స్మార్ట్ సిటీ స్థాయికి ఏలూరు | Smart City to Eluru | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిటీ స్థాయికి ఏలూరు

Published Thu, Aug 13 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

Smart City to Eluru

ఏలూరు (టూటౌన్) : ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఏలూరు నగర మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఏలూరును స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. నగరం మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అభివృద్ధిపై తీసుకోవలసిన చర్యలపై అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల, అధికారుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అంతర్జాతీయ స్థారుు కన్సల్టెన్సీ సేవలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం కన్నా తక్కువగా ఏలూరులో అభివృద్ధి ఉందన్నారు.
 
  సీఆర్‌డీఏ పరిధికి దగ్గరగా ఉండడం తదితర అంశాలను దృష్టిలో  ఉంచుకుని నగరం అభివృద్ధితో  పాటు, దానిని విస్తరింపచేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ కేవలం 11.58 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏలూరు నగరం ఉందన్నారు. ఈ పరిధిని మరింత విస్తరించి విశాల నగరంగా రూపొందించేందుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నామన్నారు. దీనికి గతంలో నాలుగైదేళ్లు పట్టేదని, సాంకేతికత అభివృద్ధితో ఏడాదిలోపే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించవచ్చన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ అవసరమైన టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు 4 వేల ఎకరాలను గుర్తించామన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కమిషనర్ వై.సాయిశ్రీకాంత్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 ప్రతి జిల్లాకు శిక్షణ  భవనం
 ఏలూరు(ఆర్‌ఆర్ పేట) :  ప్రతి జిల్లాలో పంచాయతీ శిక్షణ భవనం నిర్మిస్తున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్థానిక గ్జేవియర్ నగర్‌లో జిల్లా పంచాయతీ శిక్షణ  కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రూ. 2 కోట్ల వ్యయంతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ వివిధ మతాలకు సంబంధించిన శ్మశాన వాటికల ఏర్పాటుపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ఎంపీ మాగంటి బాబు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, వి.శివరామరాజు, కేఎస్ జవహర్, మేయర్ నూర్జహాన్, జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, డీపీవో డీ.శ్రీధర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్ అమరేశ్వరరావు, కార్పొరేషన్ విప్ గూడవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement