Smart Home
-
iSmart హోమ్స్
ఇప్పటి వరకూ ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్, బ్యాంకింగ్ వంటి పలు రంగాలకే పరిమితమైన ఆటోమేషన్.. ఇప్పుడు నట్టింట్లోకి చేరిపోయింది. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్‌గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతీ ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని సెల్‌ఫోన్‌తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్‌పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. దీంతో గతేడాదికి దేశంలో స్మార్ట్ హోమ్ మార్కెట్ రూ.90 వేల కోట్లుగా ఉందని, 2028 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని రెడ్‌సీర్ నివేదిక అంచనా వేసింది. ఎలా పనిచేస్తాయంటే.. విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, కేఎన్ఎక్స్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్బీ నాలుగు రకాల వైర్లెస్ ప్రొటోకాల్స్‌తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని సెల్ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్‌ను మాత్రమే గుర్తించేలా ఆయా ఉపకరణాలను అనుసంధానించవచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్‌నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ప్లగ్‌తో పాత ఇళ్లకు కూడా.. పాత ఇళ్లను కూడా హోమ్ ఆటోమేషన్ చేయవచ్చు. సాధారణంగా మనం ఇళ్లలో వినియోగించే ఎక్స్టెన్షన్ బాక్స్లాగే ‘స్మార్ట్ ప్లగ్’తో ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో అల్రెడీ ఉన్న స్విచ్‌లో ఈ స్మార్ట్ ప్లగ్‌ను పెడితే చాలు.. 16 ఏఎంపీ వరకూ విద్యుత్ ఉపకరణాలను స్మార్ట్‌గా వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.1,500 నుంచి రూ.5,000 వరకూ ఉంటుంది. లాభాలెన్నో.. హోమ్ ఆటోమేషన్తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్‌లో 20–30 శాతం వరకూ విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్(ఫ్లాట్)లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్‌తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజినీర్, నెట్వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు.ఐఓటీ, ఏఐతోనే..ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్.. ఇలా ప్రతి ఒక్క దాన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీలతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.సౌకర్యం కావాలంటున్నారుఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సౌకర్యవంతం కోరుకుంటున్నారు. హోమ్ ఆటోమేషన్ ఉన్న ఇళ్ల కొనుగోలుకు యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ తరహా ఇళ్లకు గిరాకీ పెరిగింది.– నర్సిరెడ్డి, ఎండీ, ఐరా రియల్టీస్మార్ట్ హోమ్స్‌కు డిమాండ్ కరోనా తర్వాతి నుంచి ఇల్లు స్మార్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. వాయిస్ కమాండ్స్, యాప్స్ ద్వారా పనిచేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లలో హోమ్ ఆటోమేషన్‌కు డిమాండ్ పెరిగింది.– మారుతీ రావు, వైస్ ప్రెసిడెంట్, పౌలోమీ ఎస్టేట్స్ -
ఎన్నెన్నో ‘ఏఐ’ సేవలు.. మనిషి జీవితంలో ఊహించని మార్పులు
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మనకు అందని చందమామలు నట్టింట దిగుతున్నాయి. చక్రం కనిపెట్టడంతో జీవన గమనంలో పెరిగిన వేగం పారిశ్రామిక విప్లవంతో ఎన్నో సౌకర్యాలను అందించింది. ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇప్పుడు మనిషికి చిటికెలో అమరుతున్నాయి. మన రోజువారీ జీవితాన్ని మలుపు తిప్పుతున్న సరికొత్త పరిజ్ఞానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’(ఐవోటీ) కాగా దానికి దన్నుగా నిలుస్తున్న శక్తి ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). మన ఫిట్నెస్ స్థాయిని చూపించడం మొదలు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం వరకు ఏఐ, ఐవోటీ మేలు కలయికతో మన కళ్లెదుటే ఆవిష్కృతమవుతున్నాయి. అద్భుత భవిష్యత్‌కు బాట ఎంతోదూరంలో లేదని అర్థమవుతోంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల కోట్ల ఉపకరణాలు (డివైస్) ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయని అంచనా. ఇవి మన ఆన్లైన్ కార్యకలాపాలను సేకరించడం, సమాచారం పరస్పరం మార్చుకోవడం, ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఇంటర్నెట్ అనుసంధానానికి శక్తిని, యుక్తిని ఏఐ అందిస్తోంది. వేరియబుల్స్ (ధరించే ఉపకరణాలు) స్మార్ట్‌వాచ్ లాంటి వేరియబుల్స్ నిరంతరాయంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ట్రాక్ చేయగలవు. హార్ట్‌బీట్, ఆక్సిజన్ లెవల్, వేస్తున్న అడుగులు, ఖర్చవుతున్న శక్తి, నిద్రలో నాణ్యత.. ఇవన్నీ రికార్డు చేయగలవు. మధుమేహాన్ని కచ్చితంగా అంచనా వేసే డివైస్‌లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. గంట గంటకూ షుగర్ లెవల్‌ను రికార్డు చేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తోంది. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్యులకు చేరవేయడంతో పాటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను ముందుగా హెచ్చరించే పరిజ్ఞానం త్వరలో సాకారం కానుంది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘గాట్నర్’ అంచనా ప్రకారం ప్రపంచ వేరియబుల్ డివైస్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. స్మార్ట్ హోమ్ మనం ఇచ్చే వాయిస్ కమాండ్‌కు ఇంట్లో వస్తువులు ప్రతిస్పందించడం గతంలో సైన్స్ ఫిక్షన్‌కు పరిమితం. ఇప్పుడది వాస్తవం. ఇంటి యజమాని అవసరాలు, అలవాట్లను గుర్తెరిగి ప్రవ ర్తించే డివైస్లతో ఇంటిని నింపేయడం సమీప భవిష్యత్‌లో సాకారమయ్యే విషయమే. ‘అలెక్సా’ ఇప్పటికే మన నట్టింట్లోకి వచ్చేసి వాయిస్ కమాండ్‌కు ప్రతిస్పందిస్తుంది. మనుషుల వ్యక్తిగత రక్షణ, ఇంటి భద్రతకు హెచ్చరికలను సంబంధిత వ్యవస్థలు/వ్యక్తులకు చేరవేసే టెక్నాలజీ కూడా రానుంది. స్మార్ట్‌హోమ్ గ్లోబల్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని ‘గాట్నర్’ అంచనా. స్మార్ట్ సిటీ ఇది పట్టణీకరణ యుగం. నగరా లకు వలసలు పెద్ద ఎత్తున పెరుగు తున్నాయి. పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన సామర్థ్యం వృద్ధి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగైన నియంత్రణకు ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఇందులో వాడుతున్నది కృత్రిమ మేధస్సే. స్మార్ట్ ఇండస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మైనింగ్ వరకు.. ప్రతి పరిశ్రమలో సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి, మానవ తప్పిదాలను పూర్తిగా నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో డిజిటల్ రూపాంతరీకరణ ఇప్పటికే మొదలైంది. వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం పరిశ్రమల్లో ఏఐ వినియోగం మొదలవుతుందని అంచనా. రియల్ టైమ్ డేటా విశ్లేషణ నుంచి సప్లైచైన్ సెన్సార్ల వరకు పారిశ్రామిక రంగంలో ‘ఖరీదైన తప్పుల’ను నివారించడానికి ఏఐ దోహదం చేస్తుంది. రవాణా డ్రైవర్ అవసరంలేని వాహనాల రూపకల్పనకు పునాది వేసింది కృత్రిమ మేధ. మనిషి తరహాలో ఆలోచనను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పనులను ఏఐ ద్వారా ఉపకరణాలు చేసేస్తున్నాయి. అటానమస్ వాహనాలు మాత్రమే రోడ్డు మీద కనిపించే రోజు సమీప భవిష్యత్‌లో ఉంది. -
ఈ స్మార్ట్ హోమ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. అందుకే, ప్రపంచంలోకి కొత్త కొత్త ఆవిష్కరణలు ఆవిష్కృతం అవుతాయి. గృహ రంగానికి సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. భవిష్యత్ మొత్తం టెక్నాలజీ అని చెప్పుకోవడానికి ఇదో ఓ ఉదాహరణ. ఇప్పటి వరకు ఇల్లు అనేది నిశ్చలంగా ఉండేది. ఇక నుంచి మన ఇల్లును మనకు నచ్చిన చోటుకు తీసుకొని వెళ్లవచ్చు. నెస్ట్రన్ కంపెనీ తర్వాతి తరం ఇళ్లను నిర్మిస్తుంది. ఇది చూడాటానికి అన్నీ సౌకర్యాలతో గల ఒక "స్మార్ట్ హోమ్" లాగా అనిపిస్తుంది. నెస్ట్రాన్ క్యూబ్ సిరీస్ లో మొదటిసారి జనవరి 2020లో సింగిల్ రూమ్ గల ఒక స్మార్ట్ హోమ్ నిర్మించింది. కానీ, ఇది చిన్నగా ఉండటంతో అనుకున్నంత ప్రజాదరణ రాలేదు. అందుకే ముగ్గురు లేదా నలుగురు నివసించేందుకు వీలుగా క్యూబ్ టూ ఎక్స్(సీ2ఎక్స్) మరో స్మార్ట్ హోమ్ మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఇది చాలా పాపులర్ అయ్యింది. దీనిలో ఫ్లోర్ టూ సీలింగ్ విండో, డబుల్ ఫ్రంట్ డోర్లు, పొడవైన, ల్యాండ్ స్కేప్ తరహా పిక్చర్ విండో ఉంది. నెస్ట్రాన్ సి2ఎక్స్ లో డిజిటల్ లాక్, ఎలక్ట్రిక్ బ్లైండ్, మోషన్ సెన్సింగ్ లైట్లు, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఈ పడవ నీటిలోనే కాదు..గాల్లో కూడా నడుస్తుంది...!) భూకంపాలు, హరికేన్లు తట్టుకునేలా నిర్మాణం దీనిలో ఇంకా స్మార్ట్ మిర్రర్లు, వాల్ మౌంటెడ్ టాబ్లెట్, స్మార్ట్ కిచెన్, స్మార్ట్ టాయిలెట్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, స్మార్ట్ ఫర్నిచర్, స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ అనుభవాన్ని అందించడానికి నెస్ట్రాన్ తన స్వంత "కాన్నీ" ఏఐ వ్యవస్థపై కూడా పనిచేస్తోంది. నెస్ట్రాన్ సీ2ఎక్స్ భూకంపాలు, హరికేన్లు, తుఫానులను దృష్టిలో పెట్టుకొని ఇన్సులేటెడ్, గాల్వనైజ్డ్ స్టీల్ ఫ్రేమ్డ్ నిర్మాణాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అలాగే, నెస్ట్రాన్ సోలార్/బ్యాటరీ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. క్యూబ్ టూ ఎక్స్ గత వారం ప్రీఆర్డర్ కోసం $98,000(సుమారు రూ.73 లక్షలు)తో ప్రారంభ ప్రమోషనల్ ధరతో ప్రారంభించింది. ఇంకా దీనిలో చాలా ఇతర ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ఈ స్మార్ట్ హోమ్ చూసేయండి.(చదవండి: ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు!) -
అలారం మోగి.. హెచ్చరిస్తుంది
న్యూఢిల్లీ : ‘స్మార్ట్ హోం టెక్నాలజీ’ 2019 సంవత్సరంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ రంగం 2020 సంవత్సరంలో ఎంతో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి సరైన భద్రతను కల్పించడం, ఫ్యాన్లను, లైట్లను ఇంటి నుంచి, ఇంటి వెలుపల నుంచి స్మార్ట్ఫోన్ల ద్వారా అన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇంటికి కాలింగ్ బెల్‌ను నొక్కుతున్నది ఎవరో? ఇంటి లోపలి నుంచే కాకుండా, ఇంటి వెలుపలి నుంచి కూడా కనుగొనడం, కాలింగ్ బెల్కు అమర్చిన బెల్లు ద్వారా వారిని చూడడం, ఇంట్లో వంట గ్యాస్ ఆఫ్ చే శామా, లేదా? బయటి నుంచి కనిపెట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా కట్టివేయడం తదితర సదుపాయాలన్నీ ‘స్మార్ట్ హోం టెక్నాలజీ’ పరిధిలోకి వస్తాయి. వీటి ద్వారా ఇంటికి సరైన భద్రత లభించడంతోపాటు విద్యుత్, గ్యాస్ లాంటి ఇంధనాల ఖర్చు కలసివస్తోంది. స్మార్ట్ డోర్‌బెల్: 2019లో అభివృద్ధి చేసిన వాటిలో ఇది ఒకటి. బెల్కు అమర్చిన కెమేరా ద్వారా బెల్ కొట్టిందెవరో చూడవచ్చు. డోర్ తీయకుండానే వారితో మాట్లాడి విషయం తెలుసుకోవచ్చు. దీనికో యాప్‌ను కూడా రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఇంటి వెలుపల ఎక్కడున్నా బిల్ కొట్టిన వారిని మన స్మార్ట్‌ఫోన్‌లో చూడవచ్చు. వారితో మాట్లాడవచ్చు. స్మార్ట్ డోర్‌లాక్: రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రధాన ద్వారం తలుపులు తెరవచ్చు, మూయవచ్చు. ఇంటి యజమాని ఇంట్లోకి వస్తున్న విషయాన్ని గ్రహించి ఆయన లేదా ఆమె రాగానే తలుపులు తెరచుకొని, మళ్లీ మూసుకునేలా చేయవచ్చు. ఇంట్లోని అన్ని డోర్లకు ఈ టెక్నాలజీ పనికి రాదు. గందరగోళం వల్ల తలుపులు తెరుచుకోవడం, మూసుకునే వ్యవస్థ దెబ్బతినవచ్చు. భవిష్యత్తులో ఈ ఇబ్బందులు తొలగిపోవచ్చు. స్మార్ట్ లైట్బల్బ్స్: యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచి కావాల్సినప్పుడు ఇంట్లోని లైట్లను ఆన్ చేయవచ్చు, ఆఫ్ చేయవచ్చు. ఊరికి పోయినప్పుడు కూడా ఇంట్లోని లైట్లను రాత్రి పూట ఆన్‌చేసి, తెల్లవారుజామున ఆఫ్ చేయవచ్చు. తద్వారా ఇంటివారు ఇంట్లోనే ఉన్నారన్న భ్రమ కలిగించవచ్చు. స్మార్ట్ అలారమ్స్ : ఎవరైన తలుపు తెరచినప్పుడు గానీ, కిటికీ తెరచినప్పుడుగానీ అలారం మోగి మనల్ని హెచ్చరిస్తుంది. దీనికి 24 గంటల బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. స్మార్ట్ థర్మోస్టాట్స్: రోజులో ఎప్పుడు, ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తూ డబ్బు వృధాను అరకట్టే గ్యాడ్జెట్. ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంటికి ఎంతో భద్రతను తెచ్చుకున్న విషయం తెల్సిందే. మున్ముందు ఈ ‘స్మార్ట్ హోం టెక్నాలజీ’లో ఎన్నెన్ని అద్భుతాలు పుట్టుకొస్తాయో! -
ఇక శామ్సంగ్ స్మార్ట్‌హోమ్స్!
బెర్లిన్: దాదాపు 100 బిలియన్ డాలర్ల స్మార్ట్‌హోమ్స్ మార్కెట్‌పై దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ దృష్టి పెట్టింది. భవిష్యత్ తరం ఇళ్లకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థలతో కలసి పనిచేయనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ బూ-కియున్ యూన్ తెలిపారు. ఇప్పటికే తమ అనుబంధ సంస్థ స్మార్ట్ టెక్నాలజీస్ ఈ దిశగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రారంభించినట్లు ఎలక్ట్రానిక్స్ పరికరాల అంతర్జాతీయ ట్రేడ్ షో ఐఎఫ్ఏకి హాజరైన సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం భాగస్వామ్య సంస్థలతో కలిసి 1,000 పైగా పరికరాలు, 8,000 పైచిలుకు స్మార్ట్‌హోమ్ యాప్స్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఐఎఫ్ఏ జరగనుంది. గోడలను జరిపి బెడ్రూమ్ను డైనింగ్ రూమ్‌గా మార్చడం, ఫర్నిచర్‌ను అవసరానికి అనుగుణంగా ఆటోమేటిక్‌గా మార్చడం, పీల్చే గాలిలో క్రిములను గుర్తించి .. సంహరించడం, ఇంట్లో నివసించే వారు తీసుకోవాల్సిన భోజనం, ఔషధాలు మొదలైన వాటిని గురించి గుర్తు చేయడం వంటి టెక్నాలజీలు స్మార్ట్హోమ్స్లో భాగంగా ఉంటాయి. విద్యుత్ వినియోగం అవసరాలను గుర్తించి, తదనుగుణంగా కరెంటును ఉపయోగిస్తాయి ఈ ఇళ్లు. భవిష్యత్ తరం గృహాలు రక్షణ కల్పించడంతో పాటు మనుషుల అవసరాలకు అనుగుణంగా స్పందించగలిగేవిగా ఉంటాయని యూన్ పేర్కొన్నారు. 2018 నాటికల్లా 4.5 కోట్ల స్మార్ట్‌హోమ్స్ ఉండగలవని, ఈ విభాగం మార్కెట్ 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని ఆయన అంచనా వేశారు.