వాడండి.. డబ్బులు తీసుకోండి!
♦ పబ్లిక్ టాయిలెట్ ఉపయోగిస్తే రూపాయి ఇవ్వనున్న
♦ అహ్మదాబాద్ మున్సిపాలిటీ
♦ బహిర్భూమి అలవాటు మాన్పించేందుకు సరికొత్త ఐడియా
అహ్మదాబాద్: సాధారణంగా పబ్లిక్ టాయిలెట్ల వద్ద ‘పే అండ్ యూజ్’ అని రాసి ఉంటుంది కదా! స్వల్ప రుసుం చెల్లించి టాయిలెట్ ఉపయోగించుకోవాలని దాని అర్థం. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) దీన్ని తిరగరాస్తోంది.
‘యూజ్ అండ్ గెట్ పెయిడ్’ అంటూ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అంటే మరుగుదొడ్డి వాడినందుకు మున్సిపాలిటీయే ఒక రూపాయి తిరిగి చెల్లిస్తుందన్నమాట. నగరంలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు ఏఎంసీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ‘నగరంలో దాదాపు 315 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వీటి చుట్టుపక్కల దాదాపు 120 ప్రదేశాల్లో ప్రజలు బహిర్భూమికి వెళ్తున్నారు. వారితో ఈ అలవాటు మాన్పించేందుకే ఈ ఆలోచన చేశాం. వారు మరుగుదొడ్లు ఉపయోగించేలా చేయాలన్నది మా ఉద్దేశం.
వారం, పదిరోజుల్లో దీన్ని అమలు చేస్తాం’’ అని ఏఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ పటేల్ చెప్పారు. అయితే మరుగుదొడ్లను వాడినవారందరికీ రూపాయి ఇవ్వమని, బహిర్భూమికి వెళ్తున్న వారిని గుర్తించి వారికి మాత్రమే అందిస్తామని మున్సిపాలిటీ అధికారి భావిక్ జోషి చెప్పారు. బహిరంగ మలవిసర్జన చేసే 1,200 మందిని గుర్తించి ఒక జాబితా తయారు చేశామని, దగ్గర్లోని మరుగుదొడ్లు ఉపయోగిస్తే వారికి ఒక్కో రూపాయి అందిస్తామన్నారు. వారు టాయిలెట్లు వాడడం మొదలుపెట్టాక మరో జాబితా తయారు చేసి, వారితో బహిర్భూమి అలవాటు మాన్పిస్తామని వివరించారు.