
1200 ఉచిత వై-ఫై స్పాట్లు
దేశానికి వాణిజ్యనగరంగా పేరున్న ముంబాయి ఇక స్మార్ట్సిటీగా రూపుదిద్దుకోనుంది. ముంబాయి నగరంలో 1200 ఉచిత వై-ఫై హాట్స్పాట్లు ఏర్పాటుచేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రముఖ ప్రదేశాల్లో 2017 మే కల్లా 1200 ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేసి, ముంబాయిని వై-ఫై నగరంగా మార్చుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్పై జరిగిన చర్చలో కూడా ఫడ్నవీస్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. సీసీటీవీ ప్రాజెక్టు అనంతరం ముంబాయిని స్మార్ట్సిటీగా రూపొందించడంలో ఇది మరో కీలక అడుగని పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా 500 హాట్స్పాట్లను 2016 నవంబర్ కల్లా కల్పిస్తామని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన ఆక్షన్ తేదీలను ఇంకా తెలుపలేదు.
ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ప్రజలకు అందించడంలో ఢిల్లీ మొదటి నగరంగా ఉంటోంది. మెట్రో నగరాల్లో ప్రజలు ఫీచర్ ఫోన్లకంటే స్మార్ట్ఫోన్ల వాడకంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే డేటా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్నెట్ వినియోగానికి ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉచిత వై-ఫై స్పాట్లను ఏర్పాటుచేయడం ప్రజలకు ఉపయుక్తమని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. మెట్రో నగరాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
మరోవైపు టెక్ కంపెనీలు సైతం ఉచిత వై-ఫై సౌకర్యాలు అందించడంలో భాగస్వాములుగా మారుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్, దేశమంతటా గల ఇండియన్ రైల్వే ప్లాట్ఫామ్స్లో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ప్యాసెంజర్లకు అందిస్తుండగా.. మైక్రోసాప్ట్ 5 లక్షల గ్రామాలకు తక్కువ ధరకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ను అందించాలని ప్లాన్ చేస్తోంది. వైట్ స్పేస్ టెక్నాలజీతో గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించడంలో మైక్రోసాప్టే మొదటి కంపెనీ.