iSmart హోమ్స్‌ | Smart Home Trend in Hyderabad | Sakshi
Sakshi News home page

iSmart హోమ్స్‌

Sep 25 2024 7:17 AM | Updated on Sep 25 2024 7:27 AM

Smart Home Trend in Hyderabad

భద్రత, ఆదా, సౌకర్యం..  హోమ్‌ ఆటోమేషన్‌ లాభాలివే.. 

ఇంట్లో ప్రతి ఎలక్ట్రానిక్‌ ఉపకరణం ఫోన్‌తోనే నిర్వహణ 

లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలలో వీటి ఏర్పాటు 

స్మార్ట్‌ ప్లగ్‌తో పాత గృహాలకూ  ఆటోమేషన్‌ వీలు 

కరోనా తర్వాత స్మార్ట్‌ హోమ్స్‌పై నగరవాసుల్లో పెరిగిన ఆసక్తి  

ఇప్పటి వరకూ ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్, బ్యాంకింగ్‌ వంటి పలు రంగాలకే పరిమితమైన ఆటోమేషన్‌.. ఇప్పుడు నట్టింట్లోకి చేరిపోయింది. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్‌ ఆటోమేషన్‌ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్‌గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్‌ హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతీ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాన్ని సెల్‌ఫోన్‌తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్‌ హోమ్స్‌ ప్రత్యేకత. 

కరోనా తర్వాత నుంచి హోమ్‌ ఆటోమేషన్‌పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్‌ హోమ్స్‌ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. దీంతో గతేడాదికి దేశంలో స్మార్ట్‌ హోమ్‌ మార్కెట్‌ రూ.90 వేల కోట్లుగా ఉందని, 2028 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని రెడ్‌సీర్‌ నివేదిక అంచనా వేసింది. 

ఎలా పనిచేస్తాయంటే.. 
విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, కేఎన్‌ఎక్స్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్‌గ్రాండ్, పెర్ట్‌ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్‌లెస్, వైర్డ్‌ అనే రెండు రకాల హోమ్‌ ఆటోమేషన్‌ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్‌ వేవ్, జిగ్‌బీ నాలుగు రకాల వైర్‌లెస్‌ ప్రొటోకాల్స్‌తో ఆటోమేషన్‌ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇంట్లోని ఎన్ని సెల్‌ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్‌ను మాత్రమే గుర్తించేలా ఆయా ఉపకరణాలను అనుసంధానించవచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్‌నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్‌ చేసుకోవచ్చు. 

స్మార్ట్‌ ప్లగ్‌తో పాత ఇళ్లకు కూడా.. 
పాత ఇళ్లను కూడా హోమ్‌ ఆటోమేషన్‌ చేయవచ్చు. సాధారణంగా మనం ఇళ్లలో వినియోగించే ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లాగే ‘స్మార్ట్‌ ప్లగ్‌’తో ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో అల్రెడీ ఉన్న స్విచ్‌లో ఈ స్మార్ట్‌ ప్లగ్‌ను పెడితే చాలు.. 16 ఏఎంపీ వరకూ విద్యుత్‌ ఉపకరణాలను స్మార్ట్‌గా వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.1,500 నుంచి రూ.5,000 వరకూ ఉంటుంది. 

లాభాలెన్నో.. 
హోమ్‌ ఆటోమేషన్‌తో విద్యుత్‌ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్‌ హోమ్స్‌లో 20–30 శాతం వరకూ విద్యుత్‌ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌(ఫ్లాట్‌)లో వీడియో డోర్‌ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్‌తో కూడిన బేసిక్‌ హోమ్‌ ఆటోమేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజినీర్, నెట్‌వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్‌ ఆటోమేషన్‌ పూర్తి చేస్తారు.

ఐఓటీ, ఏఐతోనే..
ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్‌ థియేటర్, గార్డెన్‌.. ఇలా ప్రతి ఒక్క దాన్నీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్‌ ఆటోమేషన్‌. అలెక్సా, గూగుల్‌ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్‌ అసిస్టెంట్‌ టెక్నాలజీలతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్‌ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.

సౌకర్యం కావాలంటున్నారు

ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సౌకర్యవంతం కోరుకుంటున్నారు. హోమ్‌ ఆటోమేషన్‌ ఉన్న ఇళ్ల కొనుగోలుకు యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ తరహా ఇళ్లకు గిరాకీ పెరిగింది.

– నర్సిరెడ్డి, ఎండీ, ఐరా రియల్టీ

స్మార్ట్‌ హోమ్స్‌కు డిమాండ్‌  
కరోనా తర్వాతి నుంచి ఇల్లు స్మార్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. వాయిస్‌ కమాండ్స్, యాప్స్‌ ద్వారా పనిచేసే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లలో హోమ్‌ ఆటోమేషన్‌కు డిమాండ్‌ పెరిగింది.

– మారుతీ రావు, వైస్‌ ప్రెసిడెంట్, పౌలోమీ ఎస్టేట్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement