ఇక శామ్‌సంగ్ స్మార్ట్‌హోమ్స్!
బెర్లిన్: దాదాపు 100 బిలియన్ డాలర్ల స్మార్ట్‌హోమ్స్ మార్కెట్‌పై దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ దృష్టి పెట్టింది. భవిష్యత్ తరం ఇళ్లకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థలతో కలసి పనిచేయనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ బూ-కియున్ యూన్ తెలిపారు. ఇప్పటికే తమ అనుబంధ సంస్థ స్మార్ట్ టెక్నాలజీస్ ఈ దిశగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రారంభించినట్లు ఎలక్ట్రానిక్స్ పరికరాల అంతర్జాతీయ ట్రేడ్ షో ఐఎఫ్‌ఏకి హాజరైన సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం భాగస్వామ్య సంస్థలతో కలిసి 1,000 పైగా పరికరాలు, 8,000 పైచిలుకు స్మార్ట్‌హోమ్ యాప్స్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఐఎఫ్‌ఏ జరగనుంది.
గోడలను జరిపి బెడ్‌రూమ్‌ను డైనింగ్ రూమ్‌గా మార్చడం, ఫర్నిచర్‌ను అవసరానికి అనుగుణంగా ఆటోమేటిక్‌గా మార్చడం, పీల్చే గాలిలో క్రిములను గుర్తించి .. సంహరించడం, ఇంట్లో నివసించే వారు తీసుకోవాల్సిన భోజనం, ఔషధాలు మొదలైన వాటిని గురించి గుర్తు చేయడం వంటి టెక్నాలజీలు స్మార్ట్‌హోమ్స్‌లో భాగంగా ఉంటాయి. విద్యుత్ వినియోగం అవసరాలను గుర్తించి, తదనుగుణంగా కరెంటును ఉపయోగిస్తాయి ఈ ఇళ్లు. భవిష్యత్ తరం గృహాలు రక్షణ కల్పించడంతో పాటు మనుషుల అవసరాలకు అనుగుణంగా స్పందించగలిగేవిగా ఉంటాయని యూన్ పేర్కొన్నారు. 2018 నాటికల్లా 4.5 కోట్ల స్మార్ట్‌హోమ్స్ ఉండగలవని, ఈ విభాగం మార్కెట్ 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని ఆయన అంచనా వేశారు.