ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్‌ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్‌ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది.
అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్‌ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్‌ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏఐ టూల్‌కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది.
వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి రియల్‌టైమ్‌లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి.
వేగవంతమైన ప్రాసెసర్
తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్‌లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్‌ప్లే అవుతాయి.
మనం ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది.
సర్వీసులు ఉచితమేనా
అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్‌ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది.
ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని
అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment