ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు! | Side Effects Of Tattooing And Precautions To Be Taken While Getting Tattooed, Explained In Telugu | Sakshi
Sakshi News home page

Tattoo Side Effects And Risks: ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు!

Published Mon, Aug 26 2024 8:27 AM | Last Updated on Mon, Aug 26 2024 8:50 AM

Side Effects Of Tattooing And Precautions To Be Taken While Getting Tattooed

ముద్రకు ముందు ముందస్తు జాగ్రత్తలు అవసరం

అజాగ్రత్తగా ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవు

ఫ్యాషన్‌ సరే.. ప్రిపరేషన్‌ ముఖ్యమంటున్న నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: నేను ఫ్యాషన్‌ లవర్ని అని చెప్పకుండానే చెప్పే మార్గం టాటూ.. ఇప్పుడు వయసుతో పనిలేకుండా అన్ని వర్గాల వారూ టాటూస్‌ని ముద్రించుకోవడం నగరంలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో టాటూస్‌ వినియోగంలో అనుభవం ఉన్నవారితోపాటు కొత్తగా వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నవారికీ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎంత ఫ్యాషన్‌ అయినప్పటికీ టాటూ కల్చర్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టాటూ వేయించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకో తెలియాలంటే.. టాటూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి కూడా మనం తెలు సుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్‌ లోపిస్తే వచ్చే పరేషాన్‌ ఏమిటో అర్థం అవుతుంది.
"స్వతహాగా చర్మ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా ముందుగా వ్యాధులు ఏవైనా ఉంటే, పచ్చబొట్టు వేయించుకునే ముందు వాటి గురించి వైద్యునితో చర్చించి వారి సలహా మేరకు టాటూ వేయించుకోవాలి."

టాటూ వేయడానికి ముందు, దానికి వినియోగించే సూదులు క్రిమిరహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. స్టెరిలైజ్‌ చేయని లేదా కలుíÙతమైన సూదులను ఉపయోగించడం వల్ల హెచ్‌ఐవీ,  హెపటైటిస్‌ బీ–సీ వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. 
– వెంటనే లేదా టాటూ వేసిన మొదటి రెండు వారాల్లో స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. వాపు, నొప్పి, ఎరుపు, దురద లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జ్వరం, పుండ్లు లేదా చీముకు దారితీస్తుంది. శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసే ముందు నాన్‌ స్టెరైల్‌ వాటర్‌ని కలిపితే స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ కూడా రావచ్చు. కాబట్టి తరచి చూసుకోవడం అవసరం.  
– ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ప్రక్రియలు చేయించుకుంటున్న రోగులు పచ్చబొట్టు పొడిచిన ప్రదే   శంలో మంట, దురద లేదా వాపును అనుభవించవచ్చు.  
– ఇది తక్కువ–నాణ్యత లేని రంగులు లేదా టాటూ పిగ్మెంట్లలో ఐరన్‌ ఆక్సైడ్‌ వంటి రసాయనాల వల్ల కూడా కావచ్చు.  
– టాటూ వేయడానికి అయ్యే ఖర్చు కళాకారుడిపై మాత్రమే కాక ఉపయోగించిన సిరా రకం, పచ్చబొట్టు పరిమాణం, ఇంక్‌ చేయాల్సిన ప్రాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఖర్చుతో రాజీపడకుండా పేరున్న కళాకారుడితో టాటూ వేయించుకోవడం మేలు. 
– టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత రంగు వాడిపోతుంది. కాబట్టి, రంగు సాంద్రతను స్థిరీకరించడానికి కొన్ని టచ్‌–అప్‌లు అవసరం కావచ్చు.   
– స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలను నివారించడానికి టాటూ అనంతర సంరక్షణ చాలా ముఖ్యం. ఆ ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకూ కళాకారుడి సలహాను పాటించండి.
– టాటూలు వేసే పదాల స్పెల్లింగ్‌లు సరైనవని నిర్ధారించుకోవాలి. ఒక్కసారి టాటూ పూర్తయిన తర్వాత అక్షర దోషాలను సరిదిద్దలేరు. 
– మధుమేహం నియంత్రణలో లేకుంటే  వైద్య సలహా తీసుకోవడం మంచిది.  
– టాటూ ఆర్టిస్ట్‌ చేతులను కడుక్కొని, స్టెరిలైజ్‌ చేసుకున్న తర్వాత  టాటూ ప్రక్రియకు ముందు కొత్త గ్లౌజ్‌లు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. 
– ప్రక్రియకు 24 గంటల ముందు కెఫిన్‌ లేదా ఆల్కహాల్‌ను తీసుకోవద్దు. ఈ పదార్థాలు రక్తాన్ని పలచన చేసేవిగా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో 
ప్రక్రియ సమయంలో అధిక రక్తస్రావం ఉండవచ్చు. 
– టాటూ కోసం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి వదులుగా  సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది.  
– కనీసం 24 నుంచి 48 గంటల ముందు రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకోకుండా ఉండటం మంచిది.

అనారోగ్య ‘ముద్ర’.. 
అనస్థీషియా లేకుండా టాటూ వేయడం వల్ల కొంత నొప్పి, రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే టాటూ ఇంక్‌లో ఉండే రసాయనాలు లేదా లోహాలు, ప్రత్యేకించి కొన్ని రంగుల కారణంగా కొంతమందిలో  అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు దురద, దద్దుర్లు, వాపు తదితర లక్షణాలు టాటూ వేయించుకున్న వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనపడవచ్చు. టాటూల వల్ల అరుదుగా చర్మ కారక క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కొన్ని రంగులు లేదా వర్ణ ద్రవ్యాలు క్యాన్సర్‌ 
కారకాలు కావచ్చు.

జాగ్రత్తలు ఇలా..
– క్రిమిరహితం చేసిన సూదులు, మంచి నాణ్యమైన పిగ్మెంట్లు, ఉపయోగించిన సూదులు సరిగ్గా డిస్‌పోజ్‌ చేయడం వంటి ప్రమాణాలు పాటించే పేరున్న, లైసెన్స్‌ పొందిన స్టూడియోను ఎంచుకోవాలి. పరిశుభ్రతగల పరికరాలు భద్రతా ప్రమాణాలకు కొలమానాలు. అవి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు వీలుంటుంది.

– పచ్చబొట్టు వేసుకునే రోజున, ప్రక్రియ సమయంలో ఆకలి బాధలు, తల తిరగడం లేదా మూర్ఛ వంటివి నివారించడానికి పుష్కలంగా నీరు తాగండి. తగినంత ఆహారం తీసుకోండి. టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి తగినంత నిద్రకావాలి.

శుభ్రతతోనే.. సురక్షితం...
టాటూకి సురక్షితమైన ప్రొఫెషనల్‌ స్టూడియోను ఎంచుకోవాలి. ఆ ప్రదేశం కూడా పూర్తి పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు కలిగినా ఆర్టిస్ట్‌ను ప్రశి్నంచాలి.  నీడిల్స్‌ తమ ముందే ఓపెన్‌ చేయాలని కోరాలి. రీ యూజబుల్‌ మెటీరియల్‌ అంతా ఆటో క్లోవ్‌లో స్టెరైల్‌ చేశారో లేదో గమనించాలి. అలాగే టాటూ వేసే సమయంలో నొప్పి భరించగలిగినంతే ఉంటుంది. అయితే శరీరంలో తల, పాదాలు, చేతుల అడుగు భాగం, పొత్తికడుపు, వెన్నెముక వంటి కొన్ని భాగాల్లోని చర్మ స్వభావం వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. టాటూ వేసే సమయంలో వేసిన తర్వాత, కొన్ని రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. – అమిన్, టాటూ ఆర్టిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement