రైల్వే జోన్‌కు పచ్చజెండా | The green signal railway zone | Sakshi
Sakshi News home page

రైల్వే జోన్‌కు పచ్చజెండా

Published Sat, Nov 29 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

రైల్వే జోన్‌కు  పచ్చజెండా

రైల్వే జోన్‌కు పచ్చజెండా

స్మార్టు సిటీగా ప్రకటించిన    నేపథ్యంలో విశాఖకు మరింత బలం
రైల్వేమంత్రి సానుకూల స్పందన
పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయముంటుందా..

 
విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కసరత్తు తొందర్లోనే ముగియనుంది. రైల్వే జోన్ ఏర్పాటు అంశం పూర్తిగా రాజకీయ నిర్ణయమే అయినా ఎలా వెలువడుతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జోన్ భవిష్యత్ ఓ కొలిక్కి రానుందని రైల్వే వర్గాలంటున్నాయి. జోన్ కమిటీ రైల్వే బోర్డుకు ఇప్పటికే తమ నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. కానీ రైల్వే బోర్డు దాన్ని  గోప్యంగా వుంచింది. నివేదిక ముఖ్యాంశాలు బయటకు పొక్కకమునుపే రైల్వే మంత్రి సదానంద గౌడ స్థానంలో సురేష్ ప్రభాకర్ ప్రభును రైల్వే మంత్రిగా  నియమించి బాధ్యతలు అప్పగించింది. ఆయన రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రతీ కార్మికునికీ ఓ లేఖ రాసి ఆకట్టుకుంటున్నారు. సురేష్‌ప్రభాకర్‌ను కొందరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్‌లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విశాఖ కేందంగా జోన్‌పై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రైల్వే సహాయ మంత్రి సిన్హా కూడా సానుకూలంగా వుండడంతో విశాఖకు రైల్వే జోన్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అమెరికా అభివృద్ది చేయనున్న మూడు స్మార్ట్ సిటీల్లో అహ్మదాబాద్, విశాఖలు వుండడంతో జోన్ కేంద్రం కూడా విశాఖకే అన్న భావన వ్యక్తమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలోగా కేంద్రం దీనిపై ఓ ప్రకటన చేయొచ్చని అంచనా.

ఇదిలా వుండగా రైల్వే బోర్డులో గానీ,రైల్వే జోనల్ కేంద్రమైన భువనేశ్వర్‌లో గానీ కొత్త రైల్వే జోన్ అంశంపై ఎలాంటి సమాచారం లేదని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చిన కమిటీ ఎలాంటి బలమైన సాంకేతిక అడ్డంకులను ప్రస్తావించలేదని భోగట్టా. జోన్ కేంద్రం విశాఖలో ఏర్పాటుకు అవసరమైన సాంకే తిక అడ్డంకులు లేకపోవడంతో నివేదికను మరోసారి లోతుగా పరిశీలించి నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. జోన్ మాటెలాఉన్నా కనీసం వాల్తేరును దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేసినా ఫర్వాలేదని కొందరంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement