tattoo on body
-
ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు!
సాక్షి, సిటీబ్యూరో: నేను ఫ్యాషన్ లవర్ని అని చెప్పకుండానే చెప్పే మార్గం టాటూ.. ఇప్పుడు వయసుతో పనిలేకుండా అన్ని వర్గాల వారూ టాటూస్‌ని ముద్రించుకోవడం నగరంలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో టాటూస్ వినియోగంలో అనుభవం ఉన్నవారితోపాటు కొత్తగా వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నవారికీ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎంత ఫ్యాషన్ అయినప్పటికీ టాటూ కల్చర్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టాటూ వేయించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకో తెలియాలంటే.. టాటూ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనం తెలు సుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ లోపిస్తే వచ్చే పరేషాన్ ఏమిటో అర్థం అవుతుంది."స్వతహాగా చర్మ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా ముందుగా వ్యాధులు ఏవైనా ఉంటే, పచ్చబొట్టు వేయించుకునే ముందు వాటి గురించి వైద్యునితో చర్చించి వారి సలహా మేరకు టాటూ వేయించుకోవాలి."టాటూ వేయడానికి ముందు, దానికి వినియోగించే సూదులు క్రిమిరహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. స్టెరిలైజ్ చేయని లేదా కలుíÙతమైన సూదులను ఉపయోగించడం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ బీ–సీ వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. – వెంటనే లేదా టాటూ వేసిన మొదటి రెండు వారాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వాపు, నొప్పి, ఎరుపు, దురద లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జ్వరం, పుండ్లు లేదా చీముకు దారితీస్తుంది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే ముందు నాన్ స్టెరైల్ వాటర్‌ని కలిపితే స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి తరచి చూసుకోవడం అవసరం. – ఎంఆర్ఐ స్కానింగ్ ప్రక్రియలు చేయించుకుంటున్న రోగులు పచ్చబొట్టు పొడిచిన ప్రదే శంలో మంట, దురద లేదా వాపును అనుభవించవచ్చు. – ఇది తక్కువ–నాణ్యత లేని రంగులు లేదా టాటూ పిగ్మెంట్లలో ఐరన్ ఆక్సైడ్ వంటి రసాయనాల వల్ల కూడా కావచ్చు. – టాటూ వేయడానికి అయ్యే ఖర్చు కళాకారుడిపై మాత్రమే కాక ఉపయోగించిన సిరా రకం, పచ్చబొట్టు పరిమాణం, ఇంక్ చేయాల్సిన ప్రాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఖర్చుతో రాజీపడకుండా పేరున్న కళాకారుడితో టాటూ వేయించుకోవడం మేలు. – టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత రంగు వాడిపోతుంది. కాబట్టి, రంగు సాంద్రతను స్థిరీకరించడానికి కొన్ని టచ్–అప్లు అవసరం కావచ్చు. – స్కిన్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలను నివారించడానికి టాటూ అనంతర సంరక్షణ చాలా ముఖ్యం. ఆ ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకూ కళాకారుడి సలహాను పాటించండి.– టాటూలు వేసే పదాల స్పెల్లింగ్‌లు సరైనవని నిర్ధారించుకోవాలి. ఒక్కసారి టాటూ పూర్తయిన తర్వాత అక్షర దోషాలను సరిదిద్దలేరు. – మధుమేహం నియంత్రణలో లేకుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. – టాటూ ఆర్టిస్ట్ చేతులను కడుక్కొని, స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత టాటూ ప్రక్రియకు ముందు కొత్త గ్లౌజ్‌లు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. – ప్రక్రియకు 24 గంటల ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్‌ను తీసుకోవద్దు. ఈ పదార్థాలు రక్తాన్ని పలచన చేసేవిగా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రక్రియ సమయంలో అధిక రక్తస్రావం ఉండవచ్చు. – టాటూ కోసం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది. – కనీసం 24 నుంచి 48 గంటల ముందు రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకోకుండా ఉండటం మంచిది.అనారోగ్య ‘ముద్ర’.. అనస్థీషియా లేకుండా టాటూ వేయడం వల్ల కొంత నొప్పి, రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే టాటూ ఇంక్‌లో ఉండే రసాయనాలు లేదా లోహాలు, ప్రత్యేకించి కొన్ని రంగుల కారణంగా కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు దురద, దద్దుర్లు, వాపు తదితర లక్షణాలు టాటూ వేయించుకున్న వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనపడవచ్చు. టాటూల వల్ల అరుదుగా చర్మ కారక క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కొన్ని రంగులు లేదా వర్ణ ద్రవ్యాలు క్యాన్సర్ కారకాలు కావచ్చు.జాగ్రత్తలు ఇలా..– క్రిమిరహితం చేసిన సూదులు, మంచి నాణ్యమైన పిగ్మెంట్లు, ఉపయోగించిన సూదులు సరిగ్గా డిస్పోజ్ చేయడం వంటి ప్రమాణాలు పాటించే పేరున్న, లైసెన్స్ పొందిన స్టూడియోను ఎంచుకోవాలి. పరిశుభ్రతగల పరికరాలు భద్రతా ప్రమాణాలకు కొలమానాలు. అవి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు వీలుంటుంది.– పచ్చబొట్టు వేసుకునే రోజున, ప్రక్రియ సమయంలో ఆకలి బాధలు, తల తిరగడం లేదా మూర్ఛ వంటివి నివారించడానికి పుష్కలంగా నీరు తాగండి. తగినంత ఆహారం తీసుకోండి. టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి తగినంత నిద్రకావాలి.శుభ్రతతోనే.. సురక్షితం...టాటూకి సురక్షితమైన ప్రొఫెషనల్ స్టూడియోను ఎంచుకోవాలి. ఆ ప్రదేశం కూడా పూర్తి పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు కలిగినా ఆర్టిస్ట్‌ను ప్రశి్నంచాలి. నీడిల్స్ తమ ముందే ఓపెన్ చేయాలని కోరాలి. రీ యూజబుల్ మెటీరియల్ అంతా ఆటో క్లోవ్లో స్టెరైల్ చేశారో లేదో గమనించాలి. అలాగే టాటూ వేసే సమయంలో నొప్పి భరించగలిగినంతే ఉంటుంది. అయితే శరీరంలో తల, పాదాలు, చేతుల అడుగు భాగం, పొత్తికడుపు, వెన్నెముక వంటి కొన్ని భాగాల్లోని చర్మ స్వభావం వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. టాటూ వేసే సమయంలో వేసిన తర్వాత, కొన్ని రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. – అమిన్, టాటూ ఆర్టిస్ట్ -
విజయ్ దేవరకొండ ఫ్యాన్ గర్ల్.. వీపుపై టాటూ.. వీడియో వైరల్
Vijay Devarakonda Meets Fan Who Has His Tattoo Video Viral: సినీ నటీనటులను ప్రేక్షకులు ఎంతగానే అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వారిని చూసిన, వారిని కలిసినా ఎక్కడలేని విధంగా ఎమోషనల్ అవుతారు. వారి ఆనందానికి అవధులు లేవని ఆనందభాష్పాల ద్వారా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటన తాజాగా జరిగింది. తన అభిమాన హీరోను చూసిన ఆ ఫ్యాన్ భావోద్వేగానికి లోనయ్యారు. అతన్ని కలుసుకుని మాట్లాడటంతో సంతోషం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ హీరో ఎవరో కాదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్‌కు వీరాభిమాని అయిన చెర్రీతో పాటు మరో ఫ్యాన్ సోనాలి ఈ రౌడీ హీరోను కలిశారు. ఆ ఇద్దరితో సరదాగా ముచ్చటించి, కలిసి ఫొటోలు దిగాడు విజయ్ దేవరకొండ. అదే చోట ఉన్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మినీ వారిద్దరికి పరిచయం చేశాడు. తన వీపుపై విజయ్ దేవరకొండ టాటూతో అభిమానాన్ని చాటుకున్నారు చెర్రీ. ఈ క్రమంలోనే ఆనందభాష్పాలతో తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. "SUPER FAN MOMENT" - Some FANS convey their affection in a most personal way and High Respect when they ink their Star on their Body Dr. Cherry - Hope you had best surprise meeting VD Sir and you cherish this moment@TheDeverakonda #VijayDeverakonda #TeamDeverakonda pic.twitter.com/8CuxiyJUbt — Team Deverakonda (@TeamDeverakonda) June 30, 2022 -
ముసుగు తీసేద్దాం
‘‘మనందరం ముసుగులమే. ఇతరుల కోసం అబద్ధాలు ఆడుతూ, వాళ్లను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో మనం మనలా కాకుండా మరోలా ఉండే ముసుగు వేసుకుని బతుకుతున్నాం. ఆ ముసుగులు లేకుండా మనకు నచ్చినట్టుగా జీవించగలగాలి’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. వరలక్ష్మీకి ట్యాటూలంటే చాలా ఇష్టం. ఆల్రెడీ 7,8 ట్యాటూలను వేయించుకున్నారు కూడా. ప్రతి ట్యాటూకి ఓ స్టోరీ ఉంటుంది. లేటెస్ట్గా మరో రెండు ట్యాటూలకు తన శరీరం మీద చోటిచ్చారు. కొత్తగా వేయించుకున్న ఈ ట్యాటుల వెనక అర్థాన్ని వివరిస్తూ – ‘‘సినిమా మీద నాకున్న ఇష్టం, సినిమాల్లో ఉన్న ధీర మహిళలకు సపోర్ట్‌గా ఈ ట్యాటూలను వేయించుకున్నాను. మనం వేసుకున్న ముసుగులను ఉద్దేశిస్తూ మాస్క్ ట్యాటులు వేసుకున్నాను. ముసుగు వేసుకొని బతుకుతున్న మనందందరం ఏదో రోజు ఆ ముసుగుని తీసేద్దాం. మనల్ని మనమే ఇష్టపడటం నేర్చుకుందాం’’ అన్నారు వరలక్ష్మి. -
వీపెక్కిన దర్శన్
యశవంతపుర: అభిమానానికి హద్దులుండవు. తమ మనసు మెచ్చిన హీరో, లేదా నాయకుడి చిత్రాలను తలపై, శరీరంపై వేయించుకుంటూ ఉంటారు. అదే కోవలో ప్రముఖ బహుభాషా నటుడు దర్శన్ అభిమాని ఒకరు ఆయన ఫోటోను వీపుపై వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆనందరామ్ అనే అభిమాని వీపుపై దర్శన్ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది. దర్శన్ నటించిన ‘యజమాన్రు’ సినిమా టైటిల్నుకూడా రాయించుకున్నాడు. ఆనందరామ్ కరునాడ కులదీప దర్శన్ తూగుదీప అభిమాని సంఘం అధ్యక్షుడు. తన వీపుపై దర్శన్ వెలసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యాయి. దీనిని అనేక మంది అభిమాను షేర్ చేసి ఆనందరామ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. -
మేరా ‘శిఖర్’మహాన్!
హీరోలపై ఉన్న ఆకర్షణ ఎంతదాకా అయినా తీసుకెళుతుంది. ఒక్కోసారి మనం ఇష్టపడే స్టార్లే మనకు అభిమానులుగా మారిపోతుంటారు. అలాంటి అనుభవం..అదృష్టం నగర యువకుడు శేఖర్‌కు దక్కింది. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు వీరాభిమాని అయిన ఇతడు తన టాటూల ద్వారా ధావన్నే ఆకర్షించాడు. హిమాయత్‌నగర్: తమకు నచ్చిన ‘స్టార్లు’ అంటేఎవరికైనా అభిమానం పెల్లుబుకుతుంది. సినీస్టార్, స్పోర్ట్స్‌స్టార్, పొలిటికల్ స్టార్స్ ఎవరైనా సరే.. ఇష్టపడినవారితో ఏదో ఒకరోజు వారితో ఓ ఫొటోదిగాలనుకుంటాం. కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలని ఆశపడతాం. కొందరు మాత్రంఅభిమానమే ఊపిరిగా జీవిస్తారు. నచ్చిన వారి పేర్లను టాటూగా వేయించుకుంటారు. ఇదే కోవలోప్రముఖ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్పైవల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు నగరవాసి శంకర్. ఓ చేతిపై శిఖర్ ధావన్ రూపం, మరోచేతిపై ధావన్, అతని భార్య, పిల్లల పేర్లు,ఈ శరీరమంతా నా దేవుడే కనిపించాలంటూ వీపుపై శిఖర్ పేరుతో పాటు అతడు ధరించే జెర్సీ నంబర్‌ను సైతం టాటూగా వేయించుకున్నాడు. ఆహార్యాన్ని సైతం అతడిలాగే మార్చుకున్నాడు శంకర్. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో భాగంగా ఈ అభిమానిని ‘సాక్షి’ పలకరిస్తే శిఖర్‌పై తనకున్న వీరాభిమానాన్ని పంచుకున్నాడు. బేగంపేట్‌కు చెందిన శంకర్ వృత్తిరిత్యా ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాడు. జీ క్రికెటర్, కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్ఫూర్తితో క్రికెట్ ఆటలోకి ప్రవేశించాడు. అండర్–14 నుంచి నేషనల్స్, ఫెడరేషన్, డివిజన్స్, క్లబ్స్‌కి ఆడుతున్నాడు. ఈ ఆటలో ఇతగాడు ఆల్‌రౌండర్‌గా సైతం ప్రతిభ చాటుతున్నాడు. దేశంలో ఎందరో క్రికెటర్లు ఉండగా.. శేఖర్ మాత్రం ఢిల్లీకి చెందిన ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్‌పై అభిమానం పెంచుకుని పెద్ద ఫ్యానైపోయాడు. ఎంతగా తన ఒళ్లంతా శిఖర్ ధావన్‌ను గుర్తుచేసే టాటూలు వేయించుకున్నాడు. అంతేకాదు.. ధావన్ భ్యార్య, కొడుకు పేరు సైతం తన దేహంపై నింపేసుకున్నాడు. శంకర్ కుడిచేతిపై శిఖర్‌ధావన్ ముఖ చిత్రం మాత్రం ప్రేత్యకం. ఈ టాటూ వేసుకోవడమే కాదు.. దానిని తన అభిమాన క్రికెటర్‌కి చూపించాడు కూడా. శంకర్ భుజంపై ఆ చిత్రాన్ని చూసిన శిఖర్ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయాడట. అభిమానితోనే స్టార్ క్రికెటర్.. ఏ స్టార్ అయినా తనకున్న లక్షలాది మంది అభిమానులతో ఎంతలో ఉడాలో అంతవరకే ఉంటారు. కొందరిని పేరు పెట్టి పిలిచే స్టార్స్ కూడా ఉన్నారు. కానీ.. శంకర్‌కు శిఖర్ ధావన్‌కు మధ్యనున్న అభిమానాన్ని మాటల్లో వర్ణించలేం. తనపై ఇంత అభిమానాన్ని పెంచుకున్న శంకర్‌ను శిఖర్ చాలా బాగా చూసుకుంటాడు. మనదేశంలో ఎక్కడైనా మ్యాచ్‌లు జరిగితే ఆ మ్యాచెస్కి శంకర్‌ని కూడా ఫ్లైట్‌లో ధావన్ తీసికెళ్లడం ఓ గొప్ప విషయం. అందులోనూ పక్క సీటులో కూర్చుబెట్టుకోవడం చూసిన ప్రతి ఒక్కరూ వీరిద్దరి అభిమానం పట్ల కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఒంటిపై ఇష్టమైన నంబర్–25 శిఖర్ ధావన్‌కు ఇష్టమైన జెర్సీ నబంర్–25. శిఖర్ ఆడే వన్డే, టెస్ట్, 20–20 మ్యాచ్‌ల్లో తన జెర్సీపై కూడా ఇదే నంబర్ ఉంటుంది. దీనికి గుర్తుగా శంకర్ తన వీపుపై ‘శిఖర్ ధావన్–25’ అనే టాటూను వేసుకున్నాడు. అంతేకాదు డిసెంబర్–5న ధావన్ పుట్టినరోజు. ఆ రోజును పురస్కరించుకుని మ్యాచ్‌ల్లో బిజీగా ఉన్న ధావన్ వద్దకు వెళ్లిన శంకర్ ధావన్ డ్రస్సింగ్ రూమ్‌లో కేక్‌ను కట్ చేశాడు. ఓ సాధారణ అభిమాని అంతర్జాతీయ క్రికెటర్ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడం ఓ గొప్ప విషయంగా పరిగణిస్తున్నారు తోటి క్రీడాకారులు. ఇక శంకర్ పుట్టినరోజుకు శిఖర్‌ధావన్ వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పంపిన శుభాకాంక్షల మెసేజ్‌లు, వీడియోలు కోకొల్లలు. ఎఫ్బీలోధావన్ పోస్ట్ శంకర్ తనపై ఇష్టంతో వీపుపై వేయించుకున్న టాటూపై ధావన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ఎఫ్బీ ప్రొఫైల్‌లో పోస్ట్ కూడా పెట్టాడు. ‘చాలా లక్కీ.. శంకర్ లాంటి ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేయడం. శంకర్ టాటూ కూడా వేయించుకున్నాడు. శంకర్ నా దిల్ని కుష్ చేశాడు’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యింది కూడా. -
సెక్స్ బానిసల బ్రాండ్ నేమ్.. టాటూ!
పచ్చబొట్టు అక్కడి యువతుల జీవితాలను చిదిమేసే మాయని మచ్చగా మారింది. అమ్మాయిలను అంగడి బొమ్మలుగా మార్చేందుకు గుర్తుగా నిలుస్తోంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా విస్తరిస్తూ.. కొన్ని వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోంది. అమెరికాలో టాటూ.. ఈ ముఠాల బారినపడి బానిసత్వంలో మగ్గిపోతున్న యువతుల శరీరాలపై బ్రాండ్‌నేమ్‌గా కూడా చెలామణి అవుతోంది. అవును... ఇటీవల అమెరికాలో వెలుగులోకొచ్చిన నగ్నసత్యమిది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోట్లాది మంది మహిళలతో కొనసాగుతున్న వ్యాపారంగా పోలీసులు దీన్ని గుర్తించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌తో వ్యభిచార వృత్తిలోకి దించిన మహిళలకు, లైంగిక కార్యకలాపాల్లోకి నెట్టిన పిల్లలకు పచ్చబొట్టు ఓ సింబల్. అమెరికన్ పోలీసుల కంటపడ్డ ఓ అమ్మాయి కథ చూస్తే ఎన్నో మింగుడు పడని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మెడ ఎముక దగ్గర, నెక్లెస్ పై భాగంలో అందంగా రాసి ఉన్న రాత వెనుక పెద్ద చరిత్ర కనిపించింది. క్రీమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న హింసాత్మక వ్యాపారంలో లైంగిక బానిసలుగా ఉన్న 8 లక్షల మంది బాధితుల్లో 14 ఏళ్ల ఆడ్రియానా ఒకరు. ఆమె అవసరాన్ని అదనుగా చేసుకుని, పని చూపిస్తామని నమ్మబలికి రొంపిలోకి దింపారు. ఆమె ఒంటిపై టాటూ వేసేశారు. వివిధ దేశాల్లో పచ్చబొట్టు ఆధారంగా కోట్ల సంఖ్యలోనే బానిసలు ఈ బడా వ్యాపారంలో సమిధలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బానిసల చేతులు, పొత్తికడుపు, మెడపై వేసే ఆ టాటూలను బార్కోడ్లుగా కూడా ఉపయోగిస్తున్నారు. తమ శరీరంపై కనిపించే ఈ గుర్తులను తాము 'వార్ ఊండ్స్' గా పిలుస్తామని ఆడ్రియానా చెబుతోంది. ఈ టాటూల సంప్రదాయాన్ని రూపుమాపేందుకు ఇప్పుడు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అదే.. సర్వైవర్ ఇంక్. ఈ సంస్థ స్థాపకురాలు జెన్నిఫర్ కెంప్టన్ కూడా ఒకప్పుడు ఈ ఉచ్చునుంచి బయటపడ్డ బాధితురాలే. ప్రస్తుతం ఆమె స్వచ్ఛందంగా టాటూ బాధితులను లైంగిక బానిసత్వం నుంచి కాపాడేందుకు కృషి చేస్తోంది. కెంప్టన్ 12 ఏళ్ల వయసులోనే ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకుంది. తన సోదరుడి స్నేహితుడైన సాలెమ్ చేతిలో మోసపోయింది. అతడు ఆమెపై రేప్ చేసి, తర్వాత అక్రమంగా తరలించాడు. తర్వాత ఐదేళ్ల పాటు కెంప్టన్ పలువురి చేతిలో చిత్రవధ అనుభవించింది. కొన్ని ముఠాల బ్రాండ్లతో చిక్కుకుపోయింది. తన సొత్తుగా భావించిన సాలెమ్ తన ముఠా బ్రాండ్ నేమ్ అయిన కింగ్ మంచ్ పేరుతో ఆమె మెడపై టాటూను వేయించాడు. అదే సమయంలో మిగిలిన మరి కొన్ని ముఠాలు వారి వారి పేర్లను ఆమె చేతులు, వీపుపై టాటూలుగా వేయించారు. ఓహియో వాసి అయిన కెంప్టన్... అక్కడి వీధుల్లో బాలికలు, మహిళలు టాటూల బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారంటున్నారు. ఆ నరకాన్ని భరించలేక రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిన కెంప్టన్ సమయానికి తాడు తెగిపోవడంతో ప్రాణాలతో మిగిలిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే తాను తప్పించుకొనేందుకు సమయంగా భావించింది. ఇప్పడామె తన శరీరాన్ని పలు రకాల డిజైన్లతో అలంకరించుకుంది. ఇలా ముఠా బ్రాండ్‌ను తన శరీరం నుంచి చెరిపేయడంతో తనకు విమోచన కలిగిందంటోంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా ఏటా 1.33 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజం మూడో అతిపెద్ద నేరంగా పరిగణించిన ఉమెన్ ట్రాఫికింగ్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది.