గొంతెండుతున్నా.. పట్టించుకోరా! | protest for water | Sakshi
Sakshi News home page

గొంతెండుతున్నా.. పట్టించుకోరా!

Published Mon, Apr 24 2017 11:48 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

గొంతెండుతున్నా.. పట్టించుకోరా! - Sakshi

గొంతెండుతున్నా.. పట్టించుకోరా!

– ప్రభుత్వంపై మండిపడిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు
– కర్నూలులో నీటి ఎద్దడిపై కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
– ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే కర్నూలులో తాగునీటి సంక్షోభం
– హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీటిని అనంతపురానికి తరలించడంపై మండిపాటు
– తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలును స్మార్ట్‌ సిటీగా మార్చుతామని ప్రగల్బాలు పలికిన టీడీపీ నాయకులు...వేసవిలో మాత్రం ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మండిపడ్డారు. కర్నూలు నగరంలోని 51 డివిజన్లతోపాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నీటి ఎద్దడిపై సోమవారం.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ప పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలతు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయం నుంచి గౌరు వెంకటరెడ్డి  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 
కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో గౌరు, బీవై రామయ్య మాట్లాడుతూ..కర్నూలులో చాలా వార్డుల్లో రాత్రి పూట వచ్చే నీళ్ల కోసం మహిళలు జాగారం చేయాల్సి వస్తోందన్నారు. కనీసం పది బిందెలు కూడా నిండకుండానే నీటి సరఫరా బంద్‌ అవుతుండడంతో వారి బాధలు వర్ణనాతీతమన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ఒట్టి పోయిందన్నారు. హంద్రీనీవా నీటిని జీడీపీ ద్వారా కర్నూలుకు తీసుకువస్తే జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడిని నివారించవచ్చన్నారు. అయితే అధికారులకు ఇక్కడ ముందుచూపు లేకపోవడంతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు కేటాయించిన 37 టీఎంసీల నీటిలో అనంతపురం జిల్లాకు 30 టీఎంసీలను తరలించుకుపోతున్నారన్నారు. దీంతో ఏడు టీఎంసీల నీటిలో జీడీపీకి కేవలం 0.7 టీఎంసీల నీటినే కేటాయించారన్నారు. జీడీపీ కనీస నీటి మట్టం 4.5 టీఎంసీలు కాగా కనీసం 2.5 టీఎంసీల నీటితో నింపి ఉంటే కర్నూలుకు నీటి ముప్పు తప్పేదన్నారు.
 
జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నా తాగునీటి ఎద్డడి నివారణ కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. సమస్య పరిష్కరించడం చేతకాకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ మురళీకృష్ణ, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
పది రోజులకొకసారి నీళ్లు వదులుతున్నారు: గౌరు చరితారెడ్డి
కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 14 డివిజన్లలో పది రోజలకొకసారి నీళ్లు వదులుతున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. ట్యాంకర్లు పంపాలని అడిగినా మునిసిపల్‌ అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు. ఇక్కడి ప్రజలు ఇంటి పన్నులు కట్టడం లేదా? నీటి పన్ను కట్టడంలేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. కర్నూలుతో పోల్చుకుంటే పాణ్యం వార్డుల్లో ఎక్కువ నీటి ఎద్దడి ఉందన్నారు. అంతేకాక వార్డుల్లో పారిశుద్ధ్‌య పనులు చేపట్టకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో కోట్లాది రూపాయలను వృథా చేశారని ఆరోపించారు.
బుదర నీటిని సరఫరా చేస్తున్నారు:  హఫీజ్‌ఖాన్‌
ఎస్‌ఎస్‌ ట్యాంకు ఒట్టిపోవడంతో నగర ప్రజలకు బుదర నీటిని సరఫరా చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ మండిపడ్డారు. కనీసం నీటిని క్లోరినేషన్‌ చేయకుండా వదులుతుండడంతో వాటినే తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఏ ఆసుపత్రిలో చూసిన పచ్చ, తెల్ల కామెర్లతో బాధపడుతున్నా చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉన్నారన్నారు. కర్నూలు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు.. మినరల్‌ వాటర్‌ పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో నాలుగైదు రోజులకు ఒకసారి కూడా సక్రమంగా నీళ్లు వచ్చే దాఖలాలు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మరో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ అవసరం
కర్నూలులో నీటి ఎద్దడి నివారణ కోసం మునగాలపాడు సమీపంలో మరో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణానికి కావాల్సిన 200 ఎకరాల భూమి ఉన్నా  పాలకులు ఆ ఊసే మరచారని నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్‌ విమర్శించారు. ఈ విషయం మునిసిపల్‌ ఇంజినీర్లకు తెలిసినా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కృష్ణారెడ్డి, నాగరాజుయాదవ్, సురేందర్‌రెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, అబ్దుల్‌ రెహ్మన్, రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, సలోమి, ఉమాభాయ్, కటారిసురేష్, రవిబాబు, సాంబా, జాన్‌, మాలిక్‌, కిశోర్‌, మంగప్ప, విజయలక్ష్మి, చెన్నమ్మ, వెంకటేశ్వరమ్మ, ఖాదామియా, రిజ్వాన్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement