(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి)
సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మనకు అందని చందమామలు నట్టింట దిగుతున్నాయి. చక్రం కనిపెట్టడంతో జీవన గమనంలో పెరిగిన వేగం పారిశ్రామిక విప్లవంతో ఎన్నో సౌకర్యాలను అందించింది. ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇప్పుడు మనిషికి చిటికెలో అమరుతున్నాయి.
మన రోజువారీ జీవితాన్ని మలుపు తిప్పుతున్న సరికొత్త పరిజ్ఞానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’(ఐవోటీ) కాగా దానికి దన్నుగా నిలుస్తున్న శక్తి ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). మన ఫిట్‌నెస్ స్థాయిని చూపించడం మొదలు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం వరకు ఏఐ, ఐవోటీ మేలు కలయికతో మన కళ్లెదుటే ఆవిష్కృతమవుతున్నాయి.
అద్భుత భవిష్యత్‌కు బాట ఎంతోదూరంలో లేదని అర్థమవుతోంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల కోట్ల ఉపకరణాలు (డివైస్) ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉంటాయని అంచనా. ఇవి మన ఆన్‌లైన్ కార్యకలాపాలను సేకరించడం, సమాచారం పరస్పరం మార్చుకోవడం, ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఇంటర్‌నెట్ అనుసంధానానికి శక్తిని, యుక్తిని ఏఐ అందిస్తోంది.
వేరియబుల్స్ (ధరించే ఉపకరణాలు)
స్మార్ట్‌వాచ్ లాంటి వేరియబుల్స్ నిరంతరాయంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ట్రాక్ చేయగలవు. హార్ట్‌బీట్, ఆక్సిజన్ లెవల్, వేస్తున్న అడుగులు, ఖర్చవుతున్న శక్తి, నిద్రలో నాణ్యత.. ఇవన్నీ రికార్డు చేయగలవు. మధుమేహాన్ని కచ్చితంగా అంచనా వేసే డివైస్‌లు ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. గంట గంటకూ షుగర్ లెవల్‌ను రికార్డు చేస్తున్నాయి.
వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తోంది. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్యులకు చేరవేయడంతో పాటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను ముందుగా హెచ్చరించే పరిజ్ఞానం త్వరలో సాకారం కానుంది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘గాట్నర్’ అంచనా ప్రకారం ప్రపంచ వేరియబుల్ డివైస్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
స్మార్ట్ హోమ్
మనం ఇచ్చే వాయిస్ కమాండ్‌కు ఇంట్లో వస్తువులు ప్రతిస్పందించడం గతంలో సైన్స్ ఫిక్షన్‌కు పరిమితం. ఇప్పుడది వాస్తవం. ఇంటి యజమాని అవసరాలు, అలవాట్లను గుర్తెరిగి ప్రవ ర్తించే డివైస్‌లతో ఇంటిని నింపేయడం సమీప భవిష్యత్‌లో సాకారమయ్యే విషయమే. ‘అలెక్సా’ ఇప్పటికే మన నట్టింట్లోకి వచ్చేసి వాయిస్ కమాండ్‌కు ప్రతిస్పందిస్తుంది. మనుషుల వ్యక్తిగత రక్షణ, ఇంటి భద్రతకు హెచ్చరికలను సంబంధిత వ్యవస్థలు/వ్యక్తులకు చేరవేసే టెక్నాలజీ కూడా రానుంది. స్మార్ట్‌హోమ్ గ్లోబల్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని ‘గాట్నర్’ అంచనా.
స్మార్ట్ సిటీ
ఇది పట్టణీకరణ యుగం. నగరా లకు వలసలు పెద్ద ఎత్తున పెరుగు తున్నాయి. పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన సామర్థ్యం వృద్ధి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగైన నియంత్రణకు ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ద్వారా రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఇందులో వాడుతున్నది కృత్రిమ మేధస్సే.
స్మార్ట్ ఇండస్ట్రీ
మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మైనింగ్ వరకు.. ప్రతి పరిశ్రమలో సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి, మానవ తప్పిదాలను పూర్తిగా నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో డిజిటల్ రూపాంతరీకరణ ఇప్పటికే మొదలైంది. వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం పరిశ్రమల్లో ఏఐ వినియోగం మొదలవుతుందని అంచనా. రియల్ టైమ్ డేటా విశ్లేషణ నుంచి సప్లైచైన్ సెన్సార్ల వరకు పారిశ్రామిక రంగంలో ‘ఖరీదైన తప్పుల’ను నివారించడానికి ఏఐ దోహదం చేస్తుంది.
రవాణా
డ్రైవర్ అవసరంలేని వాహనాల రూపకల్పనకు పునాది వేసింది కృత్రిమ మేధ. మనిషి తరహాలో ఆలోచనను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పనులను ఏఐ ద్వారా ఉపకరణాలు చేసేస్తున్నాయి. అటానమస్ వాహనాలు మాత్రమే రోడ్డు మీద కనిపించే రోజు సమీప భవిష్యత్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment