పల్లె రైళ్లకు ‘కుంభమేళా’ బ్రేక్‌లు
పెదవి విరుస్తున్న పేద ప్రయాణికులు
రెండు నెలలపాటు ప్రయాణానికి గ్రహణం
ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు
నోరు మెదపలేని స్థితిలో కూటమి ఎంపీలు
రాజంపేట: తిరుపతి– గుంతకల్ మధ్య ఉన్న రెండు వేర్వేరు మార్గాల్లో పేదోడి రైళ్లకు బ్రేక్ వేశారు. ఏకంగా రెండునెలలపాటు పల్లె రైళ్లకు రాబోయే కుంభమేళా–2025 (Maha Kumbh Mela 2025) నేపథ్యంలో సెలవు ఇచ్చేశారు. పేదవాడి కోసం ఉన్నదే ఒకరైలు, దానిని కూడా రద్దు చేశారు. దీంతో పేద ప్రయాణిక వర్గాల్లో రైల్వేబోర్డు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.
దేశంలో ఎక్కడా రైళ్లు లేన్నట్లుగా రాయలసీమలో (Rayalaseema) ప్రతి గ్రామీణ రైల్వేస్టేషన్‌లో ఆగుతూ, పరుగులుతీసే పల్లెరైళ్లను కుంభమేళా–2025కు దారిమళ్లించడం ఇప్పుడు సీమలో వివాదాస్పదంగా మారుతోంది. దీంతో తిరుపతి–గుంతకల్ మధ్య వేర్వేరు రెండు రైలుమార్గాల్లో నడిచే పల్లె రైలును రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ సీవోఎం కె.మనికుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.
అడిగే నాథుడు లేన్నట్లుగా రైల్వే ఉన్నతాధికారులు గుంతకల్ డివిజన్ (Guntakal Division) పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వంపై పేదవర్గాల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది.
తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో..
తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే (07657/07658) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. తక్కువ ధరతో గమ్య చేరడానికి పేదవర్గాలకు ఈరైలు అనుకూలంగా ఉంది. తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరుతుంది. ప్రతి గ్రామీణస్టేషన్‌లో ఆగుతుంది. దీనిని రద్దు చేయడంతో ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
గుంతకల్–తిరుపతి(ధర్మవరంలైన్)మార్గంలో..
గుంతకల్– తిరుపతి (ధర్మవరంలైన్) మార్గంలో 07589/07590 నంబరుగల తిరుపతి నుంచి కదిరి దేవరపల్లెకు నడిచే పల్లెరైలును కూడా రద్దు చేశారు. ఈ రైలు అనంతపురం, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేది.
డివిజన్ కేంద్రం గుంతకల్‌కు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ప్యాసింజర్ రైలు నడిచేది. ఈ రైలు కూడా ఆ మార్గంలో ఉన్న పీలేరు, మదనపల్లె, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన పల్లె వాసులకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఆ రైలు రద్దు కావడంతో ఎక్స్‌ప్రెస్‌రైళ్లే దిక్కయ్యాయి
రెండునెలలపాటు ప్రయాణానికి గ్రహణం
కుంభమేళా–2025 కోసం రెండునెలల పాటు తిరుపతి నుంచి కడప మీదుగా, అటు ధర్మవరం మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల మీదుగా ఉండే రైలుమార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడి ప్రయాణించే వేలాదిమంది పేదలకు పల్లెరైళ్లను దూరం చేశారు.
ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు
ఏకంగా రెండు రైలుమార్గాల్లో ఆరు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే గ్రామీణులు ఇబ్బందులను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదన్న అపవాదును మూటకట్టుకుంది. రైల్వేబోర్డు కుంభమేళాకు రేక్స్ కేటాయించాలని కోరితే, దక్షిణమధ్య రైల్వే అధికారులు రాయలసీమలో పేదలకు అందుబాటులో ఉండే రైళ్లను కేటాయించడంపై విమర్శలు వెలువడుతున్నాయి.
ఇతర రైల్వేజోన్‌తోపాటు మరికొన్ని డివిజన్లలో రేక్ పొజిషన్ పుష్కలంగా ఉన్నప్పటికి ‘సీమ’పల్లెరైళ్లను కేటాయించారు. ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎంపీలు నోరుమెదిపే పరిస్థితిలో లేరని పేదప్రయాణికులు ఎద్దేవా చేస్తున్నారు.
మార్చి 1వరకు పల్లె రైళ్లకు సెలవు
రైల్వేబోర్డు ఆదేశాలతో దక్షిణమధ్య రైల్వే వారు తిరుపతి–కదిరిదేవరపల్లె ప్యాసింజర్ రైలు, గుంతకల్–తిరుపతి ప్యాసింజర్‌రైలు, తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చేయేడాది మార్చి01 వరకు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈరైళ్లు రెండు మార్గాల్లో కూడా నడవవు.
సామాన్యుడు అంటే చిన్నచూపు
పేదోడి రైళ్లను రద్దు చేస్తే అడిగేవారు లేరన్న ధీమాలో కేంద్రప్రభుత్వం ఉంది. ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో జనరల్‌బోగీలు వేయడంలో రైల్వే వివక్షను ప్రదర్శిస్తోంది. ప్యాసింజర్‌రైళ్లు రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా రైళ్లను నడపాలి. సామాన్యుడు అంటేనే కేంద్రానికి చిన్నచూపు. – టీఎల్ వెంకటేశ్, సీపీఐ నేత, పీలేరు
పేదలను ఇబ్బందులు పెట్టారు...
తక్కువ ధరతో పల్లెవాసులకు అనుకూలంగా ఉన్న ఇంటర్‌సిటీ రైలును రద్దు చేయడం అన్యాయం. తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ వరకు పేదవర్గాలు తక్కువ వ్యయంతో వెళ్లే వారు. ఉన్న ప్యాసింజర్ రైళ్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్‌రైలును నడపాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలంటే మోదీ సర్కారుకు చిన్నచూపు.
– పులివేల రమణయ్య, నాగిరెడ్డిపల్లె, నందలూరు
Comments
Please login to add a commentAdd a comment