పేదలకు రూ. 5లక్షల లోపే ఇళ్లు!
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ
♦ దేశంలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువకు ఇల్లు కొనుక్కునేవారు ఒక్కశాతమే
♦ రూ. 5 లక్షలలోపు అందిస్తే 30 శాతం మందికి ఇళ్లు
న్యూఢిల్లీ: పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే ఇళ్లను అందిస్తామని చెప్పారు. ‘తక్కువ ధరకు ఇళ్లు నిర్మించడం చాలా ముఖ్యమైన అంశం. మనదేశంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ వెచ్చించి ఇల్లు కొనుక్కునేవారు కేవలం ఒక్క శాతమే ఉన్నారు. రూ.5 లక్షల లోపు ఇళ్లను అందించగలిగితే దాదాపు 30 శాతం మంది వాటిని కొనుక్కోగలుగుతారు’ అని ఆయన చెప్పారు.
బుధవారమిక్కడ ‘స్మార్ట్ సిటీ’పై అసోచామ్ నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంతోపాటు పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కేంద్రం అధికార ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాగ్‌పూర్‌లో ప్రయోగ ప్రాతిపదికన ఇలాంటి వెంచర్ ఒకటి చేపట్టినట్టు వివరించారు. నిర్మాణానికి ఒక చదరపు అడుగుకు రూ.వెయ్యి వెచ్చించినట్టు వివరించారు. ఈ లెక్కన 450 చదరపు అడుగుల ఇంటిని రూ.5 లక్షలలోపే నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20న ఈ ఇళ్లను ప్రారంభించనున్నట్లు వివరించారు.