టాయిలెట్ వాడుకుని.. రూ. 5కు చెక్కిచ్చాడు!
టాయిలెట్ వాడుకుని.. రూ. 5కు చెక్కిచ్చాడు!
Published Tue, Dec 6 2016 11:13 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసిన తర్వాత చిల్లర సమస్య తీవ్రతకు తమిళనాడులో జరిగిన ఓ ఘటన అద్దం పట్టింది. చిన్న చిన్న దుకాణాలు, వీధుల్లో బళ్ల మీద పెట్టుకుని అమ్ముకునేవాళ్లకు చిల్లర దొరకడం చాలా కష్టంగా మారిందది. చివరకు పబ్లిక్ టాయిలెట్ వాడుకున్న తర్వాత ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. మదురైలో ఓ వ్యక్తి 5 రూపాయలకు చెక్కు రాసిచ్చాడు. దాని మీద ఎవరికి చెల్లించాలని ఉన్న చోట 'పబ్లిక్ టాయిలెట్, మదురై' అని రాసి మరీ ఇచ్చాడు. ఈ చెక్కును ఇచ్చిన వ్యక్తి ఎవరో గానీ, బీఆర్ఎం మురళీధరన్ అనే వ్యక్తి మాత్రం చెక్కు ఫొటో తపీసి దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అప్పటినుంచి దానిమీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
దేశమంతా నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని, తమిళనాడులోని మదురైలో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించుకున్నందుకు కూడా 5 రూపాయల చెక్కు ఇచ్చారని మురళీధరన్ తన ఫేస్‌బుక్‌లో రాశారు. అప్పటినుంచి నోట్ల రద్దుకు మద్దతుగాను, వ్యతిరేకిస్తూ దానికి పలు రకాల కామెంట్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిల్లర దొరకట్లేదు మహాప్రభో అంటూ కొందరు చెప్పగా, శతికోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement