార్లో మాఫియా డాన్‌కు ఢిల్లీ జైకా అనే హోటల్ ఉండేది. ముంబై దాడుల అనంతరం, దావూద్ దొంగచాటుగా విదేశాలకు పారిపోవటంతో ప్రభుత్వం అతని ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో అతని కారుతోపాటు హోటళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కారును వేలానికి ఉంచగా స్వామి చక్రపాణి దానిని దక్కించుకుని, తగులబెట్టారు. రెండేళ్ల క్రితం హోటల్ వేలం నిర్వహించగా అది సఫలం కాలేదు. దీంతో ఈ నెల 14వ తేదీన మరోసారి వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో తానే దక్కించుకుంటానని, దానిని కూలగొట్టి ఆ ప్రదేశంలో పబ్లిక్ మరుగుదొడ్డిని నిర్మిస్తానని శుక్రవారం ఆయన ప్రకటించారు. టాయిలెట్ నిర్మాణం పూర్తయ్యాక దానిని ప్రారంభించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆహ్వానిస్తానని చెప్పారు. తీవ్రవాదానికి, తీవ్రవాదులకు ఎలాంటి చివరికి గతి పడుతుందో చెప్పటానికి ఈ పని చేస్తున్నానని స్పష్టం చేశారు. స్వామి చక్రపాణి ఆప్తమిత్రుడు, ఢిల్లీకి చెందిన న్యాయవాది అయిన అజయ్ శ్రీవాస్తవ మాఫియా డాన్‌కు చెందిన నగ్‌పడాలోని భవనాన్ని వేలంలో సొంతం చేసుకున్నారు. అనంతరం దానిని కూడా చక్రపాణికి చేశారు. ఆ భవనంలో ఆస్పత్రి ప్రారంభించి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ప్రకటించారు. దీనిద్వారా దావూద్ తీవ్రవాద చర్యలకు బలైన వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని చెప్పారు. -
టాయిలెట్ వాడుకుని.. రూ. 5కు చెక్కిచ్చాడు!
దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసిన తర్వాత చిల్లర సమస్య తీవ్రతకు తమిళనాడులో జరిగిన ఓ ఘటన అద్దం పట్టింది. చిన్న చిన్న దుకాణాలు, వీధుల్లో బళ్ల మీద పెట్టుకుని అమ్ముకునేవాళ్లకు చిల్లర దొరకడం చాలా కష్టంగా మారిందది. చివరకు పబ్లిక్ టాయిలెట్ వాడుకున్న తర్వాత ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. మదురైలో ఓ వ్యక్తి 5 రూపాయలకు చెక్కు రాసిచ్చాడు. దాని మీద ఎవరికి చెల్లించాలని ఉన్న చోట 'పబ్లిక్ టాయిలెట్, మదురై' అని రాసి మరీ ఇచ్చాడు. ఈ చెక్కును ఇచ్చిన వ్యక్తి ఎవరో గానీ, బీఆర్ఎం మురళీధరన్ అనే వ్యక్తి మాత్రం చెక్కు ఫొటో తపీసి దాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. అప్పటినుంచి దానిమీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దేశమంతా నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని, తమిళనాడులోని మదురైలో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించుకున్నందుకు కూడా 5 రూపాయల చెక్కు ఇచ్చారని మురళీధరన్ తన ఫేస్బుక్లో రాశారు. అప్పటినుంచి నోట్ల రద్దుకు మద్దతుగాను, వ్యతిరేకిస్తూ దానికి పలు రకాల కామెంట్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిల్లర దొరకట్లేదు మహాప్రభో అంటూ కొందరు చెప్పగా, శతికోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు. -
మరుగుదొడ్లు ఉపయోగిస్తే ఎదురు డబ్బు!
దక్షిణ కొరియా: ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కాకుండా ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్లను ఉపయోగిస్తే డబ్బులు చెల్లించాల్సిందే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా కాదు.. వాళ్లే ఎదురు డబ్బులిస్తారట. ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓ వినూత్నమైన సులభ్ కాంప్లెక్స్‌ను రూపొందించారు. దీన్ని వాడుకునేందుకు మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. నిర్వాహకులే మీకు ఎదురు చెల్లిస్తారు. ఎందుకలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ కాంప్లెక్స్‌లో మానవ వ్యర్థాలను బయో ఇంధనాలుగా మార్చే ఏర్పాట్లున్నాయి. టాయిలెట్ లోపల ఉండే యంత్రం వ్యర్థాల్లోని నీటిని వేరు చేస్తుంది. మిగిలినపోయిన పదార్థం ఆ తరువాత వేల రకాల సూక్ష్మజీవుల సాయంతో వాసనలేని ఎరువుగా మారిపోతుంది. ఈ ప్రక్రియలో కార్బన్‌డై యాక్సైడ్, మీథేన్ వాయువులు విడుదలవుతాయి. కార్బన్‌డైయాక్సైడ్‌ను బయోడీజిల్ ఉత్పత్తికి పనికొచ్చే నాచు (ఆల్గే) పెంపకానికి వాడతారు. మీథేన్‌ను నేరుగా ఇంధనంగా వాడవచ్చు. ‘ది సైన్స్ వాల్డెన్ పెవెలియన్’ అని పిలుస్తున్న ఈ కాంప్లెక్స్ అసలు ఉద్దేశం నీటిని అతితక్కువగా వాడే టాయిలెట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం. ప్రజలను ఈ కాంప్లెక్స్‌కు రప్పించేందుకు ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ కూడా తయారుచేశారు. దీని సాయంతో వ్యర్థాల ద్వారా ఎంత మొత్తంలో ఇంధనం ఉత్పత్తి అవుతుంది, దాని విలువ ఎంత, తదితర వివరాలు తెలుస్తాయట! -
మరుగుదొడ్లకు నటుడి పేరు
అలహాబాద్/షోలాపూర్: గాంధీ కుటుంబంపై బాలీవుడ్ నటుడు రిషికపూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన కొనసాగుతోంది. బహిరంగ మరుగుదొడ్లకు రిషీ కపూర్ పేరు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో కాంగ్రెస్ మద్దతుదారులు పబ్లిక్ టాయిలెట్ కు రిషికపూర్ పోస్టర్లు అతికించి ఆందోళన చేపట్టారు. శివాజీ పార్క్ సమీపంలోని సులభ్ కాంపెక్ల్ కు రిషికపూర్ పెట్టారు. సోమవారం షోలాపూర్ యూత్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేసింది. పట్టణంలోని మరుగుదొడ్లకు రిషీకపూర్ పేరు రాసి వినూత్న నిరసన తెలిపింది. ప్రాజెక్టులు, పథకాలకు గాంధీల పేరెందుకని రిషికపూర్ వ్యాఖ్యానించడంపై యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాగా, మరుగుదొడ్లపై రాసిన రిషికపూర్ పేరును పోలీసులు చెరిపేశారు. -
టాయిలెట్లో కస్టమ్స్ అధికారిణి మృతదేహం
బీజింగ్: మకావు కస్టమ్స్ అధికారి ఒకరు పబ్లిక్ టాయిలెట్లో శవమై కనిపించారు. చైనా రాజధాని బీజింగ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం... కస్టమ్స్ సేవల డైరెక్టర్ లాయ్ మిన్హువా బీజింగ్ లోని ఓసియన్ గార్డెన్ ప్రాంతానికి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే, ఈ క్రమంలో ఆమె గార్డెన్లో ఉన్న టాయిలెట్లో శవమై కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మిన్హువాది హత్యా.. లేక ఆత్మహత్యా అన్న వివరాలు తేలాల్సి ఉందని మకావో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుయ్ షియాన్ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించడం లేదని స్థానిక అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం భద్రత అంశంపై ఓ సమావేశానికి హాజరవ్వాల్సి ఉండగా ఆమె అనుమానస్పద స్థితిలో మృతిచెందారని షియాన్ వివరించారు. -
వాడండి.. డబ్బులు తీసుకోండి!
♦ పబ్లిక్ టాయిలెట్ ఉపయోగిస్తే రూపాయి ఇవ్వనున్న ♦ అహ్మదాబాద్ మున్సిపాలిటీ ♦ బహిర్భూమి అలవాటు మాన్పించేందుకు సరికొత్త ఐడియా అహ్మదాబాద్: సాధారణంగా పబ్లిక్ టాయిలెట్ల వద్ద ‘పే అండ్ యూజ్’ అని రాసి ఉంటుంది కదా! స్వల్ప రుసుం చెల్లించి టాయిలెట్ ఉపయోగించుకోవాలని దాని అర్థం. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) దీన్ని తిరగరాస్తోంది. ‘యూజ్ అండ్ గెట్ పెయిడ్’ అంటూ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అంటే మరుగుదొడ్డి వాడినందుకు మున్సిపాలిటీయే ఒక రూపాయి తిరిగి చెల్లిస్తుందన్నమాట. నగరంలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు ఏఎంసీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ‘నగరంలో దాదాపు 315 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వీటి చుట్టుపక్కల దాదాపు 120 ప్రదేశాల్లో ప్రజలు బహిర్భూమికి వెళ్తున్నారు. వారితో ఈ అలవాటు మాన్పించేందుకే ఈ ఆలోచన చేశాం. వారు మరుగుదొడ్లు ఉపయోగించేలా చేయాలన్నది మా ఉద్దేశం. వారం, పదిరోజుల్లో దీన్ని అమలు చేస్తాం’’ అని ఏఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ పటేల్ చెప్పారు. అయితే మరుగుదొడ్లను వాడినవారందరికీ రూపాయి ఇవ్వమని, బహిర్భూమికి వెళ్తున్న వారిని గుర్తించి వారికి మాత్రమే అందిస్తామని మున్సిపాలిటీ అధికారి భావిక్ జోషి చెప్పారు. బహిరంగ మలవిసర్జన చేసే 1,200 మందిని గుర్తించి ఒక జాబితా తయారు చేశామని, దగ్గర్లోని మరుగుదొడ్లు ఉపయోగిస్తే వారికి ఒక్కో రూపాయి అందిస్తామన్నారు. వారు టాయిలెట్లు వాడడం మొదలుపెట్టాక మరో జాబితా తయారు చేసి, వారితో బహిర్భూమి అలవాటు మాన్పిస్తామని వివరించారు.