స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడను సమష్టి కృషితో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు.
కాకినాడ కలెక్టరేట్ : స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడను సమష్టి కృషితో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరాభివృద్ధికి అన్ని రంగాల అవసరాలను నివేదికలో పొందుపరచడం వల్లే కాకినాడకు జాబితాలో చోటు దక్కిందన్నారు. మంచినీరు, మురుగు వ్యవస్థతో పాటు మౌలిక, పౌర సదుపాయాల మెరుగుదల, సోలార్ విద్యుత్ వినియోగం, రైల్వే అభివృద్ధి, ఈఎస్‌ఐ ఆస్పత్రులు, విద్య, వైద్య రంగాలను కూడా నివేదికలో ప్రస్తావించినట్లు వివరించారు. తొలి జాబితాలో స్థానం దక్కడానికి పట్టణ పౌరులు, అనుభవజ్ఞులు, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయ సేకరణ కూడా ఎంతో ఉపకరించినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ అలీం బాషాల కృషి అభినందనీయమన్నారు.